కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండున్నరేండ్లు కావస్తున్నా నిరుద్యోగులకు ఇంకా ఎదురుచూపులే మిగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు జాడ ఎక్కడా కనిపించటం లేదు. అర్రాజ్ పాటల మాదిరిగా 50 వేలు ఒకటోసారి, 60 వేలు రెండోసారి, 70 వేలు మూడోసారి అన్నట్లుగా సీఎం సహా సహచర మంత్రుల మాటలు అంకెల గారడీ అని చెప్పకనే తెలుస్తున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారంతో కాలం గడుపుతున్నది.
ఎన్నికల ముందు కాంగ్రెస్ నిరుద్యోగ మ్యానిఫెస్టోను ప్రకటించింది. తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకువచ్చి నిరుద్యోగుల్లో ఆశలు పెంచింది. ప్రియాంక గాంధీతో సరూర్‌నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించి నిరుద్యోగులను తమ వైపు తిప్పుకున్నది. నాటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగుల్లో ఆశలు కల్పించారు. అది నిజమని నమ్మిన ఎంతోమంది బస్సు యాత్రలు నిర్వహించి ఆ పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయడమే కాదు, ఏకంగా పత్తి చేలు, వ్యవసాయ బావుల వద్ద కూలీలు, రైతులను కలిసి, కాళ్లు మొక్కి కాంగ్రెస్‌కు ఓట్లు వేయించేలా తమ వంతు ప్రయత్నించారు. తాత, నాన్నమ్మ, అమ్మమ్మలను కలసి వృద్ధాప్య పింఛనే కాదు, తమ పిల్లగాళ్లకు ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని నమ్మించారు. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 1.43% ఓట్ల తేడాతో గద్దె నెక్కింది. పదేండ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఉద్యోగాలు వచ్చాయి తప్ప నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగమూ రాలేదు.
ఎస్ఐ, కానిస్టేబుల్ 15,400 ఉద్యోగాలు, గురుకులాల్లో 9,000, గ్రూప్స్‌లో 48,000, ఫార్మాలో 7,000, జేఎల్ 1,392 వంటి ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్లు జారీ చేసి, ప్రిలిమ్స్, గ్రౌండ్స్, మెయిన్స్ పరీక్షలు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టి ఉంటే నిరుద్యోగుల ఆశలు ఫలించేవి. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క జీవో జారీ చేసి బీఆర్ఎస్ హయాం నాటి ఉద్యోగాలను తమ ఖాతాలోకి వేసుకున్నది.
ఉద్యోగాల భర్తీ విషయంలో ఒక మంత్రికి, మరో మంత్రికి మాటల్లో పొంతన లేకపోవటం విశేషం. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఒక సభలో 50 వేలు, మరో సభలో 60 వేలు, ఇంకో సభలో 70 వేలు అని ప్ర కటించడం గమనార్హం. కార్మిక మంత్రి వివేక్ అయితే, ఏకంగా లక్ష ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రాజ్యంగబద్ధంగా ఎన్నికైన మంత్రులు, సీఎం అబద్ధాలు చెప్పారని వారి ప్రకటనల మాటల్లోనే రుజువవుతున్నది.
డీఎస్సీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం 6 వేల ఉద్యోగాలు ప్రకటించగా, కాంగ్రెస్ ప్రభుత్వం 5,089 ఉద్యోగాలు కలిపి నియామక ప్రక్రియ పూర్తి చేసింది. గ్రూప్-1లో బీఆర్ఎస్ సర్కార్ 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించగా రెండుసార్లు ప్రిలిమ్స్ దశలో రద్దు అయ్యింది. కాంగ్రెస్ సర్కార్ వీటికి అదనంగా 60 ఉద్యోగాలు కలిపి ఎన్నో అభ్యంతరాలు, ఆందోళనలు, అక్రమాలు జరిగాయని నెత్తీనోరు మొత్తుకున్నా, కోర్టుల్లో కేసులు ఉన్నా, జీవో 29 ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని స్పష్టం చేసినా మేనేజ్మెంట్ కోటాలో గ్రూప్-1 పూర్తి చేసింది. అదేవిధంగా గ్రూప్-2లో 783, గ్రూప్-3లో 1,368 ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి పూర్తి చేసింది. వాస్తవానికి కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలు డీఎస్సీలో 5,089, గ్రూప్-1లో 60 ఉద్యోగాలు మాత్రమే.
ఇటీవల జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, శాసనమండలిలో ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌కుమార్, బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు ఉద్యోగాల భర్తీలో వాస్తవాలు వెల్లడించాలని అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. రెండున్నరేండ్లలో మొత్తం 67,763 ఉద్యోగాలు భర్తీ చేశామని, దానిలో 50,785 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నాటి ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చామని, 16,978 ఉద్యోగాలు తమ ప్రభుత్వ హయాంలో భర్తీ చేశామని వెల్లడించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 16,978 ఉద్యోగాల్లో కూడా 5,089 ఉద్యోగాలు కలిపిన డీఎస్సీ, గ్రూప్‌లో కలిపిన 60 ఉద్యోగాలు తప్ప జారీ చేసిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించినా ఎంపికైన వారికి ఇంతవరకూ నియామకపత్రాలు ఇవ్వలేదు. వైద్య, ఆరోగ్య శాఖలో జారీ చేసిన 6,807 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసినా, పరీక్ష పూర్తి చేసి ఏడాది దాటినా నియామక పత్రాలు ఇవ్వలేదు. ఆర్టీసీలో 2 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ నియామక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అంటే కాంగ్రెస్ సర్కార్ డీఎస్సీలో 5,089, గ్రూప్-1లో 60 ఉద్యోగాలు మాత్రమే ఇప్పటికి పూర్తిచేసిందని స్పష్టమవుతున్నది. అదే విధంగా ప్రభుత్వ ఖాతాలో వేసుకున్న గ్రూప్-2లో 783, గ్రూప్-3లో 1,368 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిపిన నియామకాలేనని ఘంటాపథంగా చెప్పక తప్పదు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో అందంగా ఫేజ్-1, ఫేజ్-2 పేరుతో మోసగించిన కాంగ్రెస్, అ సెంబ్లీ సాక్షిగా రెండుసార్లు జ్యాబ్ క్యాలెండర్ ప్రకటించినా నేటివరకూ అవి అమలుకు నోచుకోలేదు. కానీ ఉద్యోగాల పేరిట పాలకులు చేసే విచిత్రమైన ప్రకటనలు మా త్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ నిరుద్యోగులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఎంతోమంది నిరుద్యోగ యువత వివిధ ఉద్యోగాల కోసం నెలల తరబడి ప్రిపేర్ అవుతూ, హాస్టళ్లలో బిల్లులు కట్టలేక ఇరుకు గదుల్లోనే కాలం వెల్లదీస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికల్లో హామీలిచ్చిన మేరకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించాలి. ఎస్ఐ, కానిస్టేబుల్‌కు సంబంధించి 15 వేల ఉద్యోగాలు, అన్ని రకాల అనుమతులు పూర్తి చేసుకున్న 5,368 పవర్ సెక్టార్ ఉద్యోగాలు తక్షణం భర్తీ చేయాలి. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన జీపీవోకు సంబంధించి రెవెన్యూ గ్రామాలకు 10,954 ఉద్యోగాలు ప్రకటించగా కేవలం 3,500 మంది మాత్రమే పనిచేస్తున్నందున మిగిలిన 7 వేలకు పైగా ఉద్యోగాలను తక్షణమే పూర్తిచేయాలి.
ఇప్పటికే గ్రూప్-1, 2, 3 ప్రక్రియ పూర్తయినందున గ్రూప్-1లో 500, గ్రూప్-2లో 2,000, గ్రూప్-3లో 3,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలి. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా మెగా డీఎస్సీకి సంబంధించి 25 వేల ఉద్యోగాలు, ఏఈ, ఏఈఈ, లైబ్రేరియన్, హార్టికల్చర్, అగ్రికల్చర్, పీఈటీ, పీడీ, జేఎల్, డీఎల్, గురుకులాలు, మాడల్ స్కూల్, అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో ఉత్తుత్తి హామీలు ఇవ్వడం కాదు..వాటిని పక్కాగా అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
(వ్యాసకర్త: నిరుద్యోగ హక్కుల వేదిక నాయకుడు)
-పాలకూరి అశోక్‌కుమార్ గౌడ్
94918 73831