గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కాంగ్రెస్ పాలనలో కునారిల్లుతున్నది. ప్రజల భాగస్వామ్యానికి నమూనాగా, పరిపాలనా వికేంద్రీకరణకు ఆనవాలుగా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే ప్రజాప్రతినిధి వ్యవస్థకు చిరునామాగా ఉండాల్సిన గ్రామ పంచాయతీలు.. రేవంత్‌రెడ్డి పాలనలో ఏడు నెలల్లోనే నిర్జీవమవుతున్నాయి. దమ్మిడీ ఆదాయం లేక, రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వక, కొర్రీలు పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర సర్కార్ నిలువు దోపిడీ చేస్తుండటంతో పంచాయతీ వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకున్నది.
Congress Govt | గ్రామస్వరాజ్యం సాధనే లక్ష్యంగా పాలన సాగించిన కేసీఆర్ సర్కార్ గ్రామ పంచాయతీలకు పెద్దపీట వేసింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా మారుమూల గ్రామాలు, తండాలను పంచాయతీలుగా చేసింది. ఆయా పంచాయతీల్లో పాలనా సౌలభ్యం కోసం మల్టీపర్పస్ వర్కర్ల పేరిట అనేకమంది కార్మికులను నియమించింది. ఆ కార్మికుల సేవలను గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారి వేతనాన్ని కూడా పెంచింది. నెలకు రూ.9,500 గౌరవ వేతనంగా చెల్లించింది. అయితే మొదటి వేతన సంఘం ప్రకారం.. నెలకు రూ.19 వేలు వేతనం చెల్లించాలని కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండగా.. ప్రస్తుతం ఇస్తున్న వేతనాన్నే సమయానికి ఇవ్వడం లేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలతో పాటు కార్మికుల బతుకులు ఆగమయ్యాయి. గ్రామాలను బాగు చేస్తున్న కార్మికుల జీవితాలు మాత్రం బాగుపడటం లేదు. చాలీచాలని వేతనాలతో వారు బతుకీడుస్తున్నారు. ఆరు నెలలుగా వేతనాలు అందకపోవడంతో, ఇక చేసేదేమీ లేక ఆందోళన బాటపట్టాల్సి వస్తున్నది. పంచాయతీ కార్మికుల కష్టాలకు మెదక్ జిల్లా చేగుంట మండలంలో జరిగిన ఘటనే నిదర్శనం. మండలంలోని మునిగడప, పలుగుగడ్డ తదితర గ్రామాల కార్మికులు వేతనాల కోసం ఉన్నతాధికారులను వేడుకున్నా, వినతిపత్రాలు సమర్పించినా సమస్య పరిష్కారం కాలేదు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయింది. దీంతో వారంతా ఏకమై భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నది.
మరోవైపు ఇతర కార్మికుల వలె పంచాయతీ కార్మికులకు బీమా సౌకర్యం లేదు. దీంతో ట్రాక్టర్ బోల్తా పడి ప్రాణాలు కోల్పోయిన, తీవ్ర గాయాలపాలై మంచాన పడుతున్న కార్మికుల కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయి. పంచాయతీ కార్మికులకు రూ.5 లక్షల బీమా కల్పించాలని కోరుతూ ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించినప్పటికీ సానుకూల స్పందన రాలేదు.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నప్పటికీ, పస్తులుంటూనే కార్మికులు విధులకు హాజరవుతుండటం గమనార్హం. ఎప్పటికైనా క్రమబద్ధీకరిస్తారనే ఆశతో వారు గడ్డు పరిస్థితులు ఉన్నప్పటికీ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వారి బాధలు చూడలేక కొన్నిచోట్ల కార్యదర్శులు అప్పులు తెచ్చి రెండు, మూడు నెలల జీతాలిచ్చి ఆదుకుంటుండటం కొంత వరకు ఉపశమనం కలిగించే అంశం.
పాలకవర్గాల గడువు ముగియడంతో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. వారి చేతుల్లో పరిమితమైన అధికారాలు మాత్రమే ఉండటంతో పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతున్నది. అనేక పంచాయతీల్లో ప్రత్యేక అధికారులకు చెక్‌పవర్ ఇవ్వలేదు. దీనివల్ల వివిధ అభివృద్ధి పనుల అమలుతో పాటు కార్మికుల జీతాల చెల్లింపు సైతం ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే అనేక సమస్యలతో గ్రామాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో అధికారికి మూడు, నాలుగు పంచాయతీల నిర్వహణ బాధ్యతలు అప్పగించడం మరిన్ని సమస్యలకు దారితీస్తున్నది. పనిభారం కారణంగా ప్రత్యేక అధికారులు చుట్టపు చూపుగానే పల్లెలను సందర్శిస్తున్నారు. దీంతో సమస్యల చిట్టా అంతకంతకూ పెరుగుతున్నది.
ప్రధానంగా తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీలకు వారాల తరబడి పరిష్కారం దొరకడం లేదు. పాడైపోయిన చేతిపంపులు నెలల తరబడి మరమ్మతులకు నోచుకోవడం లేదు. వాటిని బాగుచేసే నాథుడే కరవయ్యాడు. అదే సమయంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో మళ్లీ బిందెలు పట్టుకొని మహిళలు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాకుండా, పారిశుద్ధ్యం కూడా పడకేసింది. పర్యవేక్షించాల్సిన అధికారులు వారానికోసారి కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. గ్రామాల్లో చెత్త సేకరణ కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారుతున్నది. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో నెలవారీ ఈఎంఐ గుదిబండగా మారుతున్నది.
కేంద్ర ప్రభుత్వ నిధులు రెండు నెలలకోసారి మంజూరవుతున్నా అవి ఎటూ సరిపోవడం లేదు. పాలకవర్గం ఉన్నప్పుడు సర్పంచులు అప్పోసొప్పో చేసి గ్రామాలను అభివృద్ధి చేసేవారు. కానీ, ఇప్పుడు పంచాయతీల్లో నిధుల లేమితో అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రత్యేక అధికారుల పాలనలో రాజకీయ జోక్యమూ మితిమీరిపోయింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల వల్ల ఉన్నతాధికారులు కూడా మిన్నకుండిపోతున్నారు.
ఒకప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉంది. కేసీఆర్ నాయకత్వంలో పల్లెప్రగతి అద్భుత ఫలితాలను సాధించింది. మౌలిక వసతులు కల్పించడంతో పల్లెలు, పట్టణాలు పరిశుభ్రతతో, పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారాయి. అయితే ఈ అభివృద్ధి అంత సులభంగా ఏమీ జరగలేదు. పటిష్ఠమైన చట్టాలు, సమగ్ర ప్రణాళిక, యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించడంతోనే అద్భుతమైన ప్రగతి సాధ్యమైంది. 2014 ముందు స్థానిక సంస్థలకు తమ బాధ్యతలు, విధులకు సంబంధించి సరైన మార్గనిర్దేశనం ఉండేది కాదు. జవాబుదారీతనం లేని స్థానిక నాయకత్వం రాజకీయాలకు, పైరవీలకే పరిమితమయ్యేది. దీంతో పల్లెలు, పట్టణాల పరిస్థితి అధ్వానంగా ఉండేది. స్థానిక సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు కేసీఆర్ సర్కార్ నూతన పంచాయతీరాజ్, పురపాలక చట్టాలను ప్రవేశపెట్టింది. పాలకులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పాలన అందించేలా స్పష్టమైన లక్ష్యాలను ఆ చట్టాల్లో నిర్దేశించింది. అంతేకాదు, సమర్థవంతంగా పన్నులు వసూలు చేయడంతో పాటు, పారిశుద్ధ్యం, పచ్చదనం పెంచే విధంగా మార్గనిర్దేశం చేసింది. లక్ష్య సాధనలో అలసత్వం ప్రదర్శించిన ఉద్యోగులతో పాటు, ప్రజాప్రతినిధులపై సైతం కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టంలో నిబంధనలను పొందుపరిచింది. దీంతో స్థానిక సంస్థల పనితీరులో అద్భుతమైన మార్పు వచ్చింది.
అయితే గత ప్రభుత్వ లక్ష్యాలను నీరుగార్చే విధంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తుండటం బాధాకరం. ఏ సర్కార్ అయినా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూనే, కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు సంక్షేమ పాలన అందించాలి. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేస్తానంటూ కక్షపూరిత రాజకీయాలకు దిగుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్ చేసిన మంచి పనులను కూడా పక్కనపెడుతుండటం ఆందోళనకరం.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడానికే ముఖ్యమంత్రికి సమయం సరిపోవడం లేదు. గడిచిన ఏడు నెలల్లో గ్రామ పంచాయితీలపై ఆయన సమీక్షే చేయలేదు. కేవలం ప్రత్యేక అధికారులను నియమించి చేతులు దులుపుకొన్నారు. ఆ అధికారులకు చెక్‌పవర్ కూడా ఇవ్వలేదు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలనా అనుభవం, అవగాహన రెండూ లేవు. అందుకే ఆయన ఎంతసేపూ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారు. అందులో భాగంగానే తన ఆస్థాన మీడియాకు రోజుకో లీకు ఇస్తూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. అనుభవమున్న ఒకరిద్దరు సీనియర్ నాయకులు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నారు. గ్రామాలపై దృష్టి సారించి, సమీక్షలు నిర్వహించి, పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కనీసం వారైనా ముఖ్యమంత్రికి సలహా ఇవ్వాలి. తద్వారా పంచాయతీల సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. అలాగే మల్టీపర్పస్ వర్కర్లకు నెలనెలా వేతనాలు చెల్లించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటు త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి, గ్రామాల్లో పాలనను గాడిన పెట్టాలి.
(వ్యాసకర్త: ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు)
-బూడిద భిక్షమయ్య గౌడ్