హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్).. విశ్వనగరం హైదరాబాద్ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటు చేశామని చెప్తున్న సంస్థ ఇది. అయితే ఏర్పాటైన నాటి నుంచి ఈ సంస్థ తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు, గిట్టనివారు, పేదలపై మాత్రమే హైడ్రా దూకుడు ప్రదర్శిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. చెరువుల పరిరక్షణ పేరిట ప్రత్యర్థులను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నదా? సెటిల్మెంట్ల కోసమే కూల్చివేతలకు పాల్పడుతున్నదా? హైడ్రాతో నగరంలోని సామాన్యుడి జాగా సురక్షితమేనా? అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి మదిని తొలిచివేస్తున్నాయి.
హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న చెరువులెన్ని? వాటి విస్తీర్ణమెంత? ఏ చెరువు ఎంత మేరకు కబ్జాకు గురైంది? కబ్జాదారులు ఎవరు? ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న కొన్ని నిర్మాణాలనే ఎందుకు కూలుస్తున్నారు? కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత నిర్మాణం మొదలైన వాటిని కూలుస్తారా? విస్మరిస్తారా? అనుమతి ఇచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లాంటి అనేక ప్రశ్నలకు హైడ్రా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.
హైదరాబాద్.. ఘన చరిత్ర కలిగిన విశ్వనగరం. వెయ్యి సరస్సుల సమాహారం. జంట జలాశయాలు, మూసీ, మంజీరా నదులు, నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్.. ఇలా చెప్పుకొంటూపోతే భాగ్యనగరానిది ఒడువని ముచ్చట. అలాంటి నగరంపై కాంగ్రెస్ సర్కార్ కుట్రలకు తెరలేపుతున్నది. హైడ్రా పేరిట హైడ్రామా చేస్తున్నది. 50 ఏండ్ల తమ పాలనలో చెరువులను చెరబట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు చెరువుల పరిరక్షణ అని నాటకాలు వేస్తుండటం విడ్డూరం.
ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న 1982-2012 మధ్యకాలంలో హైదరాబాద్‌లో మాయమైన చెరువుల సంఖ్య అక్షరాలా 375. అన్యాక్రాంతమైన చెరువు శిఖాలు, భూములు కొన్ని వేల ఎకరాలు. గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోకపోవడంతో వలసలు పెరిగి నగరం విధ్వంసానికి గురైంది. గత మూడు దశాబ్దాల్లో చెరువుల్లో వెలిసిన అనేక కాలనీలను మనం చూశాం. ఉమ్మడి పాలనలోనే జంట జలాశయాలు ఆక్రమణకు గురయ్యాయనేది జగమెరిగిన సత్యం. అప్పటి పాలకుల అండతో, రాజకీయ పలుకుబడితో నిబంధనలను తుంగలో తొక్కి జంట జలశయాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లు వెలిశాయి.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు తెరలేపింది. అందులో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేసింది. పరిరక్షణ పేరిట చెరువు భూములపై నజర్ వేసింది. సెటిల్మెంట్లకు తెరలేపింది. ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి అనుకూలమైన బడాబాబుల జోలికి వెళ్లకుండా.. ప్రతిపక్ష నేతలు, తమకు సహకరించనివాళ్లే లక్ష్యంగా కూల్చివేతలకు పాల్పడుతున్నది.
గత ప్రభుత్వం అక్రమ కట్టడాలపై చర్యలకు పూనుకున్నది. కానీ, ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన స్టేలు అడ్డంకిగా మారాయి. రేవంత్ సర్కార్ మాత్రం నిబంధనలు, స్టేలు జాన్తా నై అంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది. వ్యక్తిగత కక్షతో ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసి తమకు ఎవరైనా ఒక్కటేనని గప్పాలు కొట్టుకుంటున్న హైడ్రా.. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆక్రమణల విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇదంతా చూస్తుంటే ఓ ప్రణాళిక ప్రకారమే హైడ్రాను ఏర్పాటు చేసినట్టు స్పష్టమవుతున్నది.
సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ నేతృత్వంలో ఏర్పడిన హైడ్రా ముందు పలు సవాళ్లున్నాయి. చెరువులు, కుంటల కబ్జాల కారణంగా 60 ఏండ్లలో హైదరాబాద్ చాలా విధ్వంసమైంది. అక్రమ నిర్మాణాలను కూల్చాలంటే సగం హైదరాబాద్‌ను నేలమట్టం చేయాల్సి ఉంటుం ది. ఇక్కడే హైడ్రా విశ్వసనీయత ఏమిటనేది తెలుస్తుంది. నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిన గత ప్రభుత్వం 118 జీవో ద్వారా వందలాది పేదల ఇండ్లను రెగ్యులరైజ్ చేసింది. అయితే కాంగ్రెస్ సర్కార్ మాత్రం అలాంటి పేదలను టార్గె ట్ చేస్తుండటం శోచనీయం. భారీగా పోలీ సు బలగాల మధ్య పేదలు, సామాన్యుల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నది. హైడ్రాను ముందు పెట్టుకొని పేదల జాగలపై కన్నేసింది. దీంతో హైడ్రా దెబ్బకు సామాన్యుడి నడ్డి విరగడం ఖాయంగా కనిపిస్తున్నది. కాయకష్టం చేసి కట్టుకున్న ఇల్లు, పైసా పైసా కూడబెట్టి కొనుకున్న ప్లాట్‌కు గ్యారంటీ లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో బడాబాబులకు వర్తించని నిబంధనలను పేదలకు వర్తింపజేయడం సరికాదు.
అనేక విమర్శలను ఎదుర్కొంటున్న హై డ్రా ముందు పలు సవాళ్లున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న చెరువులెన్ని? వాటి విస్తీర్ణమెంత? ఏ చెరువు ఎంత మేరకు కబ్జాకు గురైంది? కబ్జాదారులు ఎవరు? ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న కొన్ని నిర్మాణాలనే ఎందుకు కూలుస్తున్నారు? కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత నిర్మాణం మొదలైన వాటిని కూలుస్తారా? విస్మరిస్తారా? అనుమతి ఇచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లాంటి అనేక ప్రశ్నలకు హైడ్రా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.
ఇలా అనేక విమర్శల మధ్య హైడ్రా దూకుడు కొనసాగుతుండగానే.. దాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. హైడ్రాకు పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. దీనివల్ల నేరుగా హైడ్రానే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు వీలు కలుగుతుంది. ఇక హైడ్రా కూల్చివేసిన భవనాలకు గతంలో అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే విషయమై ఉన్నతాధికారులతో ప్రభుత్వం చర్చలు జరపనున్నట్టు తెలుస్తున్నది. అయితే ఒక్క ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తప్ప హైడ్రా కొత్తగా సాధించిందేమీ లేదు. మరోవైపు పెద్దలను వదిలిపెట్టి, పేదలపై జులుం ప్రదర్శించడంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుల నిర్మాణాల జోలికొస్తే ప్రజలు తిరగబడటం ఖాయం.
-కారుపోతుల పాండరి గౌడ్
70138 24056