అతివృద్ధ పార్టీకి మతిపోయినట్టు కనిపిస్తున్నది. అధికార దాహం కాంగ్రెస్తో కానిపనులు చేయిస్తున్నది. ఓటమి భయం పట్టుకుందో ఏమో ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు రైతుల మీద అక్కసు వెళ్లగక్కింది. తెలంగాణ ఉద్యమ నిర్మాత, ముఖ్యమంత్రి కేసీఆర్పై అన్నదాతలు పెంచుకున్న అభిమానం చూసి కాంగ్రెస్ కుళ్లుకుంటున్నది. దండుగన్న వ్యవసాయాన్ని పండుగ చేసిన సారు అంటే సహజంగానే రైతులోకానికి అభిమానం. రెండు ఎన్నికల్లో బలంగా సమర్థించింది.
ముచ్చటగా మూడోసారి కారుపై మోరు గుద్దే సమయం దగ్గర పడుతున్నది. ఈ నేపథ్యంలో రైతుల మద్దతు తనకు ఎటూ దక్కదని కాంగ్రెస్ ఓ నిర్ధారణకు వచ్చినట్టు కనిపిస్తున్నది. అందుకే వారిపై కడుపుమంట పెంచుకున్నది. వచ్చే విడత రైతుబంధు సాయం ఖాతాల్లో వేయొద్దని తిరకాసు పెడుతున్నది. ఏదో మాటవరసకు అనడం కాదు, ఏకంగా ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. రైతు బంధు కొత్త పథకం కాదు. ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఐదేండ్ల పైచిలుకు కాలం నుండి అమలవుతున్నది. పార్టీలకు అతీతంగా అందరూ లబ్ధి పొందుతున్నారు.
లబ్ధిదారుల్లో ఎక్కువమంది బక్కరైతులే కావడం గమనార్హం. ఎన్నికల వేళ కొత్త పథకాలు ప్రారంభించొద్దనే నియమం ఉంది. కానీ చాలాకాలం నుంచి కొనసాగుతున్న పథకాలను నిలిపివేయాలని ఎక్కడా లేదు. కానీ కాంగ్రెస్ కడుపుమంటతో నోటికాడి ముద్ద ఎత్తగొట్టే ముదనష్టపు పనికి తెగించింది. వచ్చే విడత రైతుబంధు సాయం ఆపి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నది. తాను లబ్ధి పొందడం కన్నా బీఆర్ఎస్ అవకాశాలను దెబ్బతీయాలన్న కుళ్లుబుద్ధి ఎక్కువగా కనిపిస్తున్నది. ఈరకంగా చూస్తే అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తినానివ్వదు’ అనే సామెత కాంగ్రెస్కు అచ్చంగా సరిపోతుంది. 24 గంటల కరెంటు దేనికి.. 3 గంటలు చాలన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం కదా.
తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వినూత్నమైన పథకాలను అమలు చేస్తున్నది. 24 గంటల నాణ్యమైన కరెంటు ఉచితంగా ఇస్తున్నది. ఎరువులు, విత్తనాలు సకాలంలో, అదీ తగినంత మొత్తంలో సరఫరా చేస్తున్నది. పంట దిగుబడి చివరి గింజవరకూ కొంటూ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నది.
రైతువేదికలు పెట్టి రేపటి పంట గురించి చర్చించే వీలు కల్పించింది. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆగమేఘాల మీద బీమా సొమ్ము కుటుంబానికి అందజేస్తున్నది. అన్నిటికి మించి రైతుబంధు సాయంతో పంట పెట్టుబడి సమకూరుస్తున్నది. ఇలాంటి పథకం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదని పేరు వచ్చింది. ఈ పథకం వల్ల బహుళ ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. పంట వేయడానికి అవసరమైన సరంజామా కొనేందుకు రైతు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. వడ్డీ వ్యాపారులను నమ్ముకొని అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం తప్పింది.
చిన్నరైతులను ఆదుకునే పెద్ద పథకంగా అభివర్ణిస్తున్నారు దీనిని. దేశంలోని అనేక రాష్ర్టాల రైతులు ఈ పథకం తమకూ కావాలని అంటున్నారు. బీఆర్ఎస్కు జైకొడుతున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో కారుపార్టీ జోరు పెరగడానికి అక్కడి రైతాంగం ఇస్తున్న మద్దతే కారణమని చెప్పొచ్చు. రైతుబంధు సాయాన్ని దశలవారీగా పెంచుతామని బీఆర్ఎస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
కాంగ్రెస్ నిన్ననో మొన్ననో గెలిచిన కర్ణాటకలో రైతులు కరెంటు కోసం రోడ్డెక్కిన పరిస్థితి చూస్తున్నాం. కరెంటు ఉత్పత్తి సాధించలేక కోతలు పెడ్తున్న నిర్వాకం వారిది. అక్కడ ఐదు గ్యారంటీలు ఆగమైపోయాయి. ఇక్కడ ఆరు గ్యారంటీలంటూ మోసకారి హామీలిస్తున్నారు. అక్కడి అవినీతి సర్కారు పంపే నోట్ల కట్టలతో ఇక్కడ ఓట్లు కొనాలని చూస్తున్నారు. చివరి అస్త్రంగా రైతుబంధును అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెగబడుతున్నారు. కాంగ్రెస్ పాలన వస్తే రైతుబంధు పూర్తిగా బందు చేయరని గ్యారంటీ ఏమిటి? మోసపోతే గోసపడుతమని రైతులకు తెలుసు. ఎవుసాన్ని ఎండబెట్టే కాంగ్రెస్ను ఎక్కడ ఉంచాలో వారికి తెలియదా? మూడు గంటల కరెంటునిచ్చే పాలన కావాలో, మూడు పంటలకు అండగా నిలిచే పాలన కావాలో తేల్చుకోవడం వారికి పెద్ద కష్టమా?
తుమ్మలపల్లి రఘురాములు