రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావడంతో ఇటీవల ఘనంగా విజయోత్సవాలు జరుపుకొన్నది. అధికారంలోకి రాగానే చే(ఆరు) గ్యారెంటీల అమలుపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ సర్కార్ వాటిలో ఒక్కటి, రెండు మాత్రమే, అవి కూడా అరకొరగా అమలుచేసింది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
పాలకులం కాదు, సేవకులమని కాంగ్రెస్ నాయకులు మొదటినుంచీ చెప్తున్నారు. తమది ప్రజా పాలన అని చెప్తూ ప్రజాదర్బార్లు కూడా నిర్వహించారు. ఇది ప్రజాపాలనకు నిదర్శనమని వందిమాగధులు వంత పాడుతున్నారు. ముఖ్యమంత్రి కూడా ప్రజల్లో కాంగ్రెస్ప్రాబల్యం తగ్గకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నా రు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం న్యూయార్క్ వలె మారబో తున్నదని ప్రకటించారు. అంతేకాదు, మన దేశంలోని రాష్ర్టాలతో కాదు, ఇతర దేశాలతో తాము పోటీ పడుతున్నామని కూడా సెలవిచ్చారు. గత ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ల ద్వారా 55 వేల ఉద్యోగాలు భర్తీచేసి అపాయింట్మెంట్ ఆర్డర్లకు ఎల్బీ స్టేడియాన్ని అడ్డాగా మార్చారు. అయితే, మాటలు చెప్పడం సులువే, అమలు, ఆచరణే కష్టం.
చాకలి ఐలమ్మ వర్ధంతి సభలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా ఆమె మనమరాలును నియమిస్తున్నామని సీఎం ప్రకటించారు. ప్రతిష్టాత్మక కోఠి మహిళా కళాశాలకు ఐలమ్మ పేరు పెట్టడం ఆమెకు నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు ఇది కొంతవరకు ఊరటే. దొరల గడీలను బద్దలుకొట్టి, పెత్తం దారీతనానికి పాడె కట్టిన ధీరవనిత ఐలమ్మ. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఆమె పోరాడారు. భూస్వామ్య వ్యవస్థను నిర్మూలించాలనే లక్ష్యంతో పోరు సలిపారు. ఐలమ్మకు కావాల్సింది పేరు కాదు, వట్టి హామీలు, మాటల గారడీతో ఈ వర్గాలను మభ్యపెట్టడం అసలు కానే కాదు, ఆయా వర్గాలకు భూములు పంచి, జీవనోపాధి కల్పించి వారి సామాజిక హోదాను పెంచడమే ఐలమ్మ సంకల్పం. అయితే, ఈ వర్గాల బలహీనతలను సొమ్ము చేసుకొని అసలైన అధికారాన్ని భూస్వాములైన పెట్టుబడిదారులు అనుభవిస్తున్నారు. భూమిని పునఃపంపిణీ చేయడం ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించవచ్చు. తద్వారా భూ యాజమాన్యంలో ఉండే అసమానతలను రూపుమాపవచ్చు. అందుకే, ‘ఒట్టి మాటలు కట్టిపెట్టవోయి గట్టిమేలు తలపెట్టవోయి’ అన్న గురజాడ మాటల సాధన చాకలి ఐలమ్మకు అసలైన నివాళి. అదే ఆమె ఆశయం కూడా.
1948 సెప్టెంబర్‌లో భారత్‌లో తెలంగాణ విలీనమైనప్పటికీ, ఎస్టేట్ల చట్టం రద్దయినప్పటికీ, 1973లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ భూ పంపిణీ చట్టాన్ని తీసుకువచ్చి, 1975లో ఆ చట్టాన్ని అమలుచేసింది. ఈ రెండేండ్లలో భూస్వాములందరూ తమ భూములను బినామీ పేర్లపై మార్చుకున్నారు. తద్వారా చట్టాల పరిధిలోకి భూములు రాకుండా తప్పించుకున్నారు. దీనికి అప్పటి అధికార, ఉద్యోగ యంత్రాంగం తోడ్పడింది. ప్రస్తుతం పట్టణ భూ పంపిణీ చట్టాలను పూర్తిగా రద్దుచేశారు. దీంతో కొంతమంది భూస్వాములు వందల ఎకరాలను ఆక్రమించి ఫ్యాక్టరీలు, ఫామ్‌హౌజ్‌లు నిర్మించుకొని భూమిని అట్టిపెట్టుకున్నారు. అదే సమయంలో కార్పొరేట్ సంస్థలు ఉనికిలోకి వచ్చాయి. ఇది పాతకాలం నాటి జమిందారీ వ్యవస్థను తలపిస్తుంది. ధరల నిర్ణయంతో పాటు, భూముల కేంద్రీకరణ అంశం ఈ కార్పొరేటీకరణలో ప్రధానంగా ముందుకువచ్చింది. దీన్ని సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు కూడా తీసుకువచ్చాయి.
తెలంగాణలో ఎస్సీలు సుమారు 14.28 శాతం మంది ఉన్నారు. బీసీలు 40 శాతానికి పైగా ఉన్నారు. ఇతర బలహీనవర్గాలు 20 శాతం వరకు ఉండవచ్చు. మొత్తంగా ఈ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల జనాభా 75 శాతం వరకు ఉంటుంది. కానీ, వీరిలో 29.97 శాతం మంది చేతుల్లో అసలు భూమే లేదు. అయితే, మిగిలిన 45 శాతం మంది చేతుల్లో 30 శాతం సేద్యపు భూమి మాత్ర మే ఉన్నది. మిగిలిన 70 శాతం సేద్యపు భూమి 25 శాత మే ఉన్న భూస్వాముల చేతుల్లో ఉన్నదని సెస్సు ఒక అధ్యయనంలో వెల్లడించింది. ఇది భూస్వామ్య వ్యవస్థను పరిరక్షించడమే.
ప్రపంచంతో పోటీ పడాలంటే దక్షిణ కొరియాలో మాదిరిగా భూ గరిష్ఠ పరిమితిని ఏడున్నర ఎకరాలుగా నిర్ణయించాలి. చైనా వలె 17 రోజుల్లో భూ పంపిణీ చట్టాలను అమలుచేయండి. మన దేశంలో పంచిన మొత్తం భూమిలో ఒక్క పశ్చిమబెంగాల్లోనే 20 శాతం పంచా రు. మన రాష్ట్రంలో వామపక్ష సిద్ధాంతాలకు కాలం చెల్లకుండా ఉండాలంటే భూ పంపిణీపై పోరాటం చేయాలి. అదే చాకలి ఐలమ్మకు అసలైన నివాళి. భూ పంపిణీ చేసి సామాజిక తెలంగాణ తేవాలి. అప్పుడే ఐలమ్మ ఆశయం నెరవేరుతుంది.
– (వ్యాసకర్త: అర్థ శాస్త్ర విశ్లేషకులు)
పొందూరు ప్రభాకర్‌రావు 90106 31727