తెలంగాణలో ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యను అందిస్తున్న కాలేజీలకు ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన ట్యూషన్ ఫీజు బకాయిలు భారీగా పేరుకుపోయాయి. దీంతో . ప్రభుత్వ స్పందన కరువై ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యి కాలేజీలు మూతబడ్డాయి. ప్రభుత్వం మాత్రం సమస్యలో తీవ్రతను పక్కనబెట్టి, వాటి సమ్మెను
ధిక్కారంగా భావించింది.
సెప్టెంబర్ 15 నాడు దినమంతా అధికారులను కూర్చోబెట్టి ఈ కాలేజీలను ఎలా ఇబ్బంది పెట్టాలి? తద్వారా వాటిని తమ కాళ్లబేరానికి ఎట్లా తెచ్చుకోవాలి? అనే కోణంలో ఆలోచించింది. కాలేజీల్లో నెలకొన్న అధ్యాపకుల కొరత, నాణ్యతాలోపం, వసతుల లేమి తదితర అంశాలను వెతికి కక్షసాధింపు చర్యలు చేపట్టాలనుకున్నది. గతేడాది ఈ కాలేజీలపై వచ్చిన టాస్క్‌ఫోర్స్ కమిటీ రిపోర్ట్‌ను తిరిగేసింది. దానిలో అనేక కాలేజీలపై పలు లొసుగుల సమాచారమున్నది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి బృందాల తనిఖీల్లో కొన్ని కాలేజీలు నిషేధిత భూముల్లో ఉన్నాయన్న సమాచారం ఉన్నది. ప్రభుత్వాన్ని ఎదిరిస్తే మొదటికే మోసం వచ్చేలా ఉందన్న భయం కాలేజీ యాజమాన్యాలలో ప్రభుత్వం పరోక్షంగా కలిగించింది. అదే రోజు సాయంత్రం ఆరంభమైన చర్చల్లో కాలేజీలు ప్రభుత్వ ప్రతిపాదనలను ఒప్పుకొన్నాయి. దసరా నాటికి రూ.600 కోట్లు, దీపావళికి మరో రూ.600 కోట్లు ఇస్తామన్నది ఆ చర్చల సారాంశం. ఈ చర్చల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నందున యాజమాన్యాల సమాఖ్య ప్రతినిధులు సంతృప్తి చెందారు. తొలుత రూ.600 కోట్లు ఇచ్చాక, నెలకు రూ. 200 కోట్లు చెల్లించి బకాయిలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ అన్నారని భట్టి వారికి హామీ ఇచ్చారు. ఎంతో ఆశాజనకంగా ఈ చర్చలు ముగిశాయి.
అయితే, ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది. దసరాకు ముందు రూ.200 కోట్లు మాత్రమే ఫీజు బకాయిల కింద విడుదల చేసింది. ఈ ఊహించని పరిణామానికి కాలేజీ యాజమాన్యాల ఆశలు గల్లంతయ్యాయి. సాక్షాత్తు మంత్రుల సమక్షంలో జరిగిన చర్చలకే గతి లేని పరిస్థితిలో తమకు సమ్మె తప్ప మరో దారి లేదని కాలేజీ యాజమాన్యాలు తిరిగి తమ కార్యాచరణను ప్రకటించాయి. ఈ నెల 12వ తేదీ నాటికి మిగతా రూ.1,000 కోట్లు విడుదల చేయకపోతే 13 నుంచి సమ్మెకు దిగడం ఖాయమని తేల్చాయి. ఇక మంత్రులపై నమ్మకం లేదని, సరాసరి ముఖ్యమంత్రితోనే చర్చలకు ఒప్పుకొంటామని ఆ సమాఖ్య స్పష్టం చేసింది.
ఈ కాలేజీ యాజమాన్యాలతో గొడవ ఎందుకని ప్రభుత్వం కొత్త ఆలోచనకు తెరలేపనున్నట్టు తెలుస్తున్నది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విద్యార్థి బ్యాంకు ఖాతాలో వేస్తే సమస్య విద్యార్థి, కాలేజీ మధ్యనే ఉండిపోతుందని ప్రభుత్వానికి ఆలోచన తట్టినట్టు తెలుస్తున్నది. ఇక కాలేజీలు రీయింబర్స్మెంట్ అని ప్రభు త్వం వెంటపడటం, బంద్ చేస్తామని ఇబ్బంది పెట్టడం లాంటివి ప్రభుత్వానికి ఉం డవు. కాలేజీలు కూడా ప్రభుత్వం వైపు చూడకుండా విద్యార్థికి గడువు పెట్టి ఫీజు వసూలు చేస్తాయి. ఇక ఫీజుకు విద్యార్థే బాధ్యుడు. ప్రభుత్వం విద్యార్థి ఖాతాలో ఎప్పుడేసినా యాజమాన్యాల ఒత్తిడికి, సర్టిఫికెట్లు అవసరమైతే విద్యార్థి సొంతంగా కాలేజీకి ఫీజు కట్టాలి. గ్యాస్ సిలిండర్ రాయితీలాగా ఏదో రోజు విద్యార్థి ఖాతాలోకి ఈ సొమ్ము వస్తుంది. ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ రూపం మారిపోయేలా ఉన్నది. ఇప్పటికే అరకొర చెల్లింపులతో ప్రజలు ఇబ్బంది పడుతున్న రైతు భరోసా, ఆసరా పింఛన్ల జాబితాలోకి ఇది కూడా చేరిపోవచ్చు.
ఈ ఏడాదిన్నర పాటు వృత్తివిద్యా కాలేజీలపై దృష్టిపెట్టని ప్రభుత్వం ఇప్పుడు కాలేజీలు ఫీజు చెల్లించాల్సిందేనని అనగానే కక్ష కట్టినట్టు తనిఖీల ప్రస్తావన తెస్తున్నది. కచ్చితంగా పాటించవలసిన ప్రమాణాలను బెదిరింపు ధోరణికి వాడుకోవడం పొరపాటు. ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము కూడా ప్రజలదే. దానికి తగిన ప్రయోజనం ప్రజలకు అందాలి.
-బద్రి నర్సన్