సంగారెడ్డి, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలోని ఐదు మున్సిపల్ చైర్మన్ పీఠాలను బీఆర్ఎస్ దక్కించుకున్నది. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మంగళవారం జరిగాయి. ఇంద్రేశంలో మెజారిటీ ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ప్రమీల చైర్‌పర్సన్‌గా, హరీశ్వర్‌రెడ్డి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన చైర్మన్ ఎన్నికల్లో ఇస్నాపూర్, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది.
తాజాగా ఇంద్రేశం మున్సిపాలిటీని దక్కించుకుని పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. జహీరాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు 19, కాంగ్రెస్‌కు 19 మం ది కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి శిరీష కాంగ్రెస్‌కు మద్దతు తెలుపడం, కాంగ్రెస్ ఎంపీ సురేశ్ షెట్కార్ ఎక్స్‌అఫీషి యో ఓటు కాంగ్రెస్‌కు వే యడంతో చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ కౌన్సిలర్ యూనిస్ చైర్మన్‌గా, స్వతం త్ర కౌన్సిలర్ శిరీష వైస్ చై ర్మన్‌గా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికను రద్దు చే యాలని డిమాండ్ చేస్తూ.. మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు నిరసనకు దిగారు. చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎన్నికల నిబంధనల మేరకు అక్షరమాల క్రమంలో బీఆర్ఎస్ ప్రతిపాదిత చైర్మన్ అభ్యర్థి పేరు మొదట పిలువాల్సి ఉండగా నిబంధనలను పక్కనబెట్టి కాంగ్రెస్ ప్రతిపాదించిన చైర్మన్ అభ్యర్థి పేరును మొదట పిలిచారని ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆరోపించారు. చైర్మన్ ఎన్నికకు అవసరమైన మద్ద తు ఉన్నా బీఆర్ఎస్ అభ్యర్థి పదవికి దూరం కావాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే జహీరాబాద్ ఎన్నిక రద్దుచేసి, తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై బీఆర్ఎస్ కౌన్సిలర్ కాట స్రవంతి ఈసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
