తోడేలు కాషాయం కట్టినట్టుగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ తీరు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు కాంగ్రెస్ తెరదీసింది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, రాజకీయ కక్ష సాధింపులతో కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. దాన్ని డైవర్ట్ చేసేందుకు అక్రమ కేసుల పర్వానికి కాంగ్రెస్ నాంది పలికింది. అందులో భాగమే ఫార్ములా-ఈ రేస్ కేసు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కంట్లో నలుసులా మారిపోయారు. ఈ ఏడాదిన్నర పాలనలో రేవంత్‌రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రి అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. ఆయనను అభద్రతాభావం వెంటాడుతున్నది. అందుకే ఆధారాలు లేని కేసులు పెట్టే కుట్రలకు ముఖ్యమంత్రి తెరలేపారు. కేటీఆర్‌ను ఎలాగైనా అరెస్టు చేయించాలన్న లక్ష్యంతో ఉన్న రేవంత్‌రెడ్డి అనేక పన్నాగాలు పన్నుతున్నారు. ఈ-రేస్‌లో ఏదో జరిగిందని, కేటీఆర్‌కు ఏదో ప్రయోజనం చేకూరిందని కోర్టును సైతం నమ్మించేందుకు రేవంత్ సర్కార్ నానా తంటాలు పడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తిచూపుతున్నారన్న అక్కసుతో, రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతో ఏసీబీ కేసు నమోదు చేసిందనేది జగమెరిగిన సత్యం.
ఫార్ములా రేసు విషయంలో ఎలాంటి మనీలాండరింగ్ జరగలేదన్నది సుస్పష్టం. డబ్బు నేరుగా నిర్వాహకుల బ్యాంక్ అకౌంట్లోనే జమ అయినప్పుడు.. మనీలాండరింగ్ కాని, ఇంకొకటి కాని జరిగే అవకాశమే లేదు. ఈ లాజిక్‌ను రేవంత్ సర్కార్ మిస్ అయ్యింది. రేస్ నిర్వహణ కోసమే పారదర్శకంగా హెచ్ఎండీఏ నుంచి రేస్ నిర్వాహకులకు నగదు బదిలీ చేసినప్పుడు కేటీఆర్‌కు ఏ విధంగా ప్రయోజనం చేకూరిందనేది సమాధానం లేని ప్రశ్న.
పెట్టుబడుల ఆకర్షణకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతగా భావించిన రంగాల్లో ఆటోమొబైల్ రంగం కూడా ఒకటి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో తెలంగాణను హబ్‌గా మార్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ-మొబిలిటీ వీక్ నిర్వహించింది. అందులో భాగంగానే ఫార్ములా-ఈ రేస్ జరిగింది. హ్యుందాయ్, అమరరాజా వంటి దిగ్గజ కంపెనీలు రూ.వేల కోట్లు పెట్టుబడులను ప్రకటించాయి. తద్వారా తెలంగాణ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల ఉద్యోగాలు లభించాయి. ప్రఖ్యాత నీల్సన్ సంస్థ ప్రకారం.. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రకటనలు, మీడియా కవరేజీ తదితరాల ద్వారా ఫార్ములా ఈ-రేస్ సమయంలో హైదరాబాద్‌లో రూ.700 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో అప్పటికే ముందు వరుసలో ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంపొందించడానికి ఈ-ఫార్ములా రేస్ ఎంతో దోహదపడింది.
బీఆర్ఎస్ పాలనలో ఇంతటి ఇమేజ్ రావడాన్ని జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ-రేస్‌లో ఏదో జరిగినట్టుగా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నది. బట్టకాల్చి మీద వేసినట్టు కేటీఆర్‌ను బద్నాం చేసే కుట్రలు చేస్తున్నది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి రాష్ట్రం మనుగడకు ముప్పువాటిల్లే ధ్వంస రచనకు బీజం పడింది. తెలంగాణ ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు తెలంగాణ జాతి మనుగడ కత్తి మొనపై ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడూ చూడని విద్వేషం పురుడుపోసుకున్నది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు గతంలో ఎన్నడూ లేనంతగా అభద్రతాభావంతో ఉన్నారు. ప్రశ్నించే గొంతుకలపై అధికార జులుం కొనసాగుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులు బీఆర్ఎస్కు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కేసీఆర్ పట్ల పెరుగుతున్న ఆదరణను గ్రహించకుండా అధికారమనే పొర కాంగ్రెస్ చూపును మసకబారుస్తున్నది. అందుకే రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమనే సంగతి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తుంచుకుంటే మంచిది.