ప్రజాస్వామ్య ప్రభుత్వాల చరిత్రలో రైతుల గురించి ఆలోచించిన పాలకులు అరుదు. ఆ అరుదైన వారిలో ముందు వరసలో ఉండే నాయకుడు కేసీఆర్. ఆరు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో ఆగమైన తెలంగాణ వ్యవసాయాన్ని తన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో స్వర్ణయుగం చేశారు. భారతదేశ సమకాలీన చరిత్రలో ఏ పాలకుడు ఇంత స్వల్పకాలంలో వ్యవసాయరంగంలో ఇన్ని పథకాలు, పనులు చేపట్టి ఇంత మార్పు తీసుకువచ్చిన పరిస్థితి లేదు. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో సాగు ఆగమైంది.. రైతు బతుకు గందరగోళమైంది.
2014 నాటికి తెలంగాణ వ్యవసాయ రంగ పరిస్థితి అగమ్యగోచరం. నిలకడలేని కరెంటు. నీళ్లు లేని సాగు. భరోసా లేని వ్యవసాయం. అందుకే ఈ రంగాన్ని వదిలేసిన చాలా మంది రైతులు బతుకుదెరువు కోసం ఇతర రంగాల్ని ఎంచుకున్నారు. దశాబ్దాల పాటు దగాపడి వ్యవసాయరంగాన్ని వదిలేసిన వారిని తిరిగి నాగలి పట్టేలా, వారిలో ఆత్మైస్థెర్యం నిండేలా చర్యలు తీసుకున్న ఘనత కేసీఆర్‌ది. మొదట కరెంటు, ఆ తరువాత సాగునీరు, ఆ వెంటనే సాగు కోసం సావుకారి వద్ద అప్పులు చేయకూడదని ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు రైతుబంధు, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు, మట్టిని నమ్ముకున్న రైతు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి భరోసా ఉండేలా రూ.5 లక్షల రైతుబీమా, వంద శాతం పంటల కొనుగోళ్లు చేపట్టారు.
దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దగాపడి ఉద్యమించి వేరుపడి బాగుపడ్డ తెలంగాణ, కాంగ్రెస్ అబద్ధపు హామీలు నమ్మి నట్టేట మునిగింది. కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా అందుతుందన్న నమ్మకాన్ని అన్నదాతలు కోల్పోయారు. పంట చేతికొచ్చే సమయానికి కూడా పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు ఆందోళనలో చిక్కుకొన్నారు. అరకొర సాయం కూడా ఒక్కసారి ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు వేధిస్తున్నారు. గత ఫిబ్రవరిలో రైతుబీమా పథకం కింద ఎల్ఐసీకి చెల్లించాల్సిన రూ.441 కోట్లు ప్రీమియం చెల్లించలేదు. దీంతో 7606 మంది రైతులకు రూ.5 లక్షల చొప్పున రావాల్సిన బీమా పరిహారం ఆగిపోయింది.
కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమాను ప్రజలు, రైతుల మనస్సుల నుంచి తప్పించాలని, ఈ జూన్ 2 నుంచి ఇంటింటికీ ఇందిరమ్మ బీమా 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ కవరేజ్ అని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు గుప్పించారు. జూన్ 2 వచ్చింది.. పోయింది. కానీ రాష్ట్రంలో ఒక్క కుటుంబానికి కూడా బీమా చేయించలేదు. రైతుబంధు, రైతుబీమా పథకాలు అంతర్జాతీయంగా యూఎన్వో ప్రశంసలు అందుకున్న అద్భుతమైన పథకాలు. ప్రపంచంలో ప్రభావం చూపిన 20 అత్యుత్తమ పథకాల్లో ఇవి రెండు నిలబడ్డాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండింటి మనుగడనూ ప్రశ్నార్థకం చేసింది.
కాంగ్రెస్ నయవంచక పాలకులు మేడిగడ్డ బరాజ్‌లోని రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా పడావుపెట్టారు. 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయకుండా పనులు నిలిపివేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అమ్ముకొనేందుకు రైతులు కల్లాల్లో పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొన్నది.
ఇప్పుడు మళ్లీ యూరియా కోసం బారులు తీరాల్సి వస్తున్నది. యూరియా యాప్ రద్దు చేయాలని రైతులు ఉద్యమిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. సరైన ప్రణాళిక లేక, కేంద్రంతో సమన్వయం చేసుకోవడం చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కోసం గుమిగూడుతున్న రైతుల నుంచి తప్పించుకొనేందుకు యాప్‌ను తీసుకువచ్చింది. యాప్‌లో యూరియా ఎలా బుక్ చేసుకోవాలో అర్థం కాక రైతన్నలు ఆందోళనలో ఉంటే ఇప్పుడు యాప్ ద్వారా బుక్ చేసుకొని, యూరియా కోసం షాప్‌నకు వెళ్తే అక్కడ యూరియా లేదని చెప్తున్నారు. యూరియా కోసం వెళ్లిన రైతులకు ఇతర పురుగు మందులు అంటగడుతున్నారు. వాటిని కొంటేనే యూరియా ఇస్తామని అదనపు భారం మోపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతుధర వెంట్రుక మందం పెంచి, ఎరువుల ధరలు భారీగా పెంచుతూ, కంటితుడుపుగా సబ్సిడీ ఎరువులు అంటూ కాకిలెక్కలు చెప్తున్నది.
ఎన్నికల ప్రచారసభలో ప్రతి గింజా కొంటాం. ప్రతి క్వింటాలుకూ రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కుర్చీ ఎక్కిన తర్వాత రైతులకు మోసమే తప్ప చేసిన సాయం దక్కలేదు. కాంగ్రెస్ సర్కార్ మొదట రుణమాఫీని, ఆ వెంటనే రైతుభరోసా ఎగ్గొట్టింది. తర్వాత దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని చేతులు ఎత్తేసింది. అత్యధికంగా రైతులు సాగు చేసే దొడ్డు రకాలను పక్కనబెట్టి, కేవలం సన్న వడ్లకే బోనస్ అంటూ సరికొత్త నాటకానికి తెరలేపింది. ఇక ఇప్పుడు ఆ సన్న వడ్లలో కూడా కేవలం ఏడు రకాల వెరైటీలకే రూ.500 బోనస్ ఇస్తామంటూ కొర్రీలు పెడుతున్నది.
భౌగోళికంగా తెలంగాణలోని 33 జిల్లాలల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఎర్ర, ఒండ్రుమట్టి, నల్లరేగడి, లాటరైట్ భూములు ఉన్నాయి. ఇందులో ఒక్కో రకమైన నేలలో ఒక్కో రకమైన సన్న, దొడ్డు వడ్ల రకాలు పండుతాయి. ప్రభుత్వం సూచించిన రకాలు సాగుచేస్తే ఎకరాకు 15 నుంచి 20 బస్తాల దిగుబడి మాత్రమే వస్తుంది. రైతులకు అలవాటైన రకాలు సాగుచేస్తే ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తుంది.
ప్రధానంగా సన్నరకాలకే బోనస్ ఇస్తామని చెప్పి, అవే సాగు చేయాలని చెప్పడం ద్వారా ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఎగ్గొట్టడం, సన్నరకాలు మార్కెట్లోకి వస్తే వాటికి బహిరంగంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో వ్యాపారులే వాటిని కొనుక్కుంటారు.
అప్పుడు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి అనేది ఉండదు. అందుకే ప్రభుత్వం ఏకంగా 30 సన్న రకాలను బోనస్ జాబితా నుంచి తొలగించడం వెనుక అతి పెద్ద కుట్ర దాగి ఉన్నది. పంటల బీమా పథకం అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర వరకూ హడావుడి చేసింది. నిరుడు వానకాలం నుంచి పంటల బీమా అమలు అని ప్రకటించింది. గత ఏడాదికాలంగా దాని ఊసే ఎత్తడం లేదు. ఈ ఏడాది ఎల్ నినోను సాకుగా చూపి వరి, మక్క సాగు చేయవద్దని రైతులను బెదిరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, మరి పంటల బీమా పథకం ఎందుకు ప్రారంభించలేదు?
అధికారం కోసం నోటికొచ్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రైతులను నిలువునా మోసం చేసింది. తెలంగాణ వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది. కేసీఆర్ పాలనలో రాజులా బతికిన రైతన్న కాంగ్రెస్ పాలనలో సర్కార్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తున్నది. రైతును కాపాడుకొన్న కేసీఆర్ పాలనను, రైతును వేధిస్తున్న కాంగ్రెస్ పాలనను అన్నదాతలు పోల్చిచూసుకుంటున్నారు. తప్పుడు హామీలతో గద్దెనెక్కి, గద్దలా రైతులను పొడుస్తున్న కాంగ్రెస్ సర్కార్‌ను గద్దె దింపే సమయం కోసం ఎదురు చూస్తున్నారు.

– (వ్యాసకర్త: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ)
శేరి సుభాష్ రెడ్డి