ప్రార్థయామహే భవ శతాయుషీ ఈశ్వరః సదా త్వాంచ రక్షతు., పుణ్య కర్మణా కీర్తిర్ణయ జీవనం తవ భవతు సార్థకమ్…
జన్మదినం అని గుర్తు రాగానే, మన మదిలో మెదిలే మరోమాట జన్మ సార్థకం. మానవ జన్మ ఉత్కృష్టమైనదని వేద సారం. అటువంటి మానవ జన్మని ‘అషఫ్రుల్ మాఖ్లుఖాఖ్’అని ముస్లిం సోదరులు అంటారు. అనగా ఈ చరాచర సృష్టిలో మానవ జన్మ అగ్రశ్రేణిదని భావం. సమాజంలో కొంతమంది వ్యక్తులే చరిత్రను సృష్టిస్తారు. అటువంటి వారే ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంటారు.
అనుకున్న లక్ష్యాలను మొక్కవోని ధైర్యంతో, దృఢ సంకల్పంతో, కంకణ బద్ధులై అకుంఠిత దీక్షతో, దక్షతతో పూర్తి చేస్తారు. అతి చాకచక్యంతో, సంభాషణ చతురతతో, అవరోధాలు, అవమానాలు లెక్క చేయక జాతికి సత్వర సత్ఫలితాలను అందిస్తారు. తద్వారా అజరామరమైన ఖ్యాతిని అనతి కాలంలో గడిస్తారు. అందుకు నిలువెత్తు నిదర్శనం బాపు కేసీఆర్.
మాండలికాలతో మాత్రమే మనుషులను ఉరికెత్తించగలడను కున్నారు కొందరు. మధురమైన భాషతో మనుసుల ఉల్లసిల్లింపజేస్తాడని,మానవతకి జీవం పోస్తాడని, సమతను సాక్షీత్కృతి నొనరిస్తాడని, నాయకత్వానికి నిర్వచనమౌవుతాడని, జన ఘోషను తన భాషగా, యాసగా వినిపిస్తాడని ఇంకా తెలియని వారు ఒట్టి అమాయకులు… తెలిసినవారు ఆయనకు అడుగుజాడలై,తోడు నీడలై, కుడి ఎడమల నడుస్తున్నారు, ఎడతెగక శ్రమిస్తున్నారు.
మనకు రాజకీయ నాయకులు అనగానే స్ఫురణకు వచ్చేది వ్యూహరచన మాత్రమే. ప్రత్యర్థులపై విజయ సాధనయే. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సాహి త్యం, కళాపోషణ, కళలంటే,కళాకారులంటే ఎనలేని గౌరవం, మక్కువ. తెలంగాణ రాష్ర్టా న్ని సకల రీతులలో యావత్ భారతదేశంలో అన్ని రంగాలలో అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ, మన తెలుగు జాతి వైభవాన్ని నలు దిశల వ్యాప్తి చేయడంలో కృతకృత్యులైనారు.
అహో! బాపూ!
నిన్ను కృష్ణరాయనితో పోలిస్తే తప్పేంటంటారు తెలుగు భాషా ప్రేమికులు… భోజరాజు కన్నా తక్కువే మంటారు భారతీయులు. మూరు రాయర గండడివో.ఎలదాయ సింహుడివో..ధీరోత్తమ గండర గండడివో, లేక ఈ పై అన్నింటికీ అర్హుడవో!
చతుర్దశవత్సర కాలంగా కొనసాగిన ఉద్యమంలో ఉత్పన్నమైన అనుమానాలు, అవమానాలు, లెక్కచేయని ధీరోదాత్తుడు కేసీఆర్. చిరకాల స్వప్నం చెల్లునో? చెదరునో, తెలంగాణ రాష్ట్రమై తేజరిల్లునో, లేదో? కలను సాకారం చేయు ఘనుడెవ్వడో కదా.. కలడు కలండనెడి వాడు కలడో లేడో..అనుకున్న జనతకు వెన్ను తట్టినవాడు ..కేలూని ముందుకు దారి చూపిన రేడు.. దొంతిమన్నె విభాలుడు, సందర్భోచిత పద్య పఠనానురక్తుడు,భాషాచమత్కార సంభాషణా చతురుడు, సకల జన హృత్పీఠికాధీష్టుడు, తానే చంద్రశేఖరనామ చాణక్య తుల్యుడు.
ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు ప్రాభవ ప్రభలను పరిఢవిల్లజేసి ఖండాంతరాలలో అఖండ కీర్తి కాంతులను వెలయింపజేసిన వెన్నెలఱేడు,వైదుష్య వైతాళికుడు,వంద్యవక్త,భాషావిదిత విద్యోతన విద్వద్వివిభూషణుడు మన తెలంగాణ ప్రభుత్వ పరిపాలనాధినేత బాపూ కేసీఆర్. నీరు పల్లమెరుగుననే నానుడిని తిరుగరాసి -గోదావరి కృష్ణా తరంగిణులను ఎగువకు లంఘింపజేసి-నోళ్లెండిన తెలగాణ బీడు భూములను సతతహరిత సస్యశ్యామల కేదారాలుగా ప్రాదుర్భవింపజేసిన అభినవ భగీరథుడు,వర్తమాన కాలపు కాటన్ దొర కేసీఆర్
దీనజన ప్రయోజనాకాంక్షిత సర్వజన సంక్షేమ యోజనాలు. పరిణత ప్రజాస్వామ్య పరిపుష్ట లక్షిత పరిపాలనా వికేంద్రీకరణ సంస్కరణలు. రేయనకా పగలనకా,ఎండనకా వాననకా,ఆకలనకా దప్పికనకా దుక్కిదున్ని పంటపెట్టుబడుల పుట్టువడికోసం పడరాని పాట్లుపడి-ఋణసర్ప పరిష్వంగంలో చితికి చితికి చితికిపోతున్న రైతుల వెతలను దూరం చేసి-వారి కళ్ళల్లో కాంతులునింపే కర్షకాభ్యుదయ పథకాలు. అట్టడుగు వర్గాల అభ్యున్నతే అనవరత అవతారికగా దళితబంధు విధానాలు. మహిళలు, వృద్ధులు, అల్పసంఖ్యాక వర్గాలవారు తదాదిగా జనసేవే జనార్ధన సేవగా కొనసాగే కారుణ్య పరిపాలనా కిరణ ప్రసరణలు. ఆధ్యాత్మికౌన్నత్యావిష్కృత అత్యున్నత శిల్పకళా సౌందర్య సంవిధాన శోభిత సుందర మందిర నిర్మాణాలు..తెలంగాణ తేజో వైభవ తార్కాణాలు.
భరత జాతిని సర్వస్వం ఏకంజేసే ఒక్క.. నీ పిలుపుతో.. గోపాలుని మురళీరవానికి ఆకర్షితమైన గోసమూహము వోలె జనావళి జాగృతమై వెంటనడుస్తే అబ్బురమేముంది?హర్షాతిరేకమే కదా.!
ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, దళితబంధు లాంటి అనేకానేక ప్రజోపయోగ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన మానవత వాది కేసీఆర్. సకల జనుల శ్రేయస్సే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ, ఇతర రాష్ర్టాల వారికి ఆదర్శంగా నిలుస్తూ, వ్యవసాయానికి, సాగునీటి సరఫరాకి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి బృహత్తర ప్రణాళికలతో కాళేశ్వర ప్రాజెక్టుతో ప్రాభావాన్ని దేశమంతటా విస్తరింప జేసిన మేటి ఘనుడు,మేరు నగ సమానుడు మన ముఖ్యమంత్రి బాపూ కేసీఆర్. సాహితీ సమరాంగణ చక్రవర్తిగా, సత్కళా పోషణానురక్తునిగా, సబ్బండవర్ణాల సంరక్షకునిగా, రైతు జన బాంధవునిగా, కార్మికోద్యోగ వర్గ క్షేమంకరునిగా, సమాజ శ్రేయోభిలాషిగా, పరిపాలనాదక్షునిగా, నవ్య హిత పథక రచనా దురంధరునిగా సుప్రతిష్టుడవైనఓ బాపూ! సకల భారతావని నిన్ను స్వాగతిస్తున్నది …సర్వ మానవాళి నీకు జేజేలు పలుకుతున్నది. అభినందిస్తున్నది… ఆశీర్యుత శుభకామనలు అందిస్తున్నది.
రైతాంగం పట్ల ఎటువంటి వివక్ష చూపకుండా, మతచిచ్చు రాజకీయాలతో, ద్వేషపూరిత భావనతో, విభజించి పాలించే కుటిలనీతిని ఎండగడుతున్నారు సీఎం కేసీఆర్. అందరూ సమరస భావంతో, సహోదరులవలె కలసి మెలసి, జీవించాలన్నదే ఆయన ఆశయం. పరమత సహనానికి ప్రతీకైన మన భారత దేశ విఖ్యాతికి విఘాతం కలుగకుండా, తెలంగాణ రాష్ట్ర ముఖ్య లక్షణం, నినాదం అయిన ‘గంగా జమున తెహజీబ్’ ని భారత దేశమంతటా విస్తరింపజేయనున్నారు. ప్రజలందరూ ఏ లోటు లేకుండా ముఖ్యంగా ప్రపంచ ఆకలి సూచిలో 107వ స్థానంలో ఉన్న మన దేశాన్ని తిరిగి అన్నపూర్ణగా చేసి, ఆకలి చావులు,బాధలు లేని దేశంగా తీర్చిదిద్దాలనే సత్సంకల్పం కేసీఆర్‌ది. రైతు శ్రేయోదాయకమైన భారతీయ రాష్ట్ర సమితిగా అభివృద్ధి చేసి, సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతిని యావత్భారతావనికి ప్రసరింప జేసే దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు.
సమసమాజ నిర్మాణ లక్ష్యసాధన ఉచ్ఛ్వాసగా, సంస్కరణ, సముద్ధరణ నిశ్వాసగా సాగే మీ జీవనయానంలో ఎన్నో, ఎన్నెన్నో ప్రజోపయోగ పథకరచనలు. తిలకించి.. పులకించిన రాష్ర్టాలన్నీ స్వాగతించడంలో జాతి యావత్తూ స్పందించడంలో అనూహ్య మేమున్నది? ఆనందమేతప్ప! ఆశ్చర్యమేముంది? ఆహ్వానమేతప్ప! భరతజాతిని ఒక్కతాటిపై నడిపింప బూనుకున్నాడు పోరుకాడెడువాడు..బాపూ! అను పిలుపుకు సరితూగు మొనగాడు.భువన విజయానికి వన్నె తెచ్చిన ఘనుడు. తనకు సాటి తానేయౌ పాలనాదక్షుడు.
శతాయుష్మాన్ భవ అని జనుల దీవెనలు. అభిమానులందరి అభినందనలు అందుకుంటున్న శుభవేళ.
సుదినం సుదినం జన్మదినం తవ.,
సుదినం సుదినం భవతు మంగళం.,
సుదినం సుదినం చిరంజీవ భవ..
సుదినం సుదినం యశోవర్ధనం..
విజయీభవ సర్వత్ర సర్వదా.
శతమానం భవతి శతాయుః
పురుషశ్శతేంద్రియ..
ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి..
– (వ్యాసకర్త: రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు)
– మంత్రి శ్రీదేవి