‘నిండా మునిగినోడికి సలెక్కడిదన్నట్టు’ రాజకీయ నిచ్చెనలో తిట్లనే నమ్ముకున్న కాంగ్రెస్ నాయకులు అధికార పీఠం ఎక్కాక కూడా వాటిని వదులుకోవడానికి, నోటిని అదుపులో పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. అధికార హోదాలో హుందాగా ఉండాలన్న సోయి వాళ్లకు లేకుండాపోయింది. పైగా, తాము పెరిగిన నేపథ్యం అలాంటిది కాబట్టి, మాటలు కూడా అలా వస్తాయంటూ తమ వాచాలత్వాన్ని తామే సమర్థించుకుంటున్నారు. రాజకీయ వేదికలు, పరిపాలనా వేదికలు, టీవీ చర్చా కార్యక్రమాలు అన్న తేడా లేకుండా మైకు దొరికితే చాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ను తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ‘తొక్కి నార తీస్తా’, ‘పండబెట్టి తొక్కుతా’, ‘పేగులు మెడలేసుకుంటా’, ‘బట్టలిప్పదీసి ఊరంతా తిప్పుతా’ లాంటి మాటలు తమ పదవులకు వన్నె తెస్తాయని అనుకుంటున్నారేమో పాపం!
మాజీ మంత్రి హరీశ్‌రావు రాజకీయ అనుభవమంత కూడా వయస్సులేని చోటా మోటా నాయకులు ఆయనపై అవాకులు, చెవాకులు పేలుతున్నారు. తమ నాయకుడు తిట్లతోనే ముఖ్యమంత్రి అయ్యారు, తాము కూడా ఎవరిని పడితే వారిని తిడితేనే పదవులు ఇస్తారేమోననే భ్రమలో వాళ్లున్నట్టున్నారు. కానీ, అది అసాధ్యం. అధికార పక్షమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేసే హక్కు ప్రతిపక్ష నేతలుగా ఉన్న మాలాంటి వాళ్లకు ఉంటుంది. సలహాలు ఇచ్చే అధికారం ఉంటుంది. వాటిని పరిగణనలోకి తీసుకొని అమలు చేయాలి తప్ప, ఎవరు మాట్లాడితే వాళ్లమీదికి పెంకలో వేసిన మక్కగింజల్లా ఎగిరెగిరి పడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అంతేకాదు, సమస్యలను పక్కదోవ పట్టించడానికి వ్యక్తిగత దూషణలకు, ఆరోపణలకు దిగుతున్నారు. బీఆర్ఎస్, ఆ పార్టీ నాయకులపై అసత్యాలు, అబద్ధాలు, వదంతులు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారు.
నిజానికి ఏదో వెలగబెడుతుందని కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. ఆరు గ్యారెంటీల ఆశజూపి ప్రజలను దగా చేసిన కాంగ్రెస్ నాయకుల అసలు స్వరూపం బయటపడటంతో ఇప్పుడు ప్రజలే కాంగ్రెస్ నాయకులను రాయలేని భాషలో తిడుతున్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూ హైదరాబాద్‌లో తిరుగకుండా రాష్ట్రం నలుమూలలా తిరిగితే తెలుస్తుంది ప్రజలు వారిని ఏ విధంగా సన్మానిస్తారో. రాష్ట్ర అభివృద్ధిపై సమీక్షలు జరుపకుండా, రైతులకు సరిపడా ఎరువులు సరఫరా చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ తప్పులను కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారు. కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్, మరికొన్నిరోజులు ఈ-కార్ రేసింగ్‌లో అవినీతి, అక్రమాలు అంటూ పబ్బం గడిపారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ జరుగలేదని స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో పని చేసే పోలీసులే తేల్చిచెప్పడంతో హస్తం నాయకుల మొహాలు చిన్నబుచ్చుకున్నాయి.
‘నోరు మంచిదైతే ఊరు మంచిదైతది’
అనే సామెత కాంగ్రెస్ నాయకులకు తెలియదనుకోలేం. అడ్డూ, అదుపూ లేకుండా జాలువారే తిట్ల వల్ల మీడియాలో ప్రచారం ఎక్కువగా లభిస్తుందనుకుంటే ఒక్కరోజు కోసం మూతిమీసాలు గొరిగిచ్చుకున్నట్టవుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.
‘ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం’ అన్నట్టు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన నాయకులు లేకపోవడంతో అసమర్థులకు కూడా పదవులు దక్కుతున్నాయి. ఆ పదవులు ఉన్నాయి కదా అని పెదవులను ఇష్టారీతిన ఆడిస్తామంటే ప్రజలు సహించరు. దబ్బునంలో దారం పెట్టి ఆ పెదవులకు కుట్లు వేయడమూ ప్రజలకు తెలుసు.
స్వయాన ముఖ్యమంత్రే సమయం, సందర్భంతో సంబంధం లేకుండా తిట్ల పురాణం అందుకుంటున్నారు. తెలంగాణ విధాత, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ చావును కోరుకోవడం ఏలికల సంస్కారహీనానికి నిదర్శనం. హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దిన కేటీఆర్‌పై అవాకులు చెవాకులు పేలారు. ‘తొక్కి నార తీస్తా’, ‘లాగులో తొండలేస్తా’, అంటూ తెలంగాణ సమాజానికి కొత్త బూతులు నేర్పారు. జర్నలిస్టులనే సోయి కూడా మరిచి సీఎం సొంతూరులో అతని సోదరుడు ఆడబిడ్డలను నడిరోడ్డుపై పరిగెత్తించారు. లగచర్లలో దుశ్శాసన పర్వానికి తెరలేపారు. ఒక సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా మహిళా జర్నలిస్టులను ‘బట్టలిప్పదీసి ఊరంతా తిప్పుతా’ అని బరితెగించి మాట్లాడారు.
పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ అతిస్వల్ప తేడాతో అధికారంలోకి వచ్చింది. ఈ అత్తెసరు మెజారిటీకే అత్తరు పూసుకొని మరీ ఎగురుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పటికే దాదాపు రెండేండ్లు గడిచిపోయాయి. ఇంకో మూడేండ్లు గడిస్తే మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. అప్పుడే ప్రజల వద్దకు పోతామనుకుంటే ప్రజలు కూడా అప్పుడు మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తారు. అందుకే కాంగ్రెస్ నాయకులు ఇకనైనా వ్యక్తిగత విమర్శలను మానుకోవాలి. తమ పోషణ కోసం దూషణలు చేస్తామంటే కుదరదు. పరిపాలనపై దృష్టిపెట్టి ప్రజల బాగోగులను చూసుకోవాలి. అంతేకానీ, ఆకాశాన్ని చూస్తూ పైకి ఉమ్మితే అది ఎవరి మీద పడుతుందో చిన్నపిల్లాడినడిగినా చెప్తాడు. అధికారంలో ఉన్నది మీరు, కుర్చీల్లో కూర్చుంటున్నది మీరు. ప్రజలు ఇచ్చిన అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో విఫలమవుతూ ఇంకా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్పై విమర్శలు చేస్తామంటే ఎట్లా?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, తొమ్మిదినర్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ కూడా బూతులు మాట్లాడలేదు. హుందాగా పాలన సాగింది. ఏపీలో అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా అక్కడి రాజకీయ నాయకులు మాట్లాడే బూతులు విన్నప్పుడల్లా తెలంగాణ రాజకీయాలు బాగుంటాయని రాజకీయ పండితులే ప్రశసించేవారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రతిపక్ష నాయకులు తమ విమర్శలకు, ఆరోపణలకు ఎలాంటి భాష వాడినా అధికారపక్షం మాత్రం హుందాగా వ్యవహరించింది. వాళ్లను తిరిగి ఒక్క మాట కూడా అనలేదు.
కానీ, కాంగ్రెస్ పాలకులు అలా కాదు. స్వయాన ముఖ్యమంత్రే సమయం, సందర్భంతో సంబంధం లేకుండా తిట్ల పురాణం అందుకుంటున్నారు. తెలంగాణ విధాత, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ చావును కోరుకోవడం ఏలికల సంస్కారహీనానికి నిదర్శనం. హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దిన కేటీఆర్‌పై అవాకులు చెవాకులు పేలారు. ‘తొక్కి నార తీస్తా’, ‘లాగులో తొండలేస్తా’, అంటూ తెలంగాణ సమాజానికి కొత్త బూతులు నేర్పారు. జర్నలిస్టులనే సోయి కూడా మరిచి సీఎం సొంతూరులో అతని సోదరుడు ఆడబిడ్డలను నడిరోడ్డుపై పరిగెత్తించారు. లగచర్లలో దుశ్శాసన పర్వానికి తెరలేపారు. ఒక సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా మహిళా జర్నలిస్టులను ‘బట్టలిప్పదీసి ఊరంతా తిప్పుతా’ అని బరితెగించి మాట్లాడారు.
ముఖ్యమంత్రి బాటలోనే మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నడుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఓ మహిళా మంత్రి వ్యాఖ్యలు యావత్ తెలంగాణను ముక్కున వేలేసుకునేలా చేశాయి. మంత్రి, అందులోనూ మహిళ.. ఇలా ఎలా మాట్లాడుతారని అందరూ ముక్తకంఠంతో ఖండించారు. తర్వాత చాలా సందర్భాల్లో కాంగ్రెస్ సీనియర్, జూనియర్ నాయకులు బీఆర్ఎస్పై విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. వ్యక్తిత్వ హననానికి తెగించారు. ఇప్పటికీ వదంతులు ప్రచారం చేస్తున్నారు. సాధారణంగా ఎక్కడైనా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయి. అధికారపక్షం సమాధానం ఇస్తుంది.
కానీ, తెలంగాణలో ఉల్టా పల్టా రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు అడ్డగోలు మాటలు మాట్లాడుతుంటే, బీఆర్ఎస్ నేతలు ఓపికగా జవాబులిస్తున్నారు. బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. మొన్న ఒక మిత్రుడు… ‘తెలంగాణ రాజకీయాలు ఏపీని తలపిస్తున్నాయ’ని చెబితే తలకొట్టేసినంత పనైంది. ఏపీలాగే ఇప్పుడు తెలంగాణలోనూ తిట్లు, బూతులు ఒక భాగమైపోతున్నాయి. మూతులు తెరిస్తే బూతులు వస్తున్నాయి. సోషల్ మీడియా వేసే వెర్రితలల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీదే. బహుశా పక్క రాష్ట్రంలోని తమ గురువు నుంచి నేర్చుకున్న పాఠాలు ఇవేనేమో! ఎంతైనా.. ఒకే గూటి పక్షులు కదా.
– (వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్) డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్