దేహాన్ని ఆయుధంగా చేసి..!ఆయువును ఇంధనంగా మలచి..!యంత్రాలను మిత్రులుగా మార్చి..!ప్రాణాలను పణంగా పెట్టి.. చెమటోడ్చి, శ్రమించి..!నల్ల బంగారాన్ని వెలికితీసి..!సింగరేణిని సిరుల గనిగా తీర్చిదిద్దిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది.లోకానికి వెలుగును పంచే నల్ల సూరీళ్ల నాశనానికి పూనుకున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.
సింగరేణి నల్ల బంగారం.. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని బొంద పెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే కుట్రలు చేస్తున్నాయి. 130 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే కుట్రతో పోయిన ఏడాది బెంగళూరులో ఇన్వెస్టర్ల భేటీలో 4 సింగరేణి బొగ్గు బ్లాకులను అధికారికంగా వేలం వేసిన నాటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లాభాల్లో కార్మికుల వాటా తగ్గించి, తద్వారా ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బకొట్టి, వారి భాగస్వామ్యం లేకుండా చేసి, సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రలకు మద్దతుగా నిలుస్తున్నది.
పదేండ్ల కేసీఆర్ పాలనలో సింగరేణికి స్వర్ణయుగం అనే చెప్పాలి. కార్మిక సంక్షేమంతో పాటు, సంస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం వల్ల సింగరేణి అద్భుత ప్రగతిని సాధించింది. తత్ఫలితంగా సింగరేణిలో లాభాలు గణనీయంగా పెరగడంతో అందుకనుగుణంగా కార్మికుల వాటాను పెంచుతూ కార్మిక పక్షపాతిగా నిలిచారు కేసీఆర్.
Singareni | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైంది. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారు. సంస్థ గడించిన లాభాల ఆధారంగా కార్మికులకు ఇచ్చే బోనస్‌ను కూడా బోగస్ చేశారు. ఈ ఏడాది అంటే 2023-24కు వచ్చిన లాభాలు రూ.4701 కోట్లు కాగా ప్రభుత్వం చెప్పిన విధంగా 33 శాతం లాభాలు పంచితే మొత్తంగా దాదాపు రూ.1550 కోట్లు కార్మికులకు రావాల్సి ఉన్నది. లాభాలేమో రూ.4,701 కోట్లు చూపించి, కేవలం రూ.2,412 కోట్లలో 33 శాతం బోనస్‌ను ప్రకటించడం కార్మికుల కష్టాన్ని దోచుకోవడమే! కార్మికులకు న్యాయంగా అందించాల్సిన మిగతా రూ.2,289 కోట్లకు బోనస్‌ను ఎగ్గొట్టడం కాంగ్రెస్ దగాకోరుతనానికి నిదర్శనం.
కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సింగరేణి కార్మిక వ్యతిరేక చర్యలకే పాల్పడ్డది. సమైక్య రాష్ట్రంలో 80, 90 దశకాల్లో యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరించి వేలాది మంది కార్మికులను అరిగోస పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఉమ్మడి రాష్ట్రంలో కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తూ కార్మికులను బానిసలుగా మార్చిన యాజమాన్యానికి మద్దతుగా నిలిచింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ. కార్మికుల రక్షణ గాలికి వదిలేసి గనులలో ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టని కారణంగా అనేక సందర్భాల్లో గనులలో కార్మికులు సజీవ సమాధి అయితే అమానవీయంగా వ్యవహరించి యాజమాన్యానికి మద్దతుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. ఏండ్ల తరబడి ఎటువంటి ప్రమోషన్లు ఇవ్వకుండా కార్మికుల శ్రమ దోపిడి చేసింది. ఏండ్లకేండ్లుగా వేజ్ బోర్డులను ఆలస్యం చేసి కార్మికులను ఆర్థిక దోపిడికి గురిచేసింది. వారసత్వ ఉద్యోగాలు రద్దు చేస్తూ యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్న సందర్భంలో మద్దతుగా నిలిచాయి కాంగ్రెస్, ఐఎన్టీయూసీ. ఓపెన్ కాస్ట్ మైనింగ్‌కు ఒప్పుకొని లక్షకు పైగా ఉన్న కార్మికుల సంఖ్యను 40 వేలకు కుదించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. నేడు అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే కార్మికులకు న్యాయంగా చెల్లించాల్సిన బోనస్‌ను 50 శాతానికి తగ్గించి కార్మికులపై తనకున్న అక్కసును మరొక్కసారి వెళ్లగక్కింది రేవంత్‌రెడ్డి సర్కార్.
పదేండ్ల కేసీఆర్ పాలనలో సింగరేణికి స్వర్ణయుగం అనే చెప్పాలి. కార్మిక సంక్షేమంతో పాటు, సంస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం వల్ల సింగరేణి అద్భుత ప్రగతిని సాధించింది. దీనిద్వారా సింగరేణిలో లాభాలు గణనీయంగా పెరగడంతో అందుకు అనుగుణంగా కార్మికుల వాటాను పెంచుతూ కార్మిక పక్షపాతిగా నిలిచారు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో నష్టాలే తప్ప లాభాలు చవిచూడని సంస్థను లాభాల బాటలో పయనించేలా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే రూ.400 కోట్ల లాభాలు గడించేలా చేసింది. ఇప్పుడు అంచెలంచెలుగా రూ.4000 కోట్లకు పైగా చేరిందంటే అది కేసీఆర్ కృషినే. ఉమ్మడి రాష్ట్రంలో 1999-2014 వరకు 376 కోట్లు లాభాలు మాత్రమే కార్మికులకు పంచగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.2,780 కోట్లు కార్మికులకు అందించారు.
ఇక కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల పట్ల, సంస్థ పట్ల ఎలా వ్యవహరిస్తుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగరేణి సంస్థ మనుగడనే బొగ్గు తవ్వకంపై ఆధారపడి ఉంటుందన్నది అందరికీ విదితమే. అలాంటి సంస్థ అభివృద్ధి చెందాలంటే ఎప్పటికప్పుడు కొత్త బొగ్గు బ్లాక్‌లను కేంద్రం కేటాయించాల్సి ఉంటుంది. అలాంటి లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు బ్లాకులను కేటాయించకపోగా సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాక్‌లను వేలం వేయడం ద్వారా సంస్థ ఉత్పత్తిపైన పెనుభారం పడనున్నది.
బొగ్గు ఉత్పత్తి లేని సింగరేణి సంస్థ బతుకలేదు కనుక తెలంగాణకు ఆర్థిక, సామాజిక జీవనాడి లాంటి సింగరేణిని దెబ్బకొట్టి తెలంగాణను చీకటిమయం చేయాలని చూస్తుంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. అయినప్పటికీ సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చీకటి ఒప్పందాలతో మిలాఖత్ అయ్యాయి. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బొగ్గు గనుల వేలం ప్రక్రియలో సాక్షాత్తు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొనడమే దీనికి నిదర్శనం.
2023 నవంబర్ 12న ప్రధాని మోదీ రామగుండం పర్యటన సందర్భంగా సింగరేణిని ప్రైవేటీకరించబోమని పట్టపగలు పచ్చి అబద్ధాలాడారు. నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంపైన, తెలంగాణ ప్రజల పైన మొదటి నుంచి విషం కక్కుతున్నారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను దెబ్బ కొట్టి తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని చూసిన కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు నిర్ణయాన్ని ముందే పసిగట్టిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2021, డిసెంబర్ 7న సుమారు 450 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిల్వలున్న కేకే6 అండర్ గ్రౌండ్ గని, శ్రావణపల్లి ఓసీ బ్లాక్, సత్తుపల్లి వద్ద గల జేవీఆర్ ఓసీ-3, కోయగూడెం ఓసీ 3 బ్లాకులను తమకే కేటాయించాలని ప్రధాని మోదీకి లేఖ రాసినా పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాకుండా సింగరేణి కార్మికుల ఇన్కమ్ టాక్స్ మాఫీపై తెలంగాణ ఏర్పడిన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే కేసీఆర్ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా అతీ గతీ లేదు. వాస్తవానికి సింగరేణి ప్రైవేటీకరణపై బీజేపీ చేస్తున్న కుట్రలు ఈరోజువి కావు. 1997లో కేంద్రంలో ఉన్న వాజపేయి సర్కార్ ఎల్పీజీ (లిబరలైజ్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) చర్యలను వేగవంతం చేస్తూ క్యాప్టివ్ మైన్స్ సిస్టం ద్వారా సింగరేణి ప్రైవేట్‌పరం చేయాలని పావులు కదిపారు. ఉద్యమ నాయకుడే రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండటంతో ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం సింగరేణి వైపు చూడటానికి కూడా సాహసించలేదన్నది ముమ్మాటికీ నిజం.
నేల తల్లి గర్భంలో ప్రకృతికి విరుద్ధంగా అండర్ గ్రౌండ్లో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న అండర్ గ్రౌండ్ కార్మికుల అలవెన్స్ 12 శాతం మీద ఏటా రూ.లక్ష ఇస్తే అందులో రూ.10 వేలకు మాత్రమే ఇన్‌కమ్‌టాక్స్ మినహాయింపు ఇవ్వడం అత్యంత బాధాకరం. సింగరేణి క్వార్టర్ కలిగిన కార్మికుడి జీతంపైన పెర్క్టాక్స్ను కోల్ ఇండియాలో అమలుచేస్తున్న విధంగా సింగరేణిలో కూడా యాజమాన్యమే చెల్లించాలని కార్మికులు ఏండ్లుగా కోరుతున్నా పెడచెవిన పెట్టారు.
సింగరేణి ప్రైవేటీకరిస్తే వచ్చే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. సింగరేణికి-ప్రైవేట్‌వాళ్లకు బొగ్గు అమ్మకాల్లో పోటీ పెరుగుతుంది. ప్రైవేటు మాఫియా వారు కార్మికుల శ్రమను దోపిడి చేస్తారు. కార్మికుల రక్షణకు, పర్యావరణానికి ప్రైవేట్ మాఫియా ప్రాధాన్యం ఇవ్వవు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటించరు. కొత్త గనులు రావు. వారసత్వపు ఉద్యోగాలు ఉండవు. గనులు మూతపడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. కార్మికులకు న్యాయంగా అందవలసిన హక్కులు, బోనస్‌లు, అలవెన్స్‌లకు గండి కొడతారు. దేశ సంపద ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే వారు మాత్రమే అభివృద్ధి చెందుతారు. దీని వల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదు. కొద్ది రోజుల్లోనే సింగరేణి సంస్థ కనుమరుగవుతుంది.
సింగరేణి అభిమాన సంస్థ. నాడు, నేడు, ఏనాడైనా సింగరేణి సంస్థను కాపాడాలన్న, కార్మికులను కడుపున పెట్టుకుని చూసుకోవాలన్నా ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనంతరం సింగరేణికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందించింది. అందులో ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాలు, కార్మికుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం, 26 వారాల మెటర్నిటీ లీవ్, అన్ని మతాల పండుగలకు పెయిడ్ హాలిడే, ఐఐటీ, ఐఐఎంలలో సీటు సంపాదించిన కార్మికుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్, ఇల్లు కట్టుకునే వారికీ రూ.10 లక్షలు వడ్డీ లేని రుణం, జీవో-76 ద్వారా సింగరేణి ఏరియాలో నివసించే వారికి పట్టాల పంపిణీ, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచితంగా మంచినీటి సరఫరా, ఉచితంగా ఎలక్ట్రిసిటీ.. సింగరేణి క్వార్టర్లు, డ్యూటీలో చనిపోయిన కార్మికుడికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, రిటైర్మెంట్ వయస్సు 61కి పెంపు సింగరేణి కార్మికుల పిల్లలకు మెడికల్ సీట్లలో 5 శాతం కోటా, రామగుండం మెడికల్ కాలేజీలో 7 సీట్లు సింగరేణి కార్మికుల పిల్లలకే కేటాయించడం, సిమ్స్ అనుబంధంగా ఏర్పాటుచేస్తున్న దవాఖానలో 50 పడకలు సింగరేణి కార్మికులకు రిజర్వ్ చేయ డం.. ఇలా అనేక కార్మిక సంక్షేమ పథకాలు అందించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది.
ఇప్పటికే 10 నెలల కాలంలో పాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ హయాంలో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఇప్పుడు కార్మికులకు లాభాల వాటలో 50 శాతం కోత విధిస్తూ తీవ్ర అన్యాయం చేసింది కార్మిక ద్రోహి కాంగ్రెస్ సర్కార్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలు రూ.2,222 కోట్లు అయితే దీనిలో 32 శాతం అనగా దాదాపు రూ.710 కోట్లు కార్మికులకు అందించారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా కార్మికులకు చెల్లించినట్టుగానే లాభాల్లో వాటా చెల్లించాలి. మొత్తం రూ.4,701 కోట్లలో 33 శాతం బోనస్‌గా ప్రకటించాలి. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో ఎంతో కీలకంగా ఉన్న సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కేసీఆర్ నాయకత్వంలో కార్మికుల పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుంది.
-బాల్క సుమన్
(వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకులు)