‘గొంగట్లో కూర్చొని భోజనం చేస్తూ వెంట్రుకలు ఏరుకున్నట్టు’.. చుట్టూ కోవర్టులను పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గుజరాత్లో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. నిజానికి రాహుల్‌గాంధీ గుజరాత్ గడ్డపై ఆ వ్యాఖ్యలెందుకు చేసిండు? ఆ కామెంట్లు ఒక్క గుజరాత్‌కే పరిమితమా? లేక కాంగ్రెస్ పార్టీలో దేశమంతటా బీజేపీ కోవర్టులు, కట్టప్పలున్నారా అనే చర్చ జరుగుతున్నది. జీ-8 గ్రూపు ముందు, తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీలో కోవర్టులకేం కొదవేలేదు. కాకపోతే ఆయన ఓ ఎల్వోపీ లీడర్ హోదాలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒకింత చర్చకు దారితీస్తున్నాయి.
చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దశ దిశ కోల్పోయి ఒంటరవుతున్న సందర్భంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ గుజరాత్ గడ్డకెళ్తే గానీ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులున్నరనే నిజాన్ని తెలుసుకోలేకపోయారట! కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను, నేతలను గుర్తించాల్సిన అవసరం ఉన్నదన్న రాహుల్ వ్యాఖ్యలపై దేశవ్యాప్త చర్చ జరుగాల్సిందే. గుజరాత్లో సగం మందికిపైగా కాంగ్రెస్ నాయకులు బీజేపీకి బీ-టీమ్‌గా పనిచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి వారినందరినీ గేలం వేసి పట్టుకుని మరీ బయటకు పంపేస్తానని రాహుల్ హెచ్చరించారు. అయితే కోవర్టులను అందలమెక్కించి కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులున్నారన్న ఆయన వ్యాఖ్యలను పరిపక్వతలేనివిగా చూడాలి. పార్టీ బాధ్యతలు చేపట్టే ధైర్యం లేక పార్టీని వెంటిలేటర్‌పై నడిపిస్తున్న రాహుల్‌గాంధీ తెలంగాణ సీఎంతో ఎందుకు ఎడం పాటిస్తున్నారో స్పష్టం చేయాల్సి ఉంటుంది. బీజేపీ కోవర్టులు ఒక్క గుజరాత్‌లోనే కాదు.. తెలంగాణలోనూ, అందునా స్వయంగా ఓ సీఎం స్థాయిలో ఉన్నారనే బహిరంగ రహస్యం రాహుల్‌కు తెలియనిది కాదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేండ్ల తర్వాత అనేక అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి ఎంపికలో చారిత్రక తప్పిదం చేసింది.
కనీసం మంత్రిగా అనుభవం లేకపోవడం, రాష్ట్రంలోని మిగతా సీనియర్ నాయకులను కాదని ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడం ఆ పార్టీ చేసిన అతి పెద్ద తప్పిదం. పాలనలో అనుభవం లేకపోవడంతో హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆర్థిక విధ్వంసానికి ఒడిగట్టి చరిత్రలో కాంగ్రెస్ పార్టీ పేరెత్తకుండా చేస్తున్నారు.
ఇక పదేండ్లు ప్రజలకు చేరువైన ప్రజాపథకాలను అటకెక్కించారు. రైతుబంధు ఆపేయడం, రుణమాఫీ సరిగ్గా చేయకపోవడం, విద్యార్థుల ఆకలి చావులు, హాస్టళ్లలో మోగుతున్న విషాహారపు మరణ మృదంగాలు, రైతుల ఆత్మహత్యలు, నేత, గీత కార్మికుల చావులు, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యానిధి, కేసీఆర్ కిట్, దళితబంధు, బీసీబంధు.. ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతీ పథకాన్ని రద్దు చేసి ఆ పార్టీ, ప్రభుత్వం ప్రజలకు దూరమైంది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తున్నారు సరే, మరి కాంగ్రెస్ మార్కు, రేవంత్ మార్కు పథకాలేమైనా కొత్తగా రాష్ట్రంలో పురుడు పోసుకున్నాయా అంటే అదీ లేదు అరకొరగా ఒక్క ఫ్రీ బస్సు తప్ప. ఆరు గ్యారెంటీలు, 420 హామీల వైఫల్యాలతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు చీదరించుకుంటున్నారన్నది బహిరంగ రహస్యం.
ఇక రేవంత్‌రెడ్డి సీఎంగా అలా బాధ్యతలు స్వీకరించగానే ఇలా నేను ఎప్పుడూ ఆర్ఎస్ఎస్ తాలుకూ మనిషిని, ఏబీవీపీలో పనిచేసిన అనుభవం, చంద్రబాబు దగ్గరి శిష్యరికపు పరిచయాలతో మోదీకి, బీజేపీకి క్రమేపీ దగ్గరైన సీఎం రేవంత్ తెలంగాణలో బీజేపీ ఎజెండానే అమలు పరుస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌కు, రాహుల్‌గాంధీకి, సీనియర్లకు వ్యతిరేకంగా అనేక చర్యలకు ఒడిగట్టారని పార్టీ వర్గాలే చెప్తుంటాయి. రాహుల్‌గాంధీ నిండు పార్లమెంట్లో అదానీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భంలో అదానీతో ప్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఆహ్వానించడం, దావోస్లోఆయన పెట్టుబడులు స్వీకరించడం బీజేపీలో, కాంగ్రెస్‌లో ఒకింత చర్చకు దారితీసింది. అంతేకాదు ఓ అడుగు ముందరేసి ఓ పెద్ద భూమి కొనుగోలు ఒప్పందం నిమిత్తం అదానీ స్వయంగా హైదరాబాద్ కొచ్చి సీఎం రేవంత్‌ను కలిసి వెళ్లిన వాస్తవాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోలతో సహా బయటపెట్టారు. అదానీతో రేవంత్ దోస్తానీ అంశంతో రాహుల్‌గాంధీ నొచ్చుకున్నారని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు.
రాహుల్‌గాంధీ మొట్టికాయలు వేస్తే తప్ప అదానీ ఇచ్చిన రూ. 100 కోట్ల విరాళం వెనక్కి ఇవ్వలేదు. రాజ్యాంగం చేతపట్టుకొని పార్లమెంట్లో రాహుల్ హడావుడి చేస్తుంటే ఇక్కడ రేవంత్ ఆయన అభీష్ఠానికి వ్యతిరేకంగా పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పారు. ఒక దశలో మంత్రివర్గ విస్తరణలో కొత్తగా వచ్చిన వారికి క్యాబినెట్ అవకాశాలు ఇస్తా అంటే సీనియర్లు రాహుల్‌కు చెప్పి అడ్డుకోవాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. ఇక రాహుల్‌కు ప్రీతిపాత్రమైన కులగణన అంశాన్ని కూడా బీజేపీ, మోదీ డైరెక్షన్లో సీఎం రేవంత్ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారన్న అపవాదు ఉన్నది. 2014లో అప్పటి సీఎం కేసీఆర్ ఒక్క పిలుపుతో సమగ్ర కుటుంబ సర్వేకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు కదిలొచ్చి వారి వివరాలను 24 గంటల్లో నమోదు చేసుకొని చరిత్ర సృష్టించారు.
కానీ, తెలంగాణలో 55 రోజుల పాటు నిర్వహించిన సమగ్ర సర్వేకు సీఎం పిలుపునివ్వకపోగా ఒక్క సమీక్ష నిర్వహించలేదు. ఫలితంగా ఆ లెక్కలు తప్పుల తడక అని రూఢీ అయి సొంత పార్టీ నేతలే వాటిని చిత్తు కాగితాలుగా పోల్చి కాలబెట్టిన దుస్థితి. ఇది కూడా మోదీ ఎజెండాలో భాగంగా రేవంత్ అమలు చేశారని ఆ పార్టీ ఇంటెలిజెన్స్ సమాచారం. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 38 సార్లు ఢిల్లీకి వెళ్లి నాలుగు సార్లు అధికారికంగా ప్రధాని మోదీని కలిశారు. కేంద్ర మంత్రులందరినీ ఆలింగనం చేసుకున్నా రాష్ర్టానికి పైసా నిధులు తేలేకపోయారు. ఇటీవల ప్రధాని మోదీతో జరిపిన భేటీలో దాదాపు 40 నిమిషాలు ఏకాంతంగా గడిపారని వార్తలొచ్చాయి. ఓ పక్క తెలంగాణలో మండలి ఎన్నికలు హోరాహోరీగా జరుగుతుంటే కరీంనగర్ వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి ఓడినా, గెలిచినా ఫర్వాలేదని చెప్పిన తెల్లారే ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ దేనికి సంకేతం? బీజేపీ రెండు స్థానాలు గెలిచేలా పరోక్షంగా ఉపకారం చేయడం ద్వారా సీఎం ఏం చెప్పదలుచుకున్నరు ? రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ జాతీయ పార్టీలేనని, 38 మంది ఎమ్మెల్యేలతో 38 శాతం ఓటింగ్‌తో బలంగా ఉన్న బీఆర్ఎస్ ఇక ఉండదని రేవంత్‌రెడ్డి, బీజేపీ నేతలు పదే పదే ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది? బీజేపీ నేతల కనుసన్నుల్లో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు, అరెస్టులు ఎందుకు చేయాల్సి వస్తున్నదో రాహుల్ తెలుసుకొని మసులుకోవాలి. 2014లోనే రూ.50 లక్షలతో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేయాలని అడ్డంగా దొరికిన రేవంత్ ఇవాళ ఢిల్లీకి మూటలు పంపితే పంపవచ్చును గాక, ఇటీవల ఎన్నికలకు ఫండింగ్ ఇస్తే ఇవ్వవచ్చు గాక, ఇక్కడ రియల్టర్లను కొట్టి ఢిల్లీ పెద్దలకు ముడుపుల రూపంలో పంపుతున్న ఆయన నైజంపై రాహుల్ ఇప్పటికైనా దృష్టి పెట్టాలి. ఇటీవలే నియమితులైన కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్‌కు ఇక్కడి అంశాలు అప్పుడే అర్థమై ఉండవచ్చును. అందుకే కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులున్నారన్నది నిజం. కాకపోతే ఏకంగా సీఎంలే కోవర్టులుగా మారితే ఆ పార్టీని దేవుడు కూడా కాపాడలేడు. ‘ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడ’న్న నిజాన్ని తెలుసుకొని రాహుల్‌గాంధీ మసులుకోవాలి.
(వ్యాసకర్త: చైర్మన్, టీ కేసీఆర్ సెంటర్, తెలంగాణ నాలెడ్జ్ క్రియేషన్ రీసెర్చ్ సెంటర్)
-గోసుల శ్రీనివాస్ యాదవ్