యాసంగి సీజన్ మొదలై నెలన్నర అయింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో యాసంగి వరి నారు పోయడమో, నాట్లు పూర్తవడమో అయింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇంతవరకు రైతు భరోసా డబ్బులు వేయలేదు. రైతు భరోసా ప్రధాన ఉద్దేశం రైతులకు పెట్టుబడి సాయం అందించడమే. పంట వేసే ముందు విత్తనాల కోసం, మందుల కోసం, భూమిని దున్నడం కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి అప్పు తీసుకొని రైతులు ఇబ్బంది పడకుండా నిరోధించాలనే ఆలోచనతోనే ఈ పథకం రూపుదిద్దుకున్నది. అయితే, ఈ పథకాన్ని రేవంత్ సర్కారు ఎప్పుడో నిర్వీర్యం చేసేసింది. రైతు భరోసాను కేవలం ఎన్నికల పథకంగా మార్చేసింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎకరానికి రూ.15,000 రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చాక ఎన్నికల వేళ ప్రకటించినట్టు రైతు భరోసా మొత్తాన్ని పెంచలేదు. పాత పద్ధతిలోనే ఎకరాకు రూ.5,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఆ తర్వాతనైనా రైతు భరోసా మొత్తాన్ని పెంచడం సంగతి అటుంచితే 2024 ఖరీఫ్ సీజన్లో మొత్తంగా రైతు భరోసా ఎగ్గొట్టింది. ఆ ఏడాది యాసంగి సీజన్లో కూడా చాలా మంది రైతులకి డబ్బులు వేయకుండా మోసం చేసింది. అదేమంటే అనర్హులకు రైతు భరోసా అందుతున్నదని, పథకాన్ని ప్రక్షాళన చేస్తామని, కేవలం అర్హులైన రైతులకు అందిస్తామని నమ్మబలికింది. బడాబడా భూస్వాములకు రైతు భరోసా అందకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
మరి ఆ తర్వాత ఏమైందో కానీ, ఆ ప్రతిపాదనను రేవంత్ సర్కార్ పూర్తిగా మర్చిపోయింది. ఎకరాకు రూ.15000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ మాత్రం దాన్ని రూ.12,000కే పరిమితం చేశారు. పోనీ ఈ రూ.12,000 అయినా సరైన సమయంలో రైతులకు అందిస్తున్నారా? అంటే అదీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను తమ ఎన్నికల భరోసా పథకంగా మార్చుకున్నది. ఎన్నికలు ఉన్నప్పుడే రైతు భరోసా వేస్తారన్న భావన ప్రజల్లో కలుగుతున్నది. ఇటీవల పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఒక్క ఖరీఫ్ సీజన్లో మాత్రం సకాలంలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేసింది.
ప్రస్తుత యాసంగి సీజన్లో కూడా రైతు భరోసా ఎప్పుడు వేస్తారన్న విషయమై స్పష్టత లేదు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను త్వరలోనే నిర్వహించాలన్న ఆలోచన నేపథ్యంలో ఈ సంక్రాంతికి రైతు భరోసా నిధులు ఇస్తారన్న ప్రచారం జరుగుతున్నది. ఏదేమైనా ఎన్నికలు ఉన్నప్పుడే రైతు భరోసా అన్నది కాంగ్రెస్ విధానమని స్పష్టంగా కనిపిస్తున్నది. రేవంత్ ప్రభుత్వం ఈ వైఖరిని మానుకోవాలి. రైతులను రుణ విముక్తులను, వడ్డీ వ్యాపారుల వేధింపుల నుంచి కాపాడటానికి ఉద్దేశించిన ఈ గొప్ప పథకాన్ని ఎన్నికల కోసం వాడుకోవడాన్ని మానుకోవాలి. ఎన్నికలతో సంబంధం లేకుండా సకాలంలో రైతులకు డబ్బులు అందిస్తేనే పథకం ఉద్దేశం నెరవేరుతుందన్న వాస్తవాన్ని గుర్తించాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి)
-సయ్యద్ నజీం అహ్మద్
90323 16234