గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తుంటే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని మించిన సంక్షేమ సర్కారును తీసుకొస్తారేమోనని ప్రజలంతా ఆశించారు. కానీ, రేవంత్‌రెడ్డి నేతృతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను కాలదన్ని తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తీసుకొచ్చింది. ఈ నయా ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ విధ్వంసం జరుగుతున్నది. ప్రశ్నించినవారిపై దాడులు, అక్రమ కేసులు, నిర్బంధాలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించిన నాపై కేసు పెట్టారు. గ్రూప్-1 పోస్టుల భర్తీలో జరిగిన తప్పులను ఎత్తిచూపిన నెల తర్వాత కేసు పెట్టడం రేవంత్ సర్కారుకే చెల్లింది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదిలోనే 2 లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆ పార్టీ నాయకులు ఎన్నికలకు ముందు ఊరూరా ఊదరగొట్టారు. యువత, నిరుద్యోగుల భుజాలపై మూడు రంగుల జెండాలను మోపి, వారి కష్టాన్ని నిచ్చెనగా మార్చుకొని రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కొలువయ్యిండు. ఏరు దాటే దాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న అన్నట్టుగా అవసరం తీరాక తెప్ప తగలేశారు. కాంగ్రెస్ జెండాలు మోసి మోసి యువత భుజాలపై అయిన పుండ్లపై కారం చల్లారు. కొత్త గా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోగా.. దేశంలో ఎక్కడా లేని విధంగా కొలువులు వద్దని ధర్నాలు, రాస్తారోకోలు రాష్ట్ర యువత చేస్తున్నారని ఊరూవాడా చాటింపు వేస్తున్నారు. అంతకుముందు నిరుద్యోగ భృతి వట్టి మాటేనని ఉపముఖ్యమంత్రి భట్టి తేల్చేశారు.
భారీ గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ మాట తప్పి, గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 503 పోస్టులకు 60 పోస్టులను కలిపి తమ ఘనతగా ప్రచారం చేసుకున్నది. క్రెడిట్ది ఏముందిలే.. యువతకు కొలువులు వస్తే చాలని అనుకున్నాం. కానీ, కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చి, పోస్టులు పెంచుతామని చెప్పి.. పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేకపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీపీఎస్సీ ఉదాసీనత కారణంగా గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదటి నుంచి తప్పులతడకగా మారింది.
లక్షల మంది అభ్యర్థులు రాసే నీట్, ఎప్‌సెట్ లాంటి పరీక్షలకే బయోమెట్రిక్ పద్ధతిని అమలు చేస్తుండగా, వేల మంది మాత్రమే రాసిన గ్రూప్-1 పరీక్షకు మాత్రం బయోమెట్రిక్ హాజరు లేకపోవడం విస్మయం కలిగిస్తున్నది. నోటిఫికేషన్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని టీజీపీఎస్సీ స్పష్టంగా పేర్కొన్నది. కానీ, ఆ తర్వాత తమ అస్మదీయులకు అయాచిత లబ్ధి చేకూర్చేందుకే బయోమెట్రిక్‌ను బుట్టదాఖలు చేసింది. అందుకే పరీక్ష ముగిసిన వెంటనే 21,075 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొన్న టీజీపీఎస్సీ.. ఆ తర్వాత 10 మందిని అక్రమ మార్గంలో చేర్చింది.
ఆ పదిమంది పెరగడం నిజమేనని హైకోర్టు సాక్షిగా అంగీకరించిన టీజీపీఎస్సీ.. వారు ఏ ప్రాతిపదికన పెరిగారనే విషయంపై మాత్రం నోరు మెదపడం లేదు. అంతేకాదు, 20,161 మంది పరీక్షలు రాసినట్టుగా ఒకానొక సమయంలో అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నది. హాల్‌టికెట్ల విషయంలోనూ అనుమానాలకు తావిచ్చే విధంగా గందరగోళం సృష్టించింది. ప్రిలిమ్స్‌కు ఒక హాల్ టికెట్, మెయిన్స్‌కు మరో హాల్‌టికెట్ ఇవ్వడం వెనుక కూడా ఏదో కుట్ర దాగి ఉన్నది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 మహిళా కళాశాలల్లో గ్రూప్-1 పరీక్షలు జరగగా.. కోఠిలోని ఐలమ్మ మహిళా కళాశాల పరీక్షా కేంద్రంలో మాత్రమే ప్రత్యేకంగా మహిళా అభ్యర్థులను కేటాయించారు. ఇక్కడ రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా సుమారుగా 563 మంది పరీక్ష రాసినట్టు తెలుస్తున్నది. అయితే, ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసినవారిలో సుమారు 10 శాతం మంది అభ్యర్థులు గ్రూప్-1 కొలువులను కొల్లగొట్టారు. ఈ ఒక్క పరీక్షా కేంద్రం నుంచి సుమారు 60-70 మంది వరకు సెలక్ట్ అవ్వగా, ఇతర ప్రాంతాల్లోని 40కి పైగా పరీక్షా కేంద్రాల నుంచి ఒక్కరు కూడా సెలక్ట్ కాకపోవడం విడ్డూరం. కాంగ్రెస్ నేత రాములు నాయక్ కోడలు కూడా ఐలమ్మ పరీక్షా కేంద్రంలోనే పరీక్ష రాశారు. ఆమె ఎస్టీ క్యాటగిరీలో టాప్ ర్యాంకు సాధించారు. ఈ విషయాన్ని నేను గత నెలలో ప్రెస్‌మీట్ పెట్టి ప్రస్తావించాను. అప్పుడు ఎక్కడో కూడా కులాన్ని కించపరచలేదు. కానీ, కుట్రపూరితంగా నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.
గ్రూప్-1 టాపర్లలో చాలామంది ఒకే పరీక్షా కేంద్రంలో, అందులోనూ ఒకే గదిలో పరీక్ష రాసినట్టు అనుమానాలు ఉన్నాయి. అంతేకాదు, హాల్‌టికెట్ నెంబర్లోని చివరి ఒక్క అంకె తేడాతో ఒకరి వెనుక ఒకరు కూర్చున్న చాలామంది అభ్యర్థులకు ఒకే విధమైన మార్కులు రావడం కూడా అనుమానాలకు తావిస్తున్నది. మరోవైపు తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. సుమారు 7,800 మంది తెలుగు మీడియం అభ్యర్థులు పరీక్ష రాయగా, 10 శాతం కూడా సెలక్ట్ కాకపోవడం వెనక గల కారణం ఏమిటి? అదే సమయంలో 9 మంది ఉర్దూ మీడియం అభ్యర్థులు పరీక్ష రాయగా, వారిలో ఏడుగురు ఎలా సెలక్ట్ అయ్యారు? దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి?
టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దాన్ని భ్రష్టు పట్టించారు. అందుకే నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి పరీక్షలు జరిగి, ఫలితాల విడుదల వరకు అన్నింటా అవకతవకలు చోటుచేసుకున్నాయి. గ్రూప్-1 కుంభకోణం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పేద విద్యార్థుల తరఫున ప్రశ్నిస్తుంటే ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడుతున్నారు. ఆ తప్పుల నుంచి తప్పించుకునేందుకే కేసులు పెడుతున్నారు. నిర్బంధాలకు, కేసులకు భయపడకుండా గతంలో ఎన్నోసార్లు పేదలకు అండగా నిలబడ్డా. ఎన్నెన్నో కేసులను ఎదుర్కొన్నా. ఇప్పుడు పేదల విద్యార్థుల కోసం చేస్తున్న పోరాటంలో నమోదైన ఈ కేసు నాకు దక్కిన మరో ఆభరణం లాంటిదే. ఎన్ని కేసులు పెట్టినా అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. పేద విద్యార్థుల తరఫున నా గళం వినిపిస్తూనే ఉంటా.
– (వ్యాసకర్త: హుజూరాబాద్ శాసనసభ్యులు) పాడి కౌశిక్‌రెడ్డి