రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తిచేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, బీసీ కులగణన సర్వే వివాదం, ఎమ్మెల్యేల అసంతృప్తి, మిగిలిన మంత్రిత్వశాఖలు భర్తీ చేయకపోవడం, ప్రజా వ్యతిరేకత వంటి అంశాలు ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధం లేకుండానే కొందరు మంత్రులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీసీ కులగణన కమిటీ నివేదికను క్యాబినెట్ ముందుకు తీసుకురావడానికి ముందే బహిరంగంగా ప్రకటించడం రేవంత్‌ను షాక్‌కు గురిచేసింది. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఎస్సీ వర్గీకరణ కమిటీ నివేదిక మాత్రం క్యాబినెట్ సమావేశానికి ముందు బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. ప్రభుత్వంపై సొంత ప్రజాప్రతినిధులకే నమ్మకం లేకుండా పోయింది. బీసీలను ప్రభుత్వం నయవంచనకు గురిచేసిందని, బీసీ జాతిని అవమానించిందంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీసీ నివేదికను దహనం చేశారు. ప్రజా ప్రతినిధులపై పార్టీకి పట్టు లేదని చెప్పడానికి ఇదొక నిదర్శనం.
హైదరాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో కొందరు ఎమ్మెల్యేలు సమావేశమైనట్టు వార్తలు వచ్చాయి. నియోజకవర్గాల్లో అభివృద్ధికి నిధుల లభ్యత లేకపోవడం, కాంట్రాక్టర్ల బిల్లుల మంజూరులో అవినీతి ఆరోపణలు, మంత్రి స్థాయిలో బలమైన గ్రూపుల ఏర్పాటు వంటి అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే అయితే ఇప్పటివరకు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కూడా కలవకపోవడం ప్రజల్లో చర్చకు దారి తీసింది. ప్రభుత్వంలో ఇంకా ఆరు మంత్రిత్వ శాఖలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇప్పటివరకు వాటి భర్తీపై దృష్టి పెట్టకపోవడంతో పదవులు ఆశిస్తున్న సీనియర్ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచుతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ వెంటనే అలాంటిదేమీ లేదని మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో చెప్పారు. కానీ, పదవీ విరమణ వయసును పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇదొక్కటే కాదు, ప్రతి అంశంలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక, కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు సరేసరి. అంతర్గత విభేదాలు కూడా పార్టీని చుట్టుముడుతున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.
– డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, 95530 86666