సుప్రీంకోర్టులో ఒక కేసులో వాదోపవాదాలు విచారిస్తున్న సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు విపరీతమైన సంచలనం కలిగించాయి. కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) అనే వ్యంగ్య రాజకీయ పార్టీ పుట్టుకకు దారితీశాయి. సామాజిక మాధ్యమాలలో అదొక సంచలనమై కూర్చున్నది. అయితే కొందరు ఊహిస్తున్నట్టుగా లేదా మరికొందరు ఆరోపిస్తున్నట్టుగా ఇది ఎవరో అంటించిన నిప్పు కాదు. మనదేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెంపుదల, అవినీతికి నిరసనగా ఒక ఉద్యమరూపాన్ని సీజేపీ సంతరించుకుంటున్నది.
కాక్రోచ్ ఉద్యమం మే 16న ప్రారంభమైంది. భారత ప్రధాన న్యాయమూర్తి యువ నిరుద్యోగులను కాక్రోచ్‌లతో, అంటే బొద్దింకలతో పోల్చినట్లుగా వార్తలు రావడం నేపథ్యంగా ఈ వ్యంగ్య ఉద్యమం మొదలైంది. తర్వాత తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిజానికి బొద్దింకలు అని అన్న వ్యాఖ్యను సీజేఐ ఉపసంహరించుకున్నారు కూడా. అయినా ఆ వ్యాఖ్యల పర్యవసానంగా తలెత్తిన ఉద్యమం విసురుతున్న వ్యంగ్య విమర్శలు, విసుర్లు మన సమాజాన్ని కదిలించి వేస్తున్నాయి.
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అనే పేరుతో ప్రారంభమైన ఈ ఆన్లైన్ వ్యంగ్య వేదిక, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో యువతను ఆకర్షిస్తూ విపరీతమైన ప్రజాదరణ సంపాదించింది. ఈ డిజిటల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి అభిజీత్ దీప్కే. ఆయన గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు సోషల్ మీడియా వాలంటీర్‌గా పనిచేశారని తెలుస్తున్నది. అయితే సీజేపీ ప్రారంభం పూర్తిగా ఒక రాజకీయ పార్టీగా కాకుండా, యువత అసంతృప్తి, రాజకీయ వ్యంగ్యం, డిజిటల్ కల్చర్, మీమ్ రాజకీయాల కలగలుపుగా తలెత్తిన ఉద్యమంగా ముందుకు వచ్చింది. సీజేపీ ఎక్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, వెబ్‌సైట్‌ను తొలగింపునకు గురయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే ఇదంతా జరిగిందని దీప్కే ఆరోపించారు.
కాక్రోచ్ అంటే సాధారణంగా ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని బ్రతికే పురుగు అనే భావన ఉన్నది. ఆ ప్రతీకను ఉపయోగిస్తూ, ఎంత ఒత్తిడి వచ్చినా యువత గొంతును ఆపలేరు అనే సందేశాన్ని ఈ వేదిక వ్యంగ్యరూపంలో చాటిచెప్పింది. మీమ్స్, షార్ట్స్, రీల్స్, వ్యంగ్య వ్యాఖ్యలు, రాజకీయ సెటైర్లు, సోషల్ మీడియా ట్రెండ్లను ఆయుధాలుగా ఉపయోగించింది. భారతదేశంలో రాజకీయ ప్రచారం టీవీ చానళ్లకే పరిమితమయ్యే రోజులు పోయాయి.
ప్లాట్‌ఫారమ్‌లు రాజకీయ అభిప్రాయాల ప్రధాన వేదికలుగా మారుతున్నాయి. ముఖ్యంగా జెన్-జీ, అలాగే మొదటిసారి ఓటు వేయబోయే యువత ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడం వల్ల, రాజకీయ శక్తులు కూడా ఆ వేదికపైనే, అదే భాషలో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ నాయకుల ప్రసంగాల కంటే ఒక వైరల్ మీమ్ ఎక్కువ ప్రభావం చూపే కాలం ఇది. రాజకీయ విమర్శను హాస్యంతో కలిపి అందించడం వల్ల యువత సులభంగా కనెక్ట్ అవుతున్నది.
జాతీయ భద్రత పేరుతో తన ఖాతా తొలగించారని దీప్కే చెప్పారు. అయితే, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఉన్నది. రాజకీయ విమర్శ, వ్యంగ్యం, కార్టూన్లు, మీమ్స్, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, సోషల్ మీడియా వ్యాఖ్యానాలు, అన్నీ ఈ పరిధిలోకి వస్తాయి. అయితే ఆర్టికల్ 19(2) కింద సమంజసమైన పరిమితులు విధించవచ్చు. సవాల్ ఏమంటే ‘ఈ పరిమితులు నిజంగా సమంజసమా?, పారదర్శకత ఉన్నదా? ముందుగా నోటీసు ఇచ్చారా? వ్యంగ్యాన్ని జాతీయ భద్రత సమస్యగా చూడవచ్చా?’ అని ఆలోచించాలి. ఇది అనూహ్యం.
దీప్కే చేసిన మరో వ్యాఖ్య వైరల్ అయింది. ‘వ్యంగ్యాన్ని భరించే సహనం అధికార పార్టీలో లేదనిపిస్తున్నది. ప్రభుత్వం బొద్దింకలను చూసి ఎందుకు భయపడుతున్నది?’అని ఆయన అన్నారు. మరో వ్యంగ్య వ్యాఖ్యలో ‘బొద్దింకలను అంత సులభంగా చంపలేరు. మేం కొత్త గూటిని నిర్మిస్తున్నాం.’ అని సవాల్ విసిరారు. కాక్రోచ్ పార్టీ, పరిణామాలు, మూడు ముఖ్యమైన విషయాలను సూచిస్తున్నాయి. 1. యువత రాజకీయాలపై ఆసక్తి కోల్పోలేదు, కానీ వారు పాతకాలపు రాజకీయ శైలిని తిరస్కరిస్తున్నారు.
సోషల్ మీడియా ప్రభావం అసాధారణ స్థాయికి చేరింది. ఒక వైరల్ అకౌంట్ కూడా జాతీయ చర్చను, రాజకీయాలను, పార్టీలను ప్రభావితం చేయగలదు. 3. ఇది మారుతున్న యుగం. భవిష్యత్తులో ఎన్నికల ప్రచారంలో మీమ్స్, షార్ట్ వీడియోలు, ఇన్ఫ్లూయెన్సర్లు కీలక పాత్ర పోషించవచ్చు.
కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు వినడానికి వ్యంగ్యంగా అనిపించినా, దాని వెనుక ఉన్న సామాజిక సంకేతం గంభీరమైనది. భారతదేశంలో రాజకీయ సంభాషణ ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. ఇది కేవలం ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ కథ కాదు. ఇది డిజిటల్ యుగంలో యువత రాజకీయ వ్యక్తీకరణకు కొత్త రూపం. ఇది మీమ్ కల్చర్, వ్యంగ్యం, సోషల్ మీడియా ప్రభావం కలిసి సృష్టించిన ఆధునిక సాంఘిక రాజకీయ వేదిక. భవిష్యత్తులో ఇటువంటి డిజిటల్ ఉద్యమాలు ఎన్నికల రాజకీయాలపై ఎంత ప్రభావం చూపుతాయో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, భారత ప్రజాస్వామ్యం ఇప్పుడు కేవలం సభల్లోనే కాదు, మొబైల్ స్క్రీన్లపై కూడా రూపుదిద్దుకుంటున్నది.
-మాడభూషి శ్రీధర్