రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ బిల్లులను తూతూ మంత్రంగా ఆమోదించి, రాష్ట్రంలో అమలుపరచకుండా ఢిల్లీకి పంపి చేతులు దులుపుకున్నది. ‘తాంబూలం ఇచ్చాం, తన్నుకు చావండి’ అన్న చందంగా బీసీ సంఘాల మధ్య తగువు పెట్టి, ఆ మంటల్లో రేవంత్ ప్రభుత్వం చలి కాగుతున్నది.
‘దేశవ్యాప్త కులగణన ద్వారా బీసీల స్థితిగతులను మార్చేస్తాం, వారి వాటా తేల్చి న్యాయం చేస్తాం’ అని చెప్పిన రాహుల్‌గాంధీ ఇప్పుడు కులగణనతో ఏ పరిష్కారమూ లభించదని, అది వట్టి చెత్తబుట్టతో సమానం అంటున్నారు. కులగణనతో బీసీలకు రిజర్వేషన్లు అసాధ్యమని, అది కోర్టులో నిలబడదని చెప్తూ రాజ్యాంగ సవరణ, 9వ షెడ్యూల్ అనే కొత్త రాగం అందుకుంటున్నారు. ఈ దెబ్బతో బీసీల రిజర్వేషన్ల అంశం త్రిశంకు స్వర్గంలోకి నెట్టివేయబడింది. వాస్తవానికి కులగణన చేయడం, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుపరచడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే అశాస్త్రీయమైన కులగణన ద్వారా 51 శాతం ఉన్న బీసీల సంఖ్యను 46 శాతానికి తగ్గించి చూపెట్టారు.
రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే, ముస్లింలకు సంబంధం లేకుండా 51 శాతం రిజర్వేషన్లను బీసీలకు అమలు చేయవచ్చు. కానీ, చేయడు. కనీసం తాను చేసిన కులగణన ద్వారా, తాను ప్రవేశపెట్టిన బీసీ బిల్లుల ద్వారా తక్షణమే రెండు జీవోలతో స్థానిక సంస్థలు-విద్య, ఉద్యోగ రంగాల్లో తాను చెప్తున్న 42 శాతం రిజర్వేషన్లనైనా అమలు పరచవచ్చు. కానీ, అమలుపరుచడు. ఎంతో ఆర్భాటంగా, ఖర్చుతో కూడిన కులగణన సర్వే రిపోర్ట్‌ను రేవంత్ సర్కార్ నిష్ప్రయోజనమైన డాక్యుమెంట్‌గా మార్చడానికి కుట్ర చేస్తున్నది.
వాస్తవానికి రాజ్యాంగం రాష్ర్టాలకు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది. ఆర్టికల్ 15 (4), ఆర్టికల్ 16 (4) ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు లేదా ఇతర సామాజిక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేదని భావిస్తే.. వారికి సరైన ఆధారాలను (జనాభా లెక్కలు, ఇతర శాస్త్రీయమైన ఆధారాలు) గుర్తిస్తే రిజర్వేషన్లు ఇవ్వవచ్చని పేర్కొన్నది. కాబట్టి రాష్ట్రంలో కులగణన ద్వారా ఇప్పుడు సరైన ఆధారాలు, జనాభా లెక్కలు శాస్త్రీయంగా తేలాయి కాబట్టి నిశ్చింతగా రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లు అమలుపరచవచ్చు. అలాగే ఆర్టికల్ 242 ప్రకారం.. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల విషయంలో రాష్ర్టాలకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయి.
73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ఆర్టికల్ 243 (ఓ) ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం కోసం, నియోజకవర్గాల ఏర్పాటు, నియోజకవర్గాల రిజర్వేషన్లు మొదలైనవాటికి సంబంధించిన వివాదాలను న్యాయస్థానాలలో సవాల్ చేయకూడదనే నిబంధనను చేర్చారు. కాబట్టి, కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో తక్షణమే రిజర్వేషన్లను అమలుపరచవచ్చు. కానీ, సీఎం రేవంత్ సాకులు వెతుకుతున్నారు. 9వ షెడ్యూల్లో చేర్చడం, రాజ్యాంగ సవరణ, ఢిల్లీ దండయాత్ర అనే కొత్త పల్లవి, కొత్త ఎత్తుగడలతో రేవంత్ ప్రభుత్వం బీసీలను వంచిస్తున్నది.
9వ షెడ్యూల్లో తెలంగాణ బీసీల రిజర్వేషన్ల అంశాన్ని చేర్చడమంటే దీన్ని సాగదీయడం, ఎగనామం పెట్టడమే. వాస్తవానికి 2007లో IR COELHO Vs STATE OF TAMILNADU కేసులో.. 1973 తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చిన వాటిపై సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష చేసే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. అంటే 1973 తర్వాత చేర్చిన ఏ అంశంపైన అయినా సుప్రీం జోక్యం చేసుకోవచ్చు. అది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నదని సుప్రీం భావిస్తే దాన్ని కొట్టివేయవచ్చు. ఇవన్నీ తెలిసి కూడా కొద్దిమంది కాంగ్రెస్ మేధావులు 9వ షెడ్యూల్‌ను బ్రహ్మ పదార్థంగా, 9వ షెడ్యూల్లో చేరిస్తే బీసీల రిజర్వేషన్లకు రక్షణ ఉంటుందని, కోర్టులు ప్రశ్నించలేవని మభ్యపెడుతున్నారు. ఇది ఆత్మవంచనే అవుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీసీ మేధావులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఐక్య పోరాటానికి సిద్ధమైతేనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం. అందులో భాగంగానే ఈ నెల 29న హైదరాబాద్ లక్డికాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్లో నిర్వహిస్తున్న రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిద్దాం.
(వ్యాసకర్తలు: రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ జనసభ, బీసీ జర్నలిస్టుల ఫోరం)
– డి.రాజారాం యాదవ్
– మేకల కృష్ణ