ఓటర్ల ఆలోచనా ధోరణిలో ఈ సారి రెండు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమకు లభించిన వాటితో అంతవరకు సంతృప్తి చెంది, తక్కినవి కూడా క్రమంగా లభించగలవనే ఆశాభావంతో ఉండటం అందులో ఒకటి. లభించినవాటిని పొందుతూనే, తక్కినవి అన్నీ కూడా తక్షణమే వచ్చితీరాలనే పట్టుదల చూపటం రెండవది. మొదటినుంచి ఇటీవలి వరకు ప్రజలందరికి మొదటి ధోరణే ఉండేది. ఇప్పటికీ అధిక సంఖ్యాకులది అదే ధోరణి. కానీ, కొందరిలో ఇప్పుడు కొత్తగా ఈ రెండవ ధోరణి ఎందుకు తలెత్తుతున్నదనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం.
ఈ రెండు ధోరణులకు సంబంధించి ముందుగా ఉదాహరణలను చెప్పుకొని ఆ తర్వాత చర్చలోకి వెళ్దాం. ముందు మొదటి ధోరణిని చూద్దాం. రైతులకు అనేక సమస్యలున్నాయి. వాటిలో నీళ్లు, కరెంటు, పెట్టుబడి, ఎరువులు, మందులు, ధాన్యం కొనుగోలు వంటి సమస్యలు పరిష్కారమయ్యాయి. సాగు ఖర్చు ఎక్కువ కావటం, మద్దతు ధర, అకాల వర్షాలకు ధాన్యం మార్కెట్లో తడవటం వంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. ఈ స్థితిలో వారు, మొదటినుంచి ఉండిన అనేక సమస్యలు పరిష్కారం కావటాన్ని గుర్తిస్తున్నారు. అందుకు ఆ మేర సంతృప్తి చెందుతున్నారు. తక్కిన సమస్యలు కూడా ఇదే పద్ధతిలో మున్ముందు పరిష్కారం కాగలవనే నమ్మకంతో ఉన్నారు. అన్నీ ఉన్నట్టుండి ఒకేసారి జరిగిపోవటం సాధ్యం కాదని వారికి తమ అనుభవం ద్వారా తెలుసు. అందుకే ఒక రైతు ఈ రచయితతో, ‘పొయ్యి మీద బియ్యం వెట్టంగనే ఉడుకుతదా. ఇదివరకు లేనిది బియ్యమైతే పెట్టిండ్లు గద’ అన్నాడు.
ఇది మొదటి ధోరణికి ఉదాహరణ కాగా, రెండవ ధోరణికి ఉదాహరణ దళితబంధు. ఇటువంటి అద్భుతమైన పథకం దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మొదలుకొని ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. ఇప్పటికీ తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ దేశంలో దళితులను అన్నివిధాలుగా అణచివేయటం గురించి ఎంత చెప్పినా తక్కువే. వారిని బాగుచేయటం పేరిట ఈ 75 ఏండ్లలో వివిధ పార్టీల ప్రభుత్వాలు ఏమేమి చర్యలు తీసుకున్నా అవన్నీ వారికి ఉపయోగపడింది కొద్దిస్థాయిలో మాత్రమే. ముఖ్యంగా వారిని తమ కాళ్లపై తమను నిలబెట్టలేదు. కనుకనే వారిపై సామాజికమైన, సాంసృ్కతికమైన పీడన కొనసాగుతున్నది. ఈ సమస్యలన్నింటికి నిజమైన పరిష్కారం వారికి ఆర్థికంగా స్వావలంబన కల్పించటంలో ఉందని, తద్వారా వారు రాజకీయ సాధికారత సైతం పొందగలరన్న ఆలోచనతో కేసీఆర్ ‘దళితబంధు’ అనే అపూర్వమైన పథకాన్ని రూపొందించారు. దాని అమలు కూడా మొదలైంది.
అయితే, దళిత కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉండటం, దళితబంధు నిధి ఏదో మొక్కుబడిగా కాక పెద్దమొత్తం కావటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిమితులు అనే మూడు అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఈ పథకాన్ని దశలవారీగా అమలుచేయగలమని, ప్రతి బడ్జెట్లో అందుకు నిధులు కేటాయిస్తూ పోగలమని కేసీఆర్ మొదటనే స్పష్టంగా వివరించి చెప్పారు. దశలవారీగా ప్రతి ఒక్క కుటుంబానికి పథకం తప్పక లభించగలదని హామీ ఇచ్చారు. మొదటి నుంచి గల దళితుల పరిస్థితిని, ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకున్నవారు, గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక పథకం మొదలైంది గదా, క్రమంగా అందరికీ వర్తించగలదనే ఆశాభావంతో ఉన్నారు.
కారణం ఏదైతేనేమి అట్లా అర్థం చేసుకోనివారు, ఇది మొత్తం అందరికీ తక్షణమే వర్తించి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందిరాగాంధీ అమలుచేసిన పథకాలు కూడా దశలవారీగా జరిగాయని వారికి తెలుసు. అవైనా ఇంత గొప్పవి కావు. ఈ దళితులకు, వారి కుటుంబాలకు ఇతరత్రా కొన్ని పథకాల వల్ల లబ్ధి కలుగుతుండవచ్చు గాక. ఉదాహరణకు వారిలో రైతులుంటే అవి, వృద్ధులుంటే పింఛన్లు, వికలాంగులుంటే అవి, పెండ్లిళ్లు, కాన్పుల వంటివి జరిగితే అవి, గురుకుల విద్యలు వగైరాలు. అయినప్పటికీ దళితబంధు అనే ఒక్క పథకం దశలవారీగా అమలు జరుగుతుంటే కొందరు మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇటువంటివే మరి కొన్ని ఉదాహరణలు చెప్పవచ్చు. డబుల్ బెడ్రూం పథకం వాటిలో ఒకటి.
ఉదాహరణలు చూసినందున ఇప్పుడు చర్చలోకి పోదాం. ఈ విధమైన రెండు ధోరణులు గతంలో ఉండేవి కాదని, ఇది ఇటీవలి మార్పు అని పైన అనుకున్నాం. గతంలో ఎందుకు లేదు, ఈ మార్పు ఇప్పుడెందుకు అన్నది ప్రశ్న. స్వాతంత్య్రానికి ముందు కాలమంతా మనది భూస్వామ్యం, రాచరికం, వలస పాలనలతో అణగారిన సమాజం. అందువల్ల ప్రజలు స్వాతంత్య్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అవి నెమ్మదిగానైనా నెరవేరే సూచనలు కొంతవరకు నెహ్రూ పాలనలో కనిపించాయి. కారణాలు ఏవైతేనేమి అవి త్వరలోనే ఆవిరి కాగా, రకరకాల అశాంతులు, అందులో భాగంగా నెహ్రూ తర్వాత నక్సలైట్ ఉద్యమరూపంలో కన్పించాయి. అందులో దళితులు పెద్ద సంఖ్యలో చేరారు. ముఖ్యంగా ఆ దశ నుంచి ప్రజలకు ఏ నాయకుని పట్లనైనా, వారు తమ జీవితాలకు చిన్న మేలు ఏదైనా చేస్తే చేయవచ్చు గాని అంతకుమించి పెద్ద మార్పులేవో తేగలరనే ఆశలు ఎప్పుడూ కలగలేదు. ఆ చిన్న మేలు ఏదో సంక్షేమం పేరిట, పాప్యులిజం రూపంలో జరుగుతూ వచ్చింది తప్ప ప్రజల జీవితాల్లో మౌలిక మార్పులేవీ చోటుచేసుకోలేదు. చివరికి బీసీ పార్టీలు, దళిత పార్టీలు, వామపక్షాలు పాలించిన చోట్ల కూడా ఇందులో తేడా లేకపోయింది. ఆ స్థితిలో ఏవో చిట్టిపొట్టి సంక్షేమాలు చేసినవారు కూడా ప్రజల మెప్పు పొందారు.
ఇటువంటి సుదీర్ఘ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. తన ఆలోచనలు ఇన్ని దశాబ్దాలుగా వివిధ పార్టీలు, ప్రభుత్వాలు చేసినదానికి భిన్నంగా సాగాయి. ఒక్కస్థాయిలో ప్రజల జీవితాలు సంక్షేమ మార్గంలో సజావుగా సాగటం, మరొక స్థాయిలో వారి ఆర్థిక స్థితిగతుల్లో సమూలమైన మార్పులు వచ్చి వారికి స్వావలంబన ఏర్పడటమన్నది ఆయన ఆలోచన. ఇది తప్పకుండా విప్లవాత్మకమైనదే. ఈ వాదనకు సమర్థనగా అనేక విషయాలు చెప్పవచ్చు. తిరిగి రైతుల పరిస్థితికే వెళ్తే, వందల సంవత్సరాలుగా వెనుకబడిన ఇక్కడి వ్యవసాయరంగాన్ని, దానిపై ఆధారపడిన వివిధ వర్గాలను మునుపెన్నడూ లేని రీతిలో స్వయం సమృద్ధం చేసేందుకు కేసీఆర్ ఏమేమి చర్యలు తీసుకుంటూ వస్తున్నారో, వాటి ఫలితాలు ఏమిటో కళ్లెదుట కనిపిస్తున్నవే గనుక ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ మార్పులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇతరులు చేసిన వాటికి భిన్నమైనవి, మౌలికమైనవి.
ఇటువంటి మార్పులు తమ అనుభవంలోకి మొదటిసారి వస్తున్నాయి గనుకనే తెలంగాణ రైతాంగానికి, గ్రామీణ ప్రజానీకానికి కేసీఆర్ మాటలు, చేతల పట్ల అచంచలమైన విశ్వాసం ఏర్పడింది. ఆ విశ్వాసం ఒక పునాది వంటిది. అందువల్లనే తను రాగల కాలంలో తీసుకోగలనంటున్న చర్యల పట్ల కూడా వారు పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఆ చర్యలేవో ఇప్పటికిప్పుడు తక్షణం జరిగిపోవాలనటం లేదు. అట్లా జరగటం సాధ్యం కూడా కాదని, పొయ్యి మీద పెట్టగానే బియ్యం ఉడికిపోవన్నది వారికి జీవితానుభవం చెప్పిన విషయం. దళితబంధు విషయానికి వస్తే కొంత భిన్నమైన పరిస్థితి కన్పించటానికి కారణం ఏమిటి?
వాస్తవానికి స్వాతంత్య్రానికి ముందుగాని, తర్వాతకాలంలో గాని అటు రైతులు, ఇటు దళితుల ఆర్థిక స్థితిగతులు స్థూలంగా ఒకటే. రైతులది బలహీన స్థితి కాగా, దళితులకు రైతుల వలె భూమి అనే ఆధారం లేదు గనుక మరింత హీనస్థితి. 1947 నుంచి వివిధ పార్టీల ప్రభుత్వాలు దళితుల కోసం, పైన చెప్పుకున్నట్టు, కొన్ని సంక్షేమ చర్యల రూపంలో అరకొర చర్యలు తీసుకుంటూ వచ్చాయి తప్ప, వారి ఆర్థిక స్థితి మౌలికంగా మారి, వారికి ఆర్థిక స్వావలంబన ఏర్పడి, వారు తమకాళ్లపై తాము నిలబడి, తద్వారా ఆర్థిక సాధికారతను సాధించి, సామాజికంగా-సాంస్కృతికంగా సగౌరవంగా జీవించే పరిస్థితులను ఎన్నడూ సృష్టించలేదు.
ఆ పని ఇప్పుడు మొట్టమొదటిసారిగా తెలంగాణలో జరుగుతున్నది. అది వివిధ సంక్షేమ పథకాలతో పాటు దళితబంధు పథకం ద్వారా. ఆ పథకం ప్రభావం ఎటువంటిదో దళిత సమాజానికి ఎవరూ వివరించనక్కరలేదు. కనుకనే ఆ పథకపు లబ్ధిదారులు ఎంతగా ఆనందిస్తున్నారో, అదింకా లభించవలసినవారు దానికోసం అంతగా ఆత్రుత చెందుతున్నారు. సాధ్యాసాధ్యాలతో నిమిత్తం లేకుండా అదిప్పటికిప్పుడు తమకందరికీ వర్తించాలనంటున్నారు. అయితే, అట్లా వర్తింపజేసే ఉద్దేశం ఉన్నప్పటికీ ఆచరణలో బడ్జెట్ పరిమితులు ఎవరికైనా ఏ అంశానికి సంబంధించి అయినా ఉంటాయి. ఒకవేళ దళిత ప్రభుత్వం ఏర్పడినా అన్ని దళిత కుటుంబాలకు ఇప్పటికిప్పుడు ఒకే విడుతలో, అంతపెద్ద మొత్తంలో, పథకం అమలు సాధ్యమయ్యే విషయం కాదు.
ఇది అర్థం చేసుకున్న దళితులు అందుకు తగినట్టుగా వ్యవహరిస్తున్నారు. వారి సంఖ్య ఎక్కువా తక్కువా అనే మీమాంసలోకి పోవటం ఇటువంటి ముఖ్యమైన, సున్నితమైన అంశాల్లో సరైంది కాదు. అందువల్ల దానినట్లుంచి, దేశ చరిత్రలో మొదటిసారిగా అమల్లోకి రావటం మొదలైన ఇటువంటి మహత్తర పథకాన్ని దళితులు అందరూ ఇప్పటికే గుర్తించినందున, వారు ఆచరణాత్మకతను దృష్టిలో ఉంచుకుంటూ, ఈ సమూలమైన సముద్ధరణ మార్గంలోకి క్రమంగా అడుగులు వేయవలసి ఉంటుంది. మరొక మార్గమూ లేదు. మనం కూడా ఈ రెండవ ధోరణిని, కొందరి ఆతృతను, అర్థం చేసుకొని వ్యవహరించవలసిందే తప్ప, వారి కోర్కెను వీలైనంత వేగంగా తీర్చవలసిందే తప్ప, అపార్థాలు తగవు.
టంకశాల అశోక్