అట్టడుగు వర్గాలైన బంజారాలు, గిరిజనులు గత ప్రభుత్వాల హయంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. కానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వారి అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చూపిన శ్రద్ధ, చేసిన కృషి నేడు ఫలితాలను అందిస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఉద్యమ నేత అధికారంలో ఉంటే గిరిజన వర్గాలు ఎలా అభివృద్ధి చెందుతాయో మన కండ్లకు కట్టారు. అందుకే కొత్త రాష్ట్రమైనా ఇవాళ తెలంగాణలో అమలవుతున్న అనేక పథకాలు, అభివృద్ధి విధానాలు దేశానికి దిక్సూచిగా నిలిచాయి.
గిరిజనుల పట్ల కాంగ్రెస్, బీజేపీ చూపిన తీవ్ర నిర్లక్ష్యానికి చరిత్రే సాక్ష్యంగా నిలుస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో గిరిజన సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా, గిరిజనులను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. గిరిజనాన్ని ఫక్తు ఓటు బ్యాంకుగా వాడుకొన్నారు. ఎన్నికలొస్తే చాలు ఎక్కడ లేని హడావుడి చేస్తారు. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ దీనికి చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు. గిరిజనులకు అలవికాని హామీలిచ్చి అధికారం కోసం పాకులాడటం విడ్డూరం. తెలంగాణ గిరిజనాన్ని ప్రలోభ పెట్టి, మాయమాటలతో ఓట్లు దండుకోవడానికే వరాలు ప్రకటిస్తున్నారు. అమాయక గిరిజనులు ఈ విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం గత పాలకుల పాపాలను ప్రక్షాళన చేస్తూ, గిరిజన పురోగతికి ఆచరణాత్మక కృషి జరిపింది. దీని వల్ల గిరిజనం అన్ని రంగాల్లో ముందంజ వేస్తూ ఆత్మ గౌరవంతో జీవిస్తున్నారు. బంజారా, ఆదివాసీ గిరిజనుల కోసం ఆత్మ గౌరవ భవనాలను నిర్మించిన సీఎం కేసీఆర్ ఆయా వర్గాలు గర్వపడేలా చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు పెరగడంతో గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగాయి. గిరిజనుల సంక్షేమానికి నిధుల కేటాయింపు పెరిగింది. భూమి లేని గిరిజనులకు రూ.10 లక్షల చొప్పున అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. గిరిజన బంధు అమలు చేస్తామని చెప్పారు. పెరిగిన గిరిజన జనాభాకు తగిన విధంగా 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు.
గిరిజనుల విద్యాభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు, కాలేజీలు నెలకొల్పారు. కేసీఆర్ దూరదృష్టి ఫలితంగా రాష్ట్రంలో ప్రస్తుతం 623 గిరిజన విద్యా సంస్థల్లో 1.18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ విద్యార్థులందరూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారు. గిరిజన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ను ప్రభుత్వం అందిస్తున్నది. తండాలు, ఆదివాసీ గూడేలు ఇప్పుడు విద్యా కేంద్రాలుగా పరిమళిస్తున్నాయి! నూతన జిల్లాల ఏర్పాటుతో గిరిజన ప్రాంతాలకు అన్ని వసతులు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాకో మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ అందుబాటులోకి రావడంతో గిరిజన విద్యార్థులు పెద్ద సంఖ్యలో వాటిలో ప్రవేశాలు పొందుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ పోషకాహార కిట్ల వల్ల గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపం తగ్గింది. మాతా, శిశు మరణాలు కూడా తగ్గాయి. వైద్య సదుపాయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య పెరగడంతో అంటు వ్యాధులు తగ్గు ముఖం పట్టాయి. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ఇలాంటి పథకాలను కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడైనా అమలు చేశాయా? రాష్ట్ర వ్యాప్తంగా 4,06,369 ఎకరాల భూమిని 1,51,146 వేల మంది గిరిజన రైతులకు పంపిణీ చేసి పోడు భూముల పట్టాలను అందించారు. ఆయా భూములకు రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల జీవితం అనేక విధ్వంసాలకు గురైంది. ముఖ్యంగా టీడీపీ అధికారం చేపట్టాక ఆదివాసీ ప్రాంతాల్లో వలసవాదుల ఆక్రమణల వల్ల 11.60 లక్షల ఎకరాల భూములు పరాయీకరణకు గురయ్యాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్ల వేలాది మంది బంజారాలు నిర్వాసితులయ్యారు. ప్రాజెక్టు అవసరాలు పోను మిగిలిన భూములు బంజారాల చేతుల్లో నుంచి వలసవాదుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు అభివృద్ధి చెందే క్రమంలో బంజారాలకు చెందిన విలువైన భూములను కొందరు తక్కువ ధరకే కాజేసి వారిని మోసగించారు! దీంతో నిర్వాసితులైన గిరిజనులు, బంజారాలు ఏ ఉపాధి దొరక్క అవస్థల పాలయ్యారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లోని గిరిజనుల భూములు పరాయీకరణ జరగడం లేదు. పైగా నీటి వసతి, ఇతర అభివృద్ధి పనుల వల్ల వ్యవసాయ భూముల విలువ అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం ఒక ఎకరా ధర రూ.30 లక్షలు పలుకుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ విభాగంలోనూ గిరిజనులు విభాగాధిపతులుగా ఉండేవారు కాదు. కానీ నేడు స్వరాష్ట్రంలో గిరిజనులు, బంజారాలు జిల్లా కలెక్టర్లుగా, ప్రభుత్వ శాఖల అధిపతులుగా, యూనివర్సిటీ వీసీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ సర్కారు గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తున్నది. బంజారాల ఆరాధ్యుడు సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది. గిరిజన పోరాటయోధుడు కొమురం భీం జయంతి, నాగోబా, మేడారం జాతరలను ఘనంగా నిర్వహిస్తున్నది. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గిరిజనుల సంస్కృతి, సంప్రదాయ ఉత్సవాలను జరిపి వారి ఆత్మాభిమానాన్ని పెంపొందిస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గిరిజనుల సంస్కృతిని గౌరవించడంలో కనీస చిత్తశుద్ధి లేదు.
దేశ వ్యాప్తంగా వేలాది తండాలు, గూడేలున్నా ఆయా రాష్ట్ర పభుత్వాలు వాటిని గ్రామ పంచాయతీలుగా చేయలేదు. కానీ తెలంగాణలో ‘తండాలు, గూడేలలో మా రాజ్యం’ అన్న భావనను కేసీఆర్ ప్రభుత్వం గౌరవించి 3,500 తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చి స్వయం పాలనను ప్రోత్సహించింది. గిరిజనుల కోసం ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా 32 కొమురం భీం ఆత్మ గౌరవ భవనాలు నిర్మించింది.
కల్తీ సారాపై ఉక్కు పాదం మోపడం వల్ల సారా మరణాలు తగ్గాయి. ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల చిన్న పిల్లల అమ్మకాలు ఆగిపోయాయి. మిషన్ భగీరథ వల్ల తాగునీరు అందుతున్నది. గిరిజన ప్రాంతాల్లో కరెంటు సౌకర్యం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో గిరిజనుల సమస్యలు వేగంగా పరిష్కారం కావడం వల్లే గిరిజనుల అభివృద్ధి సాధ్యమైంది. ఇంతటి అభివృద్ధిని చవి చూసిన గిరిజనులు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని బూటకపు హామీలను నమ్మరన్నది నిజం.
(వ్యాసకర్త: రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ వికాస సమితి)
-మాలోతు బిక్షపతి నాయక్
98661 33603