బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి అవలంబిస్తున్న వైఖరి అనుమానాస్పదంగా ఉన్నది. తన నిబద్ధతను చాటుకోవడంలో ఏనాడూ సఫలం కాలేదు. పైకి చెప్పేది ఒకటి లోపల చేసేది మరొకటి. ‘కుల సర్వే చేయడంలో, 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలులో మా పద్ధతులు, మేము దేశానికి ఆదర్శం’ అని ఢంకా బజాయించుకోవడం ఒకింత విస్మయం కలిగిస్తున్నది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు అసలు రంగును సాధికారికంగా బయట పెట్టడమే లక్ష్యంగా, రాజ్యాంగ, న్యాయబద్ధ సోదాహరణలతో రేవంత్ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తిచూపుతూ, బీసీ వర్గాల్లో చైతన్యం, రిజర్వేషన్ల సాధనకు సమాయత్తం దిశగా కార్యోన్ముఖులను చేయడమే ఈ వ్యాసం విస్తృతి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం శాసనసభ, మండలిలో రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకుంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్వయంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ‘జాతీయ కులగణనలో తెలంగాణ మోడల్‌ను అనుసరించండి’ అని సూచించారు. కానీ, ఇది నిజానికి మోడల్‌గా నిలబడదగిన విధానమా? తెలంగాణ ప్రభుత్వ విధానం శాస్త్రీయ ప్రమాణాలు పాటించినదా? న్యాయపరమైన భద్రత కల్పించినదా? అనే విషయాల్లో తీవ్రమైన సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా జరిగిందో, అందులో ఎలాంటి లోపాలు ఉన్నాయో న్యాయపరంగా, ప్రజాస్వామ్యపరంగా, రాజ్యాంగపరంగా స్పష్టంగా విశ్లేషించడం ఈ వ్యాసం పరిధి. దేశం మొత్తానికి ఆదర్శంగా చెప్పుకొంటున్న రేవంత్ ప్రభుత్వం ముందు ఈ వాస్తవాలు తెలుసుకోవడం అనివార్యం.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. రిజర్వేషన్ల అమలుకు తప్పనిసరిగా ఈ అంశాలు ఉండాలి: 1. చట్టబద్ధమైన కమిషన్ నివేదిక 2. గణాంకపూర్వక డేటా 3. అసాధారణ పరిస్థితుల ఆధారాలు 4. అసెంబ్లీ సమీక్ష 5. సామాజిక సంప్రదింపులు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఐదు అంశాల్లో ఒక్కదాన్ని కూడా పూర్తిగా చేయలేకపోయింది. బూసాని నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్‌కు చట్టబద్ధత లేదు. Commission of Inquiry Act, 1952,Article 340 ప్రకారం బూసాని కమిషన్ నియమించబడలేదు. స్వతంత్రత, శాస్త్రీయత, పారదర్శకత లేకుండా ఈ కమిషన్ పని చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన నివేదికలను రాష్ర్ట చట్టసభల్లో టేబుల్ చేయలేదు. పబ్లిక్ డొమైన్లో పెట్టి అభిప్రాయ సేకరణ జరపలేదు. ఇలాంటి ప్రధాన లోపాల ఆధారంగా రిజర్వేషన్ల బిల్లులు రూపొందించడమే పెద్ద సందేహానికి తావిస్తుంది.
SEEEPC (Social, Educational, Economic, Employment, Political and Caste Survey) సర్వేను ప్రభుత్వం ప్రధాన ఆధారంగా చూపుతోంది. ప్రభుత్వ ప్రణాళిక విభాగం ద్వారా ఈ సర్వేను రాష్ర్టంలో నిర్వహించారు. ఇందుకు అధికారిక గెజిట్ ద్వారా సర్వే నిర్వహించలేదు. సర్వే ప్రశ్నావళిపై సీఎంలు, డిప్యూటీ సీఎంల ఫొటోలు ఉండటం నిష్పక్ష ప్రజాస్వామ్య ధోరణికి విరుద్ధం. వ్యక్తిగత, అభ్యంతరకర, గోప్యతకు భంగం కలిగించే ప్రశ్నలు సంధించారు. ప్రశ్నలకు నిర్దిష్ట ప్రాతిపదికలు లేవు. ఎలా నిర్వహించారన్న వివరాలు అర్థవంతంగా లేవు. శాస్త్రీయ పద్ధతులు అనుసరించలేదు. ప్రజల్లో నమ్మకం కలిగేలా సర్వే జరగలేదు. ఇలాంటి సర్వే డేటా ఆధారంగా తీసుకునే నిర్ణయాలు న్యాయస్థానాల ముందు నిలువవు.
తెలంగాణ ప్రభుత్వ SEEEPC సర్వేకు బలమైన ప్రత్యామ్నాయంగా, తమిళనాడు రాష్ర్టం ఎలా వ్యవహరించిందో ఇప్పుడు చూద్దాం. 1982లో అక్కడ అంబశంకర్ అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్‌లో నిపుణులైన 21 మంది సభ్యులను నియమించారు. ఈ కమిషన్ ఏ ఒక్కరోజులోనో, కొన్ని వారాల్లోనో నివేదిక ఇవ్వలేదు. రెండేండ్ల పాటు శ్రమించి, రాష్ర్టంలోని వెనుకబడిన వర్గాల మీద సమగ్రంగా అధ్యయనం చేసి, వారి ఆర్థిక, విద్య, ఉపాధి, సామాజిక స్థితిగతులపై నిష్పక్షపాత గణాంకాలను సేకరించింది.
ఈ కమిషన్ నివేదికను ప్రభుత్వాలు పూర్తిగా అధ్యయనం చేసి, బలమైన చట్టాన్ని తీసుకొచ్చాయి. అందులో భాగంగా 69 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, ఆ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్పించి న్యాయపరంగా రక్షించుకున్నారు అక్కడి పాలకులు. అందుకే ఈ విధానం కోర్టులో కూడా నిలబడింది. ఈ పాఠం తెలంగాణ ప్రభుత్వం నేర్చుకోవలసింది. కానీ, తెలంగాణలో బూసాని కమిషన్ కొన్ని వారాల్లో నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ ప్రణాళిక శాఖ సర్వే చేసింది. అసెంబ్లీకి నివేదిక సమర్పించలేదు. 9వ షెడ్యూల్ చేర్పు కోసం ప్రయత్నించలేదు. ఇదంతా చూస్తే, తెలంగాణ ప్రభుత్వం బలమైన చట్టబద్ధత కంటే ఎక్కువగా ప్రచారం పొందడానికే ప్రాధాన్యత ఇచ్చినట్టు స్పష్టమవుతుంది.
(ఇంకా ఉంది)
– (వ్యాసకర్త: మాజీ చైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్)
డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు