ప్రతిపక్ష హోదా కూడా గతిలేని కాంగ్రెస్‌ను ఆదుకున్నది, అక్కున చేర్చుకున్నది నిరుద్యోగులే. కుమ్ములాటలు, కొట్లాటలతో కుక్కలు చింపిన విస్తరి కంటే హీనంగా మారిపోయిన ఆ పార్టీ జెండాకు కుట్లేసింది నిరుద్యోగులే. మాసిపోయిన హస్తం జెండాకు మూడు రంగులద్దింది యువతే. ప్రమోషన్ ఇచ్చిన ఆ నిరుద్యోగులతో ఎమోషన్‌తోనే రేవంత్ సర్కారు నేడు ఆటలాడుతున్నది. వారిని నమ్మబలికి నట్టేట ముంచింది. వారి నమ్మకాన్ని తెగనమ్మింది. ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా వ్యవహరిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. నాడు మూడు రంగుల జెండా మోసిమోసి కందిపోయిన యువత భుజాలపై నేడు కారం చల్లుతున్నారు. నాడు హస్తానికి అనుకూలంగా నినాదాలిచ్చిన నోళ్లనే నేడు బలవంతంగా మూయిస్తున్నారు. కొలువులు అడిగిన పాపానికి లాఠీలతో కొడుతున్నారు. 2 లక్షల ఉద్యోగాల హామీని ఎగ్గొట్టింది చాలక, ఉద్యోగాలు అడిగినవాళ్లపైకి పోలీసులను ఎగదోస్తున్నారు. తెలంగాణ కోసం రక్తం చిందించిన యువత నెత్తురు కండ్లజూస్తున్నారు. ఓట్లేసి గెలిపించిన యువతను కడగండ్ల పాల్జేయడమే ప్రజాపాలనా? నిరుద్యోగులను ఈడ్సికొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా?
సీఎం కుర్చీ ఎక్కిన సంవత్సరంలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు మాటిచ్చారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చి మాట నిలబెట్టుకుంటామని బాస చేశారు. ఏడాది కాదు, రెండేండ్లు కావస్తున్నది. అయినా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షలు కాదు కదా, రెండు వేల ఉద్యోగాలైనా ఇవ్వలేదు. అశోక్ నగర్‌కు వచ్చి ఛాయ్ తాగిన రాహుల్‌గాంధీ ఎంపీ అయ్యారు. హైదరాబాద్ వేదికగా యూత్ డిక్లరేషన్ ప్రకటించిన ప్రియాంకగాంధీకి కూడా ఎంపీ కొలువు దొరికింది. నిత్యం నిరుద్యోగులను రెచ్చగొట్టిన బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. మరో నేత అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ ఎంపీ అయ్యారు. కానీ, వారంతా ఇప్పుడు ముఖం చాటేశారు.
నాడు నిరుద్యోగుల గొంతుకగా చెప్పుకొన్న ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి దక్కగానే ఆయన పెదవులు మూసుకున్నారు. అంతేకాదు రేవంత్‌రెడ్డి సోదరుల్లో ఒకరు అనధికారిక హోంమంత్రిగా అధికారికంగా ప్రొటోకాల్‌ను అనుభవిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరో సోదరుడు అనధికారికంగా దందాలు, సెటిల్మెంట్ల శాఖ తెరిచారనే ఆరోపణలు వస్తున్నాయి. తమలో తాము పదవులు పంచుకొని అబద్ధానికి కొత్త బట్టలు తొడిగినట్టుగా 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని పట్టభద్రుల చెవుల్లో పువ్వు పెట్టాలని చూడటం హాస్యాస్పదం. నిరుద్యోగులకు కాంగ్రెస్ పాలకులు ఇప్పటికే ఎనలేని ద్రోహం చేశారు. ఇంకా చేయాలనీ చూస్తున్నారు. కానీ, రేవంత్ ప్రభుత్వ పునాదులను పెకిలించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న విషయాన్ని పాలకులు విస్మరిస్తుండటం విడ్డూరం.
– శ్రీను నాయక్ దోన్వాన్, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి, ఓయూ