‘కేటీఆర్ డ్యూప్లికేట్… నేను ఒరిజినల్’ దావోస్ పర్యటనలో విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం.
‘రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిశాన లేకుండా 100 మీటర్ల గోతి తీసి పాతిపెడుతా’ లండన్ పర్యటనలో భాగంగా టీడీపీ సానుభూతి పరులు ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇవి.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 48 రోజులు అవుతున్నది. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ లాంటి ఓ అంతర్జాతీయ వేదికపై రాష్ట్రంలో ఉన్న వనరులను చూపించి అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానించాలి. కానీ సీఎం హోదాలో పాల్గొన్న ఒక వ్యక్తి ‘కేటీఆర్ డ్యూప్లికేట్.. నేనే ఒరిజినల్’ అని తనకు తానే ప్రకటించుకోవడం నిజంగా అనైతికం. కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ గుర్తును 100 మీటర్ల లోతులో బొంద పెడుతానని ఆ వేదికపై విర్రవీగితే తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడులు వస్తాయా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నీచంగా మాట్లాడిన సందర్భాలు లేవు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా.. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితిని భూ స్థాపితం చేస్తానని శపథం చేసిన రేవంత్‌రెడ్డి గురువు చంద్రబాబు పార్టీ తెలంగాణలో భూ స్థాపితమైంది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ను శాశ్వతంగా తుడిచేస్తానని శపథం చేశారు. చివరికి ఏమైందో ప్రజలకు తెలుసు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి కూడా రేవంత్ కంటే ఎక్కువే మాట్లాడారు. కానీ వాళ్లు ఈ రోజు ఎక్కడున్నారో నా కంటే రేవంత్‌కే ఎక్కువ తెలుసు. రేపు రేవంత్ పరిస్థితి ఏమిటనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ, అధికారం వచ్చిన నెలన్నర రోజులకే కండ్లు అందలమెక్కితే ఎలా?
రేవంత్‌రెడ్డీ… మీరొక విషయం గుర్తుంచుకోవాలి. కేసీఆర్‌ను, కేసీఆర్ పార్టీని 100 మీటర్ల లోతులో పాతి పెట్టాలని చూడటమంటే.. కేసీఆర్ పదేండ్లలో నిర్మించిన తెలంగాణ భవిష్యత్తును మీరు వందేండ్లు వెనక్కి తీసుకువెళ్లడమే అవుతుంది. ఎందుకంటే.. పరాయి పాలకుల చేతిలో అచేతనంగా మారిన తెలంగాణకు ఊపిరిపోసి సీమాంధ్రుల వద్ద బానిసలుగా ఉన్న మీకు స్వపరిపాలన రుచి చూపించింది కేసీఆరే అనే విషయం మరిచిపోకండి. మీరు రాదన్న తెలంగాణను తెచ్చినందుకా బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతులో పాతిపెట్టేది?
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ చీకట్లను పారదోలి 24 గంటలు దేదీప్యమానంగా మార్చారు. మీరు, మీ గురువు దండుగన్న వ్యవసాయాన్ని కేసీఆర్ పండుగ చేశారు. పశువులకు గడ్డి లేని తెలంగాణను దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మార్చారు. తాగునీరు లేని తెలంగాణలో గడపకు గడపకు గోదావరి నీటిని మళ్లించారు. తెలంగాణను ఫ్లోరోసిస్ ఫ్రీగా మార్చారు. రాష్ట్ర రైతులకు కాళేశ్వరం జలాలను హక్కుగా మార్చారు. హరితహారంతో ఆకుపచ్చని తెలంగాణను ఆవిష్కరించారు. మత కలహాలకు నిలయమైన హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మించి తెలంగాణను శాంతిభద్రతలకు నిలయంగా, విశ్వనగరంగా మార్చారు. హైదరాబాద్ మెడలో హారం వలే ఔటర్ రింగు రోడ్డును పూర్తి చేశారు. పల్లె పల్లెకు పక్కా సడాక్లు నిర్మించారు. మెట్రోను పూర్తిచేసి ప్రజా రవాణాను మెరుగుపర్చారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు తోడుగా హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ యూనివర్సిటీలతో పాటు జిల్లాకో యూనివర్సిటీని ఏర్పాటుచేశారు.
గత పదేండ్లలో ప్రజలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి పల్లెలో మత్స్య విప్లవం వచ్చింది. ప్రతి నియోజకవర్గానికి ఓ గురుకులం వచ్చింది. రాష్ట్ర ఆదాయ పరిమితి పెరిగింది. రూపాయికే నల్లా వచ్చింది. ప్రభుత్వమే ధాన్యం కొన్నది. సకాలంలో ఎరువులు అందినయి. విత్తన కల్తీపై పీడీ చట్టం, రామగుండం ఫర్టిలైజర్స్ పునరుద్ధరణతో పాటు రాష్ట్రంలోని సబ్బండ జాతుల సంక్షేమం, పదేండ్ల తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో పరిఢవిల్లుతున్నది. వీటన్నింటికి కారణం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఆయన ప్రత్యేక తెలంగాణ కోసం స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ కాదా? ఇవన్నీ మర్చిపోయి మీరు బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతులో బొంద పెడుతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరనే విషయాన్ని తెలుసుకోవాలి.
పెట్టుబడులను రాబట్టేందుకు దావోస్, లండన్ వెళ్లిన మీరు సాధించిన ప్రతి పైసా పెట్టుబడి కూడా కేసీఆర్ అమల్లోకి తీసుకువచ్చిన టీఎస్-ఐపాస్ కరప్షన్ ఫ్రీ అనుమతుల పేరు చెప్పి సాధించినవే అనే విషయాన్ని మరువద్దు. దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన ఇంగ్లీష్ భాషపై సోషల్ మీడియాలో కొందరు అవహేళన చేస్తున్నారు. ముఖ్యమంత్రికి భాషలతో పనేముందని రేవంత్‌కు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వత్తాసు పలుకుతున్నారు. అయితే అలాంటివాళ్లు బానిసత్వం నుంచి విముక్తి పొందితే వాస్తవాలు బోధపడుతాయి. చిన్న ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే అనేక రకాల అర్హతలు, స్కిల్స్ ఉండాలని నిర్ణయించే సీఎంకు భాషపై పట్టు తప్పకుండా ఉండాల్సిందే.
సుపరిపాలన అందించేందుకు భాష అవసరం లేదేమో కానీ, సుసంపన్న దేశాలను ఒప్పించి, మెప్పించి తెలంగాణకు పెట్టుబడులను తీసుకురావాలంటే కచ్చితంగా భాషపై పట్టు ఉండాల్సిందే. చివరగా… కేసీఆర్ పేరులోనే ఒక తెలియని రణం ఉన్నది. ఒక సమర నినాదం ఉన్నది. తెలంగాణ అనే పదానికి సంపూర్ణ సార్థకతను సమకూర్చిన యోధుడు కేసీఆర్. ఆయనపై, ఆయన స్థాపించిన పార్టీపై అవాకులు, చెవాకులు పేలితే తెలంగాణ సమాజం చూస్తూ కూర్చోదు. సమరశంఖం పూరిస్తుందనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. అది ఆయనకే మంచిది.
(వ్యాసకర్త: మేయర్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్)
జక్క వెంకట్ రెడ్డి
98858 09367