ఆకాశం పెద్ద గాడుపు దుమారంతో తేటగైనట్టు, అగాధంలోకి అడుగేసిన వారికి మిణుగురు మెరుపేదో అర్థం చేయించినట్టు సమస్త తెలంగాణ యువతరానికి నేడొక నిశ్చితాభిప్రాయం ఏర్పడిపోయింది. చరిత్ర చదివినా, పెద్దలు వివరించినా కూడా డిజిటల్ డాంబికాల వల ఎంత మాయ చేయగలదో మోసపోయిన నవతరానికి నిర్దిష్టంగా తెలిసొచ్చింది. దశాబ్దాలపాటు నిప్పుల వంతెనపై నడుస్తూ నయ వంచకులపై మాట్లాడుకున్నవి, విద్రోహాలపై పాడుకున్నవి మరిచి ఆవారా అరుపుల వైపు తలతిప్పితే ఎంత ఆగమైపోతమో అనుభవపూర్వకంగా అందరికీ అర్థమైపోయింది. అందువల్లనే ఉద్యోగార్హులే కాదు, ఊరూరా యువకులందరూ మోసకారి కాంగ్రెస్‌పై మర్లవడుతున్నారు. అసలు తెలంగాణ యువలోకాన్ని నమ్మించి వంచించడంలో లోకల్ కాంగ్రెస్ లౌక్యమే కారణమా? రేవంత్‌రెడ్డి అబద్ధాలే ఆకర్షణాంశాలుగా నవ యువకుల వివేకాన్ని మూడేండ్ల కిందట బలితీసుకున్నాయా? అనేది కూడా అందరూ చర్చిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ, రాహుల్, ప్రియాంక గాంధీ, రేవంత్‌రెడ్డి, ఆయన వందిమాగధులను విశ్వాస ఘాతకులని యువత తేల్చేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ బూటకమని నిర్ధారణకు వచ్చారు. ‘సత్యం ఎల్లప్పుడూ నిర్దిష్టంగా ఉంటుంది. అనిర్దిష్టంగా ఉండదు‘ అని మార్క్స్ అన్నట్టు రాజకీయాల్లో కూడా సంస్థల స్వభావం, సమాజానికి ఇచ్చిన అనుభవం కూడా ఎల్లకాలం సజీవ సత్యంగానే నిలబడి ఉంటుంది. ఆ వాస్తవాన్ని అర్థం చేసుకొని, గమనంలోకి తీసుకొని రాజకీయ నిర్ణయం తీసుకోవడంలో, అనుభవలోపం కారణంగా కొత్త తరం పొరబడటం చరిత్రలో చాలా సార్లు జరిగింది. ఏమరుపాటు వల్ల గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ స్వాభావికతను పరీక్ష చేయకుండానే మన రాష్ట్రంలోని కొత్త తరం కూడా హస్తం పార్టీకి మద్దతుగా నిలిచింది. దానివల్లనే ఉరుములు, పిడుగులతో వాన హోరెత్తగానే, భూమి పొరల్లో నిద్రాణస్థితిలో పడుకున్న కప్ప బెకబెకలాడుతూ నీటిలోకొచ్చి హడావుడి చేసినట్టుగా కాంగ్రెస్ వచ్చిపడి రాష్ర్టాన్ని వెక్కిరిస్తున్నది.
నిజానికి వక్రబుద్ధి, ద్రోహ చింతన హృదయంలో ఇమిడిపోయిన వారి మనస్తత్వం ఎంత దాచుకున్నా దాగదు. పలు సందర్భాల్లో వంచక నైజం బయటపడుతూనే ఉంటుంది. కానీ అలాంటి వారిని అర్థం చేసుకొని బహిష్కరించడంలోనే సమాజం ఏకాభిప్రాయంతో ఉండదు. అలాగే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 2023 నవంబర్‌లో ‘చిల్లర డబ్బులు తెచ్చుకొని, తార్నాక బార్లో బీర్లు తాగి, బిర్యానీ తిని అరిగేదాక అరుస్తరు.. వాళ్లదేముంటది.. అడ్డామీది కూలోళ్లు‘ అని ఓయూ విద్యార్థులను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించినప్పుడే నవతరం అప్రమత్తం కావాల్సింది. అప్పుడే పీసీసీ పీఠం ఊడబీకే దాకా ఏఐసీసీపై యుద్ధం చేయాల్సింది. ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి వెయ్యి కోట్ల కథతో ఓయూను మూడేండ్లుగా ఊరిస్తూ వెక్కిరిస్తూనే ఉన్నాడు. ఒక్క ఓయూ మాత్రమే కాదు రాష్ట్రంలోని వర్సిటీలన్నీ నేడు విలవిలలాడుతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం వర్శిటీ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచడంతోపాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల జీత భత్యాలను మూడింతలు పెంచింది. 1,32,899 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. మరో 91,142 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్, ఆ దిశగా 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు.
కానీ ఉద్యోగాల భర్తీ సమయంలో అసత్యపు అరుపులు వివేకవంతుల చెవులనూ ఆకట్టుకుంటాయని అంచనాకు రాలేకపోయారు. ఉద్యోగాల కల్పనే కాదు కేసీఆర్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసి, నిరుద్యోగులకు సకల సదుపాయాలు కల్పించింది. 1991 నూతన సరళీకృత ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత 2000 సంవత్సరంలోనే ఏర్పడ్డ జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో నేటికీ సాధించలేని ప్రభుత్వ రంగ ఉద్యోగాల భర్తీని, కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చింది. ఒకవేళ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రకటించిన 91 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏనాడో పూర్తయ్యేది. అలాగే ప్రైవేట్ రంగంలోనూ రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులతో 18వేల పరిశ్రమలు కార్యరూపం దాల్చేవి. తద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చేవి.
ప్రభుత్వ ఉద్యోగులపైనా బీఆర్ఎస్ ప్రభుత్వం మమకారాన్ని చూపింది. 2015లో 43% ఫిట్మెంట్తోపాటు 2020లో బిశ్వాల్ కమిటీ (పీఆర్సీ) 7.5% సిఫారసు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా 30% ఫిట్మెంట్ ప్రకటించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా 61 ఏండ్లకు పెంచింది. ఇలా నిరుద్యోగులు, ఉద్యోగులకు దేశంలో ఏ సర్కార్ అండగా నిలవనంతగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచింది. ఇవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే గడిచిన తెలంగాణ మూడేండ్లలో తెలంగాణ ఏం కోల్పోయిందో తేలిగ్గానే అర్థమవుతుంది. సంక్షేమ రాష్ర్టాన్ని స్వల్ప కాలంలోనే సంగ్రామం చేయక తప్పని పరిస్థితికి నెట్టివేసింది కాంగ్రెస్ సర్కార్.
విపక్ష పార్టీగా సరూర్‌నగర్ స్టేడియంలో ఆనాడు ప్రియాంక గాంధీ నమ్మబలికిన యూత్ డిక్లరేషన్ హంగామాను గుర్తుచేసుకుంటే విద్రోహ విద్యలో కాంగ్రెస్ ఎంతగా ఆరితేరిందో అర్థం చేసుకోవచ్చు. ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ కొలువులు భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.4 వేల భృతి చెల్లిస్తామని ప్రకటించింది. ఇంకా విచిత్రంగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసే తేదీలను కూడా చెప్పుకొచ్చింది. వర్సిటీలకు నిధులు, డిగ్రీలకు ప్రత్యేక పారితోషికాలు, విద్యార్థినులకు స్కూటీలు ఇలా ఎన్నో అబద్ధాలతో నిండిన యూత్ డిక్లరేషన్‌ను చూసి, మూడేండ్ల అనుభవంతో పరిశీలిస్తే కాంగ్రెస్ పాలకులు గోబెల్స్‌కే గురువులని తేటతెల్లమవుతున్నది.
ఉద్యోగాల కల్పన సంగతి అటుంచితే, గ్రూప్-1 ప్రిలిమ్స్ అభ్యర్థులను, గురుకులాల ఉపాధ్యాయ అభ్యర్థులను, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఖాళీల భర్తీని గుర్తు చేసిన నిరుద్యోగులను అశోక్‌నగర్‌లో ఎలా వెతికి, వెతికి చితకబాదారో తెలంగాణ సమాజం చూసింది. తాజాగా కానిస్టేబుల్ ఖాళీల భర్తీలో సర్కార్ వంచనను నిలదీస్తున్న నిరుద్యోగులను దిల్సుఖ్నగర్ రోడ్లపై పరుగెత్తించి కొట్టిన ఉదంతాన్ని కూడా యావత్తు తెలంగాణ ప్రజానీకం గమనించింది. కాంగ్రెస్ పాలకులు విద్యార్థుల ఫీజులు కట్టరు, చదువును పట్టించుకోరు, కొలువులు ఇవ్వరు. పైగా వేలాది బడుల మెడపై కత్తిని వేలాడదీస్తున్నారు. గురుకులాలకూ గండం తెచ్చిపెట్టారు. చివరికి సెంట్రల్ వర్శిటీ భూములనూ బేరం పెట్టేంతగా బరి తెగించారు. విద్యార్థులు రాలిపోతున్నా, నిరుద్యోగులు ఒరిగిపోతున్నా నయవంచక కాంగ్రెస్ సర్కార్‌లో చలనమే లేకుండా పోయింది.
యువతరంపై ఇంత కక్షపూరిత ధోరణి కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. 1974లో గుజరాత్లో సీఎం చిమన్ భాయ్ పటేల్ అన్యాయాలకు వ్యతిరేకంగా ఎగసిపడిన నవ నిర్మాణ్ ఆందోళన తర్వాత ఎమర్జెన్సీ వ్యతిరేక పోరుకూ పునాదిగా మారింది. ఫలితంగా గుజరాత్లో హస్తం సమాధిలోకి చేరింది. అలాగే బిహార్‌లో అదే ఏడాది యువ వ్యతిరేక సర్కార్‌పై పిడికిలెత్తిన ఛాత్ర సంఘర్ష్ సమితి పోరాటం తదనంతరం జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ విప్లవానికి ఆయుధంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కార్ చర్యలతో కాంగ్రెస్ పార్టీ సమాధి కావడం ఖాయం.
నిరుద్యోగులు, విద్యార్థులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉంటున్నారు. ప్రత్యక్ష ఉద్యమాలతోపాటు సుప్రీంకోర్టు వరకు పోరాటానికి తోడుగా నిలబడుతున్నారు. యువత మథనపడుతూ నిరుత్సాహంగా ఉండిపోకుండా కదనరంగంలోకి దిగి కుట్రల కాంగ్రెస్‌కు చరమగీతం పాడేందుకు సన్నద్ధమైంది. బీఆర్ఎస్ యువ సంగ్రామానికి దారి చూపుతున్నది. భవిష్యత్తు తెలంగాణకు యువ సంగ్రామ సదస్సు వాగ్దానం చేయాలి. రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ కుట్రలు, తెలంగాణ వ్యతిరేక రాజకీయ శక్తుల కుయుక్తుల సమాధికి పునాది వేయాలి. యువతరమా.. తెలంగాణకు కండ్లు మీరే.. కాళ్లు మీరే.. తెలంగాణకు తొవ్వ మీరే.
– (వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
డాక్టర్ ఆంజనేయగౌడ్