ఉమ్మడి రాష్టంలో కృష్ణానదిపై ప్రారంభించిన కల్వకుర్తి, రాజీవ్ భీమా, నెట్టెంపాడు.. అదే విధంగా అనుమతులు మంజూరు చేసిన పాలమూరు-రంగారెడ్డి, మక్తల్-నారాయణపేట-కొడంగల్ తదితర అన్ని ప్రాజెక్టులను పూర్తిచేయకుండా దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది.’ ఇవీ ఇటీవల అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు. నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారం. అంతకన్నా దుర్మార్గం ఏమీ లేదు. దక్షిణ తెలంగాణను ఎండబెట్టిందెవరు? పడావు పెట్టిందెవరు? వలసల జిల్లాగా మార్చిందెవరు? గంజి కేంద్రాలను నడిపిందెవరు?తాగునీరు కూడా అందించకుండా ప్రాణాలను పొట్టన పెట్టుకున్నదెవరు? అన్న ప్రశ్నలకు పాలమూరు బిడ్డలను ఎవరినడిగినా సమాధానం చెప్తారు.
ఇది కండ్లముందున్న చరిత్ర. నిన్నామొన్నటి వరకు పాలమూరు సహా దక్షిణ తెలంగాణ యావత్ అనుభవించిన తీరని వ్యథ. కాంగ్రెస్ పాలనలో చెరిపివేయలేని కన్నీటి గోస. హస్తం పార్టీ విషకౌగిలిలో పాలమూరు ఎంతగా నలిగిపోయిందో మాటల్లో చెప్పలేం. సూటిగా చెప్పాలంటే దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసిందే కాదు, ఇప్పుడు చేస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీనే. విలీనంతో మొదలైనపాలమూరు విధ్వంసం మళ్లా ఇప్పుడూ కొనసాగుతున్నది. నోటికాడి బుక్కను ఎత్తగొడుతున్నది.
‘పాలమూరుకు ఎవరు ఏం చేశారు? నీటి హక్కుల కోసం పోరాడిందెవరు? సాధించిందెవరు? నీరుగార్చిందెవరు? కృష్ణాలో ముంచిందెవరు?’ అనేది అందరికీ తెలుసు. ఇకనైనా కాంగ్రెస్ ఏలికలు మాటలు ఆపి చేతల్లో పాలమూరుపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. లేదంటే మళ్లీ ఉద్యమించక తప్పదు. ఇది తథ్యం.
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమై న వాటా దక్కకుండా పోవడానికి ముమ్మాటికీ కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ పాలకులు, ఉమ్మడి రాష్ట్రంలోని ఏలికలే కార ణం. రాష్ట్ర విలీనంతో నికరంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దాదాపు 170 టీఎంసీలను కోల్పోయింది. పాలమూరును పచ్చగా మార్చేందుకు అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్ర ప్రాజెక్టుల ద్వారా నైజాం చేసిన ప్రణాళికలన్నీ చెత్తబుట్టల పాలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు ఏలిన కాంగ్రెస్ నేతలు ఏనాడూ పాలమూరు నీటిహక్కులను పట్టించుకున్నది లేదు. ట్రిబ్యునళ్ల ముందు డిమాండ్లను పెట్టింది లేదు. ఉమ్మడి ప్రభుత్వాలు సీమ ప్రాజెక్టులను ఉరికించి పూర్తిచేసి, పాలమూరు ప్రాజెక్టులను పండవెట్టి కండ్ల ముందే నీళ్లను తరలించుకుపోయాయి.
ఏకపక్షంగా అన్యాయం జరుగుతున్నా పాలమూరే కాదు, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఎవరూ, ఏనాడూ నోరుమెదిపింది లేదు. పదవుల కోసం, గుత్తేదారు పనుల కోసం పెదవులు మూసుకున్నారే తప్ప అన్యాయాన్ని ప్రశ్నించిన దాఖలాల్లేవు. రాష్ట్ర విభజన సమయంలోనైనా తెలంగాణకు చేసిన ద్రోహాన్ని సరిదిద్దాలని చూడలేదు. ఇదిలా ఉంటే మరింత అన్యాయానికి గురిచేసింది మళ్లీ ఈ కాంగ్రెస్ పార్టీనే. నదీ పరీవాహక ప్రాంతం ఆధారంగా కృష్ణా జలాల పునఃపంపిణీ చేయకుండా అప్పటికే ఉన్న ప్రాజెక్టులవారీగా పంచాలని తెలంగాణ హక్కులను కాలరాసింది. పునర్విభజన చట్టంలో సెక్షన్ 89 పేరిట పాలమూరు గొంతు మరోసారి కోసింది. కాంగ్రెస్ పాపం ఫలితంగానే స్వరాష్ట్రంలోనూ పదేండ్లుగా తెలంగాణ జలదోపిడీకి గురవుతున్నది. నీళ్ల కోసం పోరాడాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన సమయానికి అప్పటికే తెలంగాణ, ఏపీలో నిర్మాణం పూర్తయిన, ప్రారంభించిన ప్రాజెక్టుల నీటి వినియోగ సామర్థ్యాలను లెక్కలోకి తీసుకొని, ఆ ప్రకారం ఏపీకి 512, తెలంగాణకి 299 టీఎంసీలు తేల్చడం వల్లే నేడు ఈ దుస్థితి. ఇది నిన్నా మొన్నటి చరిత్రనే. కండ్లముందు జరిగిందే.
ఉమ్మడి రాష్టంలో పాలమూరుకు నాటి కాంగ్రెస్ పాలకులు చేసిన విద్రోహానికి జూరాల, భీమా,కోయిల్‌సాగర్, నెట్టెంపాడుప్రాజెక్టులే సజీవ సాక్ష్యాలు. జూరాలప్రాజెక్టుకు ట్రిబ్యునల్ 17.84టీఎంసీలను కేటాయించింది.కర్ణాటక రాష్ట్రంలోని ముంపు బాధితులకు పరిహారం చెల్లించకపోవడంతో రాష్ట్ర ఏర్పాటు వరకూ ఏనాడూ
ఎఫ్ఆర్ఎల్ నింపలేదు.
ఇక ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వచ్చే సమయానికే దాని గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలకు పడిపోయింది. అందులో ప్రస్తుతం లైవ్ కెపాసిటీ 6.8 టీఎంసీలు మ్రాతమే. కాంగ్రెస్, నాటి టీడీపీలు చేసిన కుట్ర ఫలితంగానే పాలమూరు గడ్డపై నిలవకుండా ఎగువ నుంచి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు పరుగులు పెడుతూనే ఉన్నది. ఇదిలా ఉంటే ఈ వాస్తవాలు తెలిసి కూడా, ఉన్న ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితి ఉండబోదని నెత్తీనోరు కొట్టుకుని మొత్తుకున్నా ఉమ్మడి రాష్ట్ర పాలకులు వినలేదు. కుట్రపూరితంగా, కృష్ణాజలాలు తెలంగాణకు దక్కకుండా చేసేందుకు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా జూరాల ప్రాజెక్టును ఆధారంగా చేసుకునే అనేక ఎత్తిపోతల పథకాలను ప్రతిపాదించారు.
రాజీవ్ భీమా స్టేజ్-1, స్టేజ్-2, కోయిల్‌సాగర్, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలను జూరాల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచే చేపట్టారు. వెరసి ఇప్పుడు 9.66 టీఎంసీ సామర్థ్యం ఉన్న జూరాలపై ఆధారపడి ప్రస్తుతం 5.48 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ ఆయకట్టుకే వానకాలంలో నీరందించలేని దుస్థితి. ఇదీ కాంగ్రెస్ ఏలికల నిర్వాకం. ఇప్పుడైనా ఆ తప్పును సవరించుకునే ప్రయత్నం రేవంత్‌రెడ్డి సర్కారు చేస్తున్నదా అంటే మరింత అన్యాయానికి గురిచేస్తున్నది. భీమా నికర జలాల్లోనే కోత విధించి కొడంగల్-నారాయణపేట్‌ను చేపట్టి మరో లక్ష ఎకరాల ఆయకట్టు భారాన్ని జూరాలపై మోపింది. ప్రాజెక్టు ఉసురుతీయ పూనుకున్నది. సరే భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి పనులనైనా పూర్తిచేసిందా అంటే లేదు. మట్టిపనులు చేసి నిధులు కొల్లగొట్టారు తప్ప నీళ్లివ్వాలనే ఆలోచనే లేకుండాపోయింది.
ప్రాజెక్టులకు జీవోలు ఇవ్వడం, చేతులు దులుపుకోవడం. అక్కడికే పరిమితం. నిధులివ్వకుండా, భూ సేకరణ చేపట్టకుండా, అటవీ అనుమతులు, రైల్వే, రోడ్ క్రాసింగ్, అంతర్రాష్ట్ర వివాదాలు, కాంట్రాక్టు సంస్థలతో వివాదాలు, కోర్టు కేసులు తదితర సాకులు చూపెడుతూ తెలంగాణ ప్రాజెక్టులను మూలకు నెట్టారు. ఏపీ ప్రాజెక్టులను పరుగులు పెట్టించి ద్రోహం చేసిందే కాంగ్రెస్. ఇప్పుడు పూర్తిస్థాయిలో తాత్కాలిక వాటా జలాలనైనా తెలంగాణ వినియోగించుకోలేకపోవడానికి, దాచుకోలేకపోవడానికి, మొత్తంగా నిస్సహాయతకు కాంగ్రెస్ పార్టీనే కారణం. ఏపీ యథేచ్ఛగా జలాలను మళ్లించుకొని, దాచుకునేందుకు ఊతమిచ్చిందే కాంగ్రెస్ పాలకులు. ఇది ముమ్మాటికీ సత్యం.
ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కథ పెద్దది. దీని పాపమూ కాంగ్రెస్, టీడీపీలదే. బచావత్ ట్రిబ్యునల్ అవార్డ్‌తో ఆంధ్రా నేతల ఆశలకు గండిపడింది. కోస్తా ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ పాలకులు 1973 నుంచే కొత్త పన్నాగాలకు తెరతీశారు. తమిళనాడుకు తాగునీటి సరఫరాను ఆసరాగా చేసుకొని శ్రీశైలం ప్రాజెక్టుకు గండి కొట్టింది కాంగ్రెస్ పార్టీనే. శ్రీశైలం డ్యాం నుంచి లైనింగ్ చేసిన, 1500 క్యూ సెక్కుల సామర్థ్యానికి మించని కెనాల్ ద్వారా పెన్నా వరకు, అక్కడి నుంచి మద్రాస్‌కు 15 టీఎంసీలను తరలిస్తామని చెప్తూ 874 ఎత్తు వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. కానీ,
1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక బేసిన్‌లోని రాష్ర్టాల ఒప్పందాన్ని వక్రీకరించి తమిళనాడుతో ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుని తెలుగు గంగ పథకాన్ని తెరమీదికి తీసుకువచ్చారు. 3,500 క్యూసెక్కుల చొప్పున మూడు గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా దురాలోచన చేసి 5,200 క్యూసెక్కుల
సామర్థ్యంతో ఏర్పాటుచేశారు.
ఏ ప్రాజెక్టు వద్ద లేనివిధంగా స్టాండ్ బై పేరిట మూడింటిని అదనంగా మరో గేట్‌ను అదే సామర్థ్యంతో నిర్మించారు. కాగితాల్లో 11,150 క్యూసెక్కులుగా ఉంటే, ఆచరణలో భవిష్యత్తులో విస్తరించుకునేందకు వీలుగా రెండింతలు 20,560 సామర్థ్యంతో గేట్లను ముందుగానే ఏర్పాటుచేశారు. అంతేనా సిమెంట్ లైనింగ్ లేకుండానే ఒప్పందాలకు విరుద్ధంగా రెండు మూడింతల ఎక్కువ సామర్థ్యంతో కాలువలను తవ్వారు. హెడ్ రెగ్యులెటరీ కాలువనే 11,150 క్యూసెక్కులు ఉంటే, దాని నుంచి నీటిని విడుదల చేసే గేట్ల సామర్థ్యం అంతమేరకే ఉండాలి. కానీ, అందుకు భిన్నంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దిగువన బనకచర్ల రెగ్యులేటరీ వద్ద ఒక్కో గేట్‌ను 11,150 సామర్థ్యంతో మూడు గేట్లను ఏర్పాటుచేసి, మొత్తంగా 33,450 క్యూసెక్కుల నీళ్లను తరలించేలా ప్రణాళికలను దశాబ్దాల ముందుగానే రూపొందించుకున్నారు. ఆ పనులన్నీ 1987-88 కాలంలో పూర్తికాగా, నాటినుంచి బేసిన్ ఆవల ఉన్న ప్రాంతాలకు కృష్ణా జలాల అక్రమ మళ్లింపునకు తొలి బీజం పడింది. మళ్లా 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన వైఎస్ఆర్ తెలంగాణకు అంతకుమించి తీరని ద్రోహాన్ని తలపెట్టారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. సరే అక్కడితో ఏమైనా ఊరుకున్నారా అంటే అదీ లేదు. మళ్లీ అందులోనూ మరో అక్రమానికి తెగబడ్డారు. భవిష్యత్తులోనూ తిరిగి హెడ్ రెగ్యులేటరీ కెపాసిటీని 88 వేల క్యూసెక్కులకు పెంచుకునేందుకు అనువుగా కెనాల్ బెడ్ లెవల్ 32 మీటర్ల నుంచి ఏకంగా 78 మీటర్లకు పెంచడంతో పాటు, లైనింగ్ లేని కెనాల్‌ను ప్రతిపాదించి అప్పుడే వైఎస్ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పరోక్షంగా 70 వేలకు పెంచారు. పోతిరెడ్డిపాడు వద్ద అప్పటికే ఉన్న నాలుగు గేట్లను తొలగిస్తామని చెప్పినా నేటికీ ఆ పనిచేయలేదు. అదనంగా 10 గేట్లను నిర్మించారు. ఇదీ పాలమూరుకు కాంగ్రెస్ చేసిన విద్రోహానికి తార్కాణం. దాని కొనసాగింపులో భాగంగానే ముఖ్యమంత్రి అయ్యాక జగన్ రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. కృష్ణా జలాల సాధనకు ఉద్యమనేతగా కేసీఆర్ చేసిన పోరాటాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఎన్జీటీ వరకు వెళ్లి, ప్రాజెక్టును సవాల్ చేసి అడ్డుకున్నది నేను. ఆ గతికి తీసుకొచ్చిందే కాంగ్రెస్. వీటిపై కాంగ్రెస్ నేతలు ఏనాడూ మాట్లాడలేదు. మళ్లీ వారే ఇప్పుడు పాలమూరు అన్యాయంపై మొసలి కన్నీరు కార్చడం సిగ్గు చేటు. కృషా ్ణజలాల్లో హక్కులను కాలరాసి.. ప్రాజెక్టులను పండబెట్టి.. పెండింగ్ ప్రాజెక్టులుగా పేరు పెట్టి.. పాలమూరును నిలువునా ముంచి.. వలసబాట పట్టించిన హస్తం పార్టీనే నేడు సుద్దులు చెప్తున్నది.
కృష్ణాలో పాలమూరు జిల్లాకు కొంతైనా న్యాయం జరిగిందంటే, సాంత్వన చేకూరిందంటే అది ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితమే. పోతిరెడ్డిపాడు విస్తరణతో వాటిల్లబోయే నష్టాన్ని గ్రహించి పదవులకు రాజీనామా చేసి నాడు గర్జించారు. పాలమూరు గొంతుకను వినిపించారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి పాలకులు చూపుతున్న వివక్షను ప్రశ్నించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కృష్ణా జలాల సాధనకు చేసిన కృషి అద్వితీయం. కర్నాటక రాష్ట్రంలోని ముంపు బాధితులకు పరిహారం చెల్లించారు. జూరాల ప్రాజెక్టును పూర్తిస్థాయి మేరకు నీటి నిల్వ చేసుకునేలా చేశారు. పెండింగ్ ప్రాజెక్టులుగా పేరొందిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేసి రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు. చెరువులతో అనుసంధానించి, చెక్‌డ్యామ్‌లను నిర్మించి, కృష్ణమ్మను ఒడిసిపట్టి.. మెట్ట భూములకు కృష్ణమ్మను
తరలించిన ఘనత కేసీఆర్‌దే.
అంతేకాదు, పునర్విభజన చట్టంలోని సెక్షన్-89 వల్ల తెలంగాణకు, పాలమూరుకు ఎలాంటి ప్రయోజనం ఒనగూడబోదని, అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956 సెక్షన్ 3 ప్రకారమే న్యాయమే జరుగుతుందని గుర్తించింది కేసీఆరే. కోర్టులకు వెళ్లి, పట్టు బట్టి, కేంద్రాన్ని ఒప్పించి చివరికి సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్‌ను సాధించింది ఆ ఉద్యమ నాయకుడే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పట్టాలెక్కించారు. జూరాలపై భారం లేకుండా, ఏడాది పొడవునా కృష్ణా జలాలను అందుబాటులో ఉండేలా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ప్రాజెక్టును రీ డిజైన్ చేశారు. పాలమూరు గడ్డపై కృష్ణమ్మను నిలిపేందుకు భారీ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తిచేశారు. ప్రధాన హెడ్ వర్క్స్ పనులన్నీ పూర్తికాగా, కొద్దిపాటి డిస్ట్రిబ్యూటరీ పనులే మిగిలి ఉన్నాయి. వాటిని కూడా పూర్తిచేయకుండా ఇప్పుడు పాలమూరును ఎండబెడుతున్నది కూడా మళ్లా కాంగ్రెస్సే.
-గవినోళ్ల శ్రీనివాస్
89198 96723