‘మార్పు కావాలి- కాంగ్రెస్ రావాలి’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మొదటి నుంచి ప్రజలను ఏమార్చుతూనే ఉన్నది.తెలంగాణ భవితకు భరోసా ఇస్తామని, ప్రజల బతుకులను బాగు చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ మార్పుకు మంగళం పలికి ఇప్పుడు నిత్యం ప్రజలను ఏడిపిస్తున్నది. మార్పు, ప్రజాపాలన అంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకపోగా ఇతర హామీలను కూడా తుంగలో తొక్కింది. ముఖ్యంగా మద్యం విక్రయాలను నియంత్రిస్తామని, రేట్లు తగ్గిస్తామని, బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తేస్తామని హామీ ఇచ్చిన హస్తం పార్టీ నేడు అందుకు విరుద్ధంగా తెలంగాణను బార్లు, బీర్ల తెలంగాణగా మార్చింది.
అలవికానీ హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి వాటిని అమలు చేయకపోగా, ఖజానా నింపుకునేందుకు పేద ప్రజలపై భారం మోపడం సిగ్గుచేటు. సంపద సృష్టించి వాగ్దానాలను నెరవేర్చాల్సింది పోయి ప్రజలను తాగుబోతులను చేసి, ప్రజల జేబులను గుల్ల చేసి, వారి సొమ్మునే తిరిగి పథకాల రూపంలో ఇవ్వాలనుకోవడం విడ్డూరం. ఒక చేత్తో రైతుబంధు ఇచ్చి, మరో చేత్తో మద్యం ద్వారా దోపిడీ చేస్తున్నారని గతంలో విమర్శించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు చేస్తున్నది ఏమిటి?
Congress Govt | రేవంత్‌రెడ్డి హయాంలో అన్ని రంగా ల్లో తిరోగమిస్తున్న తెలంగాణ.. ఒక్క మద్యం విక్రయాల్లో మాత్రం పురోగమిస్తున్నది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఇస్రో రాకెట్‌తో పోటీపడి నింగిలోకి దూసుకెళ్తున్నాయి. తెలంగాణ బతుకు చిత్రాన్ని ఛిద్రం చేస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తున్న రేవంత్‌రెడ్డి.. బడుగు, బలహీన వర్గాలు, పేదల జేబులు గుల్ల చేస్తున్నారు. అత్యంత దుర్మార్గంగా ఆదాయం పెంచుకునేందుకు ధరలు పెంచి పేదల శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు. కాసులు, కమీషన్లకు కక్కుర్తి పడి బడుగుల బతుకులను ఆగం చేస్తున్నారు.
మద్యం ధరల పెంపు విషయంలో రేవంత్‌రెడ్డి సర్కారు మొదటి నుంచి గోప్యత పాటిస్తున్నది. బీర్ల కంపెనీలతో ముందస్తుగా లోపాయికారి ఒప్పందం చేసుకున్న కాంగ్రెస్ సర్కారు హైడ్రామా చేసింది. బీర్ల కంపెనీలతో బేరసారాలు చేసిన పాలకులు మొదట ఉద్దేశపూర్వకంగా బిల్లులు ఆపేశారు. ఆ కంపెనీలు డిమాండ్ చేస్తున్నట్టు ధరల పెంపునకు అనుమతించబోమని, పేదలను దోపిడీ చేయడానికి సహకరించమని గప్పాలు కొట్టారు.
వాళ్లపై ఒత్తిడి చేసి,సరఫరా నిలిపివేసి, ఆ కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ తర్వాత రాత్రికి రాత్రి లోపాయికారి ఒప్పందం చేసుకొని ధరల పెంపునకు అనుమతించారు. ఆ కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లకుండా చేశారు. ఇటు కంపెనీలకు ఆదాయం పెరిగేలా, అటు రేవంత్‌రెడ్డికి ఆర్ఆర్ టాక్స్ రూపంలో కమీషన్లు ముట్టేలా జరిగిన ఈ చీకటి ఒప్పందాన్ని చూస్తుంటే ఇరువురి మధ్య క్విడ్ ప్రోకో జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతున్నది.
ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తతంగంపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. మొదట రేట్లు పెంచనని, ప్రజలను దోపిడీ చేయడానికి అనుమతించబోమని తెగేసి చెప్పిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఎందుకు రేట్లు పెంచాల్సి వచ్చిందో విచారణలో తేల్చాలి. ఏ లోపాయికారి ఒప్పందం వల్ల రేట్లు పెంచాల్సి వచ్చింది? ఏయే కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి? ప్రజలపై ఎందుకు భారం వేస్తున్నారు? తదితర ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
అలవికానీ హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి వాటిని అమలు చేయకపోగా, ఖజానా నింపుకునేందుకు పేద ప్రజలపై భారం మోపడం సిగ్గుచేటు. సంపద సృష్టించి వాగ్దానాలను నెరవేర్చాల్సింది పోయి ప్రజలను తాగుబోతులను చేసి, ప్రజల జేబులను గుల్ల చేసి, వారి సొమ్మునే తిరిగి పథకాల రూపంలో ఇవ్వాలనుకోవడం విడ్డూరం. ఒక చేత్తో రైతుబంధు ఇచ్చి, మరో చేత్తో మద్యం ద్వారా దోపిడీ చేస్తున్నారని గతంలో విమర్శించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు చేస్తున్నది ఏమిటి?
అమాయకులైన ప్రజలందరినీ మద్యానికి బానిసలను చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పల్లెలను నాశనం చేస్తున్నది. మార్పు, ప్రజాపాలన అంటూ ఊదరకొడుతున్న రేవం త్ రెడ్డి సర్కారు గ్రామ ప్రజల జీవితాలను ని ర్వీర్యం చేస్తున్నది. రేవంత్‌రెడ్డి ఏడాది పాలన లో డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం, గుడుంబాలతో తెలంగాణ పల్లెలు తాగుడు కేంద్రాలుగా మారిపోయాయి. కల్లు కేంద్రాలపై దాడులు చే స్తున్న ఎక్సైజ్, నార్కోటిక్ బ్యూరో అధికారులు అక్రమ కేసులు బనాయించి గీత కార్మికులను వేధింపులకు గురి చేస్తూ పరోక్షంగా ప్రజలను మద్యం తాగేలా ప్రోత్సహిస్తున్నారు. గీత కార్మికుల సంక్షేమానికి గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయకపోగా, కేసు లు బనాయించి వృత్తిని కాటగలుపుతున్నారు.
కొత్త పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో మార్పు తీసుకొస్తారని భావించిన రేవంత్‌రెడ్డి మాట తప్పి, ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నారు. కంపెనీలు తీసుకొచ్చి, సంపద సృష్టించి యువతకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి తాగుబోతులను చేస్తున్నారు. ధరలు భారీగా పెంచేసి ప్రజలను మద్యానికి బానిసలుగా చేసి జలగల్లా పీక్కుతింటున్నారు. గుడుంబా కేంద్రాలు, బెల్ట్ షాపులకు తోడు కల్తీమద్యాన్ని ఏరులై పారిస్తూ ఎందరో మహిళలను వితంతువులుగా మారుస్తున్నారు. పచ్చని సంసారాలను కూల్చి అనేక కుటుంబాలను అనాథలను చేశారు.
మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అంటే ఇదేనా? పల్లెలను నిర్వీర్యం చేయడమే ప్రజాపాలనా? బడుగుల బతుకులను ఆగం చేసి రోడ్డుపై పడేయడమే మార్పా? ఇందిరమ్మ రాజ్యం అంటే కంపెనీలతో లోపాయికారి ఒప్పందం చేసుకొని ప్రజలను దోచుకోవడమా? కంపెనీలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయా? లేదా కంపెనీల కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా? అనేది స్పష్టం చేయాలి. ఎన్నికల్లో మాట ఇచ్చినట్టు ఇప్పటికైనా మద్యాన్ని నియంత్రించి పేదల బతుకులు ఛిద్రం కాకుండా కాపాడాలి.
– బాల్క సుమన్
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే