ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి వేధించడంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఒకే గూటికి చెందిన పక్షులు. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడంలో ఈ రెండు పార్టీలు ఒకేరకంగా వ్యవహరిస్తున్నాయి. బాహ్య ప్రపంచానికి కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యర్థులుగా కన్పిస్తున్నప్పటికీ.. ఈ రెండు పార్టీల మధ్య రహస్య బంధం ఉన్నదన్నది మాత్రం ‘ఫార్ములా ఈ’ రేస్ కేసుతో సంపూర్ణంగా బట్టబయలైంది.
ఇన్ని రోజులు ఉప్పు, నిప్పులా ఉన్నట్టు నటించి దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి, బీజేపీ నేతలు ‘ఫార్ములా-ఈ’ రేస్ కేసుతో వారి మధ్య ఉన్న చీకటి బంధం బయటపడింది. ఢిల్లీలో బీజేపీకి రేవంత్ రెడ్డి ఏ-టీంగా వ్యవహరిస్తుంటే.. తెలంగాణ బీజేపీ కాంగ్రెస్‌కు బీ-టీంగా వ్యవహరిస్తున్నది. ఇలా పరస్పర ఒప్పందంతో ఈ రెండు పార్టీలు ప్రతిపక్షాలపై రాజకీయ ప్రతీకార చర్యలకు దిగుతున్నాయి. అక్రమ కేసులతో ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి.
కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మా స్కీమ్‌తో విపక్షాలను కంట్రోల్లో పెట్టుకుంటున్నది. తమకు కొరుకుడు పడని నేతలను సామ దాన భేద దండోపాయాలతో లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ ఒత్తిడికి తల వంచని వారిపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి, దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐతో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏసీబీతో విపక్షాలపై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు. రాజ్యాంగ వ్యతిరేక పాలన చేస్తున్న బీజేపీ.. ప్రశ్నిస్తున్న జర్నలిస్ట్‌లు, ప్రజాస్వామ్య వాదులపై చీటికిమాటికి కేసులు పెడుతూ జైల్లో వేస్తున్నది. కాషాయ పార్టీ బాటలోనే ఇప్పుడు రేవంత్‌రెడ్డి నడుస్తూ కాంగ్రెస్ చట్టవ్యతిరేక పాలనపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేసేందుకు గాను వేయని ఎత్తులు లేవు. అందులో భాగంగానే అటు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా పన్నాగాలు పన్నుతూనే ఉంటాయి. అయితే పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన ఈ పార్టీలు ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఆ సిద్ధాంతాలను మరిచిపోయి ‘నాకు నువ్వు, నీకు నేను’ అన్నట్టుగా చెలిమి చేస్తున్నాయి.
జాతీయ స్థాయిలో విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో కేసులు పెట్టి వేధించడంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ దొందూ దొందే అని నిరూపించుకున్నాయి. దేశంలో తమను వ్యతిరేకించే చిన్న పార్టీలను రాజకీయంగా బతికి బట్టకుండా చేసి అవి కోలుకోకుండా దారుణంగా దెబ్బతీస్తున్నాయి. అయితే, దశాబ్దకాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వాలు విచారణ సంస్థల కంటే ముందే దర్యాప్తులోని కీలక అంశాలు మీడియాకు లీక్ చేస్తున్నారు. కేసు బలహీనమవుతున్న ప్రతి సందర్భంలో విచారణ సంస్థల దగ్గర ఉండాల్సిన సమాచారం లీక్ చేస్తున్నారు.
గతంలో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ విచారణకు ముందే బీజేపీ వీడియో విడుదల చేసింది. కేజ్రీవాల్, సిసోడియా అరెస్టవుతారని కాషాయ నేతలు ముందే చెప్పారు. తెలంగాణలో కూడా కవిత అరెస్టవుతారని ఈడీ అధికారుల కంటే ముందే బండి సంజయ్ చెప్పారు. బీజేపీ నేతలు ఏ అంశాలైతే లేవనెత్తారో, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ విచారణలో అవే అంశాలను బయటపెట్టడం గమనార్హం. విపక్ష నేతలను అరెస్ట్ చేసి నెలల తరబడి జైల్లో పెట్టి పెట్టి ఆనందించారు.
తాజాగా ‘ఫార్ములా ఈ’ రేస్ కేసులో కూడా అధికార పార్టీ నేతలు కేసును ప్రభావితం చేసేలా ప్రకటనలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బలహీనమైన కేసును క్లిష్టంగా మార్చేందుకు అనూహ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ అంశాన్ని ముందుకు తెచ్చారు. కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ మంత్రులు, నేతలు పోటీలుపడి మరీ తీర్పులు చెప్పేస్తున్నారు. అసలు ‘ఫార్ములా ఈ’ రేస్ కేసుకు, ఎలక్టోరల్ బాండ్స్‌కు సంబంధం లేదు. అయినా కేసును మరింత జఠిలం చేసేందుకు కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా తప్ప ఇది మరోటి కాదు. ‘ఫార్ములా ఈ’ రేస్ కేసులో ఏదో జరిగిందని, కేటీఆర్‌కు ఏదో ప్రయోజనం చేకూరిందని కోర్టును నమ్మించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తునారు.
కాంగ్రెస్ పార్టీ ఎంత కక్షతో ఉన్నదంటే సుప్రీం కోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేస్తారని తెలిసి ముందే తెలంగాణ ప్రభుత్వం కేవియెట్ పిటిషన్ వేసింది. నిజంగానే ఫార్ములా ఈ కేసులో క్విడ్ ప్రో కో జరిగి ఉంటే బాధితుడి కంటే ముందే ప్రభుత్వం కేవియెట్ పిటిషన్ వేయాల్సిన అవసరం లేదు. తప్పు జరిగితే సుప్రీం కోర్టు కూడా న్యాయం చెప్తుంది. అయితే అంతకంటే ముందే కేటీఆర్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని కేవియెట్ వేసినట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ ప్రతీకార చర్యలు రాజ్యాంగ ఉనికిని దెబ్బతీస్తాయి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేసేందుకు గాను వేయని ఎత్తులు లేవు. అందులో భాగంగానే అటు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా పన్నాగాలు పన్నుతూనే ఉంటాయి. అయితే పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన ఈ పార్టీలు ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఆ సిద్ధాంతాలను మరిచిపోయి ‘నాకు నువ్వు, నీకు నేను’ అన్నట్టుగా చెలిమి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీకి తెలంగాణ ముఖ్యమంత్రి చాటుగా సహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఆయన ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులను కలుస్తారనే విషయం తెలిసిందే. అయితే జాతీయ పార్టీలు ఎన్నిరకాల కుయుక్తులు చేసినా ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేయడం అసాధ్యమనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది.
– (వ్యాసకర్త: ఫ్రీలాన్స్ జర్నలిస్టు) తోటకూర రమేశ్