మెడికల్ కేర్ సీఎం.. మెడికవర్ సీఎం!
అసలు ఈ పౌరసమాజం అనే పదం వినడానికేమో మస్తు పద్ధతిగా, సివిలైజ్డ్గా ఉంటది కానీ.. వీళ్ల అసలు రంగు చూస్తే మాత్రం సామాన్యుడికి తల తిరిగిపోతది. నేటి పౌరసమాజం అంటే ఎవరు? పెండ్లి వేడుకలో నవదంపతులకు కంటికి కనపడని అరుంధతి నక్షత్రాన్ని పట్టపగలు చూపించే ప్రయత్నం చేసినట్టు కండ్ల ముందు ఉన్నవాటికి విలువనివ్వకుండా, లేనివాటికి ఆశపెట్టేవాళ్లు. ప్రజలలో అసంతృప్తిని రాజేసేవారన్నట్టు. మన కండ్లముందే చూసినం కదా.. జిల్లాకో మెడికల్ కాలేజీ కట్టి, రాష్ట్రం నలుమూలలా దవాఖానలు పెట్టి, పేదోడికి పైసా ఖర్చు లేకుండా సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అందాలని తపనపడ్డ కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడిని ఓడించేందుకు కొందరు మేధావులు ఒక్కటైండ్రు. అదే చేతులతోటి.. ప్రజల ఆరోగ్యాన్ని కూడా వ్యాపారంగా మార్చాలనుకునేటోళ్లకు జై కొడుతున్నారు.ఒక ప్రైవేట్ సంస్థ వంద హాస్పిటల్స్ కట్టి లాభాలు గడించాలని మనసారా కోరుకొనే రేవంత్‌రెడ్డి లాంటి వ్యాపార’ మనస్తత్వం ఉన్నోళ్లను గద్దె మీద కూర్చోబెట్టారు. అలాంటి మేధావులను చూసినప్పుడల్లా అడవిని నరకడానికి గొడ్డలిలో భాగమై ఉన్న కర్ర గుర్తొస్తుంది. అసలు వీళ్లు మేధావులా లేక కేవలం మ్యానేజ్ చేసేవాళ్లా? మధ్యవర్తులా? మొత్తానికి మన పౌరసమాజం ప్రజల కష్టం కంటే.. పాలకుల ఇష్టం ముఖ్యం అనుకొనే ఒక వింత సమూహంలా తయారైంది!
ఐటీ రిటర్ను వద్దు.. రేషన్ మెతుకులు ముద్దు!

మన తెలంగాణ సర్కార్ తీరు చూస్తుంటే ’దున్నలేక కర్రు వంకర’ అన్నట్టే ఉన్నది. పాపం, మధ్యతరగతి మనుషులు, నిరుద్యోగులు లోన్ కోసం ప్రయత్నిస్తే బ్యాంకుల నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఐటీ రిటర్ను తప్పనిసరి అని బ్యాంకోళ్లు చెప్తుంటరు. ఇగ తప్పదని, లేని ఆందానీ ఉన్నట్టు చూపిస్తూ ఏదో ఒకటి అడ్జెస్ట్ చేసి ఆ కాయితం అప్పజెప్తే.. ఇప్పుడు సర్కారు సర్వే చేసి,’ఓహో! మీరు ధనవంతులైపోయిండ్రు, ఇక మీకు రేషన్ బియ్యం ఎందుకు?’ అని కార్డులు పీకేస్తాం అంటున్నది. అప్పుల కోసం పెట్టుకున్న కాయితం చూసి, వాళ్లను ఉన్నోళ్ల కిందికి లెక్కగట్టుడంటే.. అది వాళ్ల నోటి దగ్గరి బుక్కను గుంజుకోవడమే. ’పెద్ద పెద్దోళ్లు బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతుంటే.. వాళ్లను ఏమీ చేయలేని పాలకులు, గీ సామాన్యుల సంచిలో పడే ఆరు కిలోల బియ్యం మీద పడుడేంది సామీ!’ అని తెలంగాణ జనం ముక్కున వేలేసుకుంటుండ్రు.
ప్రజాపాలన ఎంత పారదర్శకమో?!

కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్జి మీనాక్షి నటరాజన్‌ది మామూలు గోస కాదు. పాపం.. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె మస్తు ఆశలతో నామినేషన్ వేస్తే, ఎన్నికల సంఘం సింపుల్‌గా రిజెక్ట్ చేసింది. ఎందుకట అంటే.. ఆమెపై తెలంగాణాలో నమోదైన క్రిమినల్ కేసు వివరాలను అఫిడవిట్లో రాయలేదట! గిదేం పంచాయితీ అబ్బా! ఈసీ చర్యను తెలంగాణ సీఎం, కాంగ్రెస్ నేతలు ఖండఖండాలుగా ఖండిస్తుండ్రు.. అప్రజాస్వామికం అంటూ గల్లాలు ఎగరేసుకుంట గర్జిస్తుండ్రు! కానీ, ఇక్కడ సగటు జనానికి ఒక చిన్న డౌట్ వస్తున్నది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో, ఆ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీద కేసు నమోదైన సంగతి మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు ఇక్కడి కాంగ్రెస్ నేతలే ఇచ్చిండ్రట. ఎవరబ్బా.. ఆ ఇంటి దొంగలు! ఇది పెద్ద సీక్రెట్ ఏమీ కాదు. ఇంత ముఖ్యమైన పని… ‘తనువు ఇక్కడ.. మనసు అక్కడ’ ఉన్నోళ్లతోనే సాధ్యం! ఇదంతా చూస్తున్న.. సగటు కాంగ్రెస్ కార్యకర్తలకు గుండె తరుక్కుపోతున్నదట. అసలు సంగతి తెలిసిన కొందరేమో.. ఇంటిని లీజుకు ఇచ్చినంత మాత్రాన.. కూలగొడున్నా చూస్తూ కూర్చుంటే ఎలా అని చేతులు
పిసుక్కుంటున్నారట.
హిట్లర్ ఈజ్ బ్యాక్!

రాజు/పాలకుడు అంటే ఎట్లుండాలె? గుండెల నిండా మానవత్వం ఉండాలె. పేదోళ్లని చూస్తే కడుపు చెరువైపోవాలె, చేతికి ఎముక లేదన్నట్టుండాలి. నేరగాళ్ల పట్ల కఠినంగా ఉండాలి.. మనసే లేనంత కర్కశంగా ఉండాలి. కానీ, మన గ్రేట్ సీఎం రేవంత్‌రెడ్డి గారి కథే వేరు! లోకమంతటా ఒక తీరుంటే.. మన సారుది ఇంకో తీరు.నాకు ఆ నియంత హిట్లరే స్పూర్తి.. ఆ హిట్లర్‌కు ఇష్టమైన పేరే ఈ హైడ్రా. అందుకే అదే పేరుతోని హైదరాబాద్‌లో ఇండ్లను కూలగొడుతూ విధ్వంసం సృష్టిస్తున్నాను అని జాతీయ స్థాయిలో కాలరెగరేసి మరీ చెప్పుకుంటుండ్రు మన ముఖ్యమంత్రి గారు… ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు. ఆ కూల్చివేతల దృశ్యాలను చూస్తుంటే.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ సన్నివేశాలు గుర్తుకొస్తున్నాయట! ‘కావాలంటే వచ్చి చూసుకోండి’ అని సవాల్ కూడా విసురుతుండ్రు. ఇంత విచిత్రమైన, వింత సీఎం ఇంకెక్కడైనా దొరుకుతాడా? గ్యారెంటీగా దొరకడు!
ఇది సమర్థించుకోవడానికి కాంగ్రెస్ నేతలు చేస్తున్న స్టంట్లు మరో లెవెల్. తలకాయ ఎక్కడో, తోక ఎక్కడో అర్థం కాకుండా పొంతన లేని ముచ్చట్లతో మీడియాలో కాలం వెళ్లదీస్తున్న రేవంత్‌రెడ్డి గుంపును చూసి జనాలు నవ్వుకుంటుండ్రు. ఇంత జరుగుతున్నా, ఇట్లాంటి పొంతనలేని మాటలు ఎన్ని వింటున్నా.. కండ్లు, చెవులు, నోరు మూసుకొని ఉన్న ‘పౌరసమాజం ప్రతినిధుల’ స్థితి చూసి నవ్వాలో, ఏడ్వాలో ప్రజలకు అర్థం కావడం లేదు.
మంత్రి మాటలు.. తుస్ స్ స్!

ఖమ్మంల పన్నెండేండ్ల చిన్న పిల్ల మీద ఒక మృగాడు పంజా విసిరి, బంగ్లా మీదికెళ్లి తోసేస్తే.. ఆ పిల్ల నిమ్స్ హాస్పిటల్ల ప్రాణం కిందా మీదున్నది. వెన్నెముక విరిగి మంచాన పడ్డ ఆ చిన్నారిని చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతది. కానీ మన కాంగ్రెస్ పెద్దలు మాత్రం మందిల బడాయిలకు పోయి, పరువు తీసుకుంటున్నరు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దవాఖానకు పోయిండ్రు. విలేఖరులు మైకులు ముందు పెట్టగానే గంభీరంగా గొంతు సవరించుకొని.. ’నిందితుడిని నలిపేస్తాం.. తొక్కేస్తాం! ఆ పిల్లకు ఎన్ని రోజులైనా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, రూపాయి ఖర్చు కాకుండా సర్కారే చూసుకుంటది!’ అని స్పీచ్ ఇరగదీసిండ్రు. ఆ తర్వాత మాజీ మంత్రి హరీశ్‌రావు దవాఖాన లోపలికి పోయి బాధిత కుటుంబాన్ని పరామర్శించిండ్రు. బయటకొచ్చి జేబులకెళ్లి ఓ చిట్టా తీసి చూపించిండ్రు. ’అయ్యా మంత్రులారా! మీ గప్పాలు పక్కన పెట్టండి.. ఇగో ఈ బిల్లులు చూడండి. హాస్పిటల్ల మందుల్లేవట.. డాక్టర్లు బయటకెళ్లి తెచ్చుకోమన్నారట. ఆ పేద కుటుంబం వేలకు వేలు పెట్టి బయట మందులు కొనుక్కొచ్చింది. ఇదా మీ ఫ్రీ వైద్యం?’ అంటూ నిలదీసిండ్రు. దీంతో సర్కార్ పెద్దల గప్పాలు అంతా తుస్ అని తేలిపోయింది. రాజధానిల ఉన్న పెద్ద హాస్పిటల్లనే వైద్యం ఇట్లుంటే, మారుమూల పల్లెల్లో దవాఖానల ముచ్చట ఎట్లుంటదో అల్కగనే అర్థం చేసుకోవచ్చు.
-ధాము నర్మాల, 9949088963