కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. ఇది వాస్తవ జీవితంలో కేసీఆర్కు పూర్తిగా వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధన మొదలు నేటిదాకా ఉద్యమస్ఫూర్తిని ఈ తరానికే కాదు భవిష్యత్తు తరాలకు భద్రంగా అందించడానికి కృషిచేస్తున్న ఆచరణశీలి కేసీఆర్. నవ వసంతాలు పూర్తిచేసుకున్న మన స్వయంపాలన ఈ దేశానికి ఒక దారిదీపం. అనన్య సామాన్యమైన పనులను అలవోకగా చేసి చూపించి ప్రపంచాన్ని అబ్బురపరిచిన నాయకుడు కేసీఆర్.. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలను గమనంలో ఉంచుకొని భవిష్యత్ దశ దిశ నిర్దేశనం చేస్తున్న నిత్య కృషీవలుడి విజయ పరంపరలో కొన్ని మైలురాళ్లు.
తెలంగాణ వస్తే కరెంటే ఉండదన్నరు. తెలంగాణోడికి పాలించడం రాదన్నరు. నక్సలిజం పెరుగుతదన్నరు. దళితులపై దాడులు ఆగబోవన్నరు. ఇలాంటి కుట్రపూరిత ప్రచారాలను బద్దలుకొట్టి ఈ ప్రపంచం ముందు తెలంగాణ ప్రజల స్వయంపాలన ఆత్మగౌరవ జెండాను ఎగరవేసిన దక్కన్ పీఠభూమి మోదుగు పువ్వతడు. అసాధ్యాల ను సుసాధ్యం చేసి కండ్లముందు ఆవిష్కరించిన అపర భగీరథుడతడు. గురుకులాలకు గురువతడు. మెట్ట పొలాలకు నీటి తడులద్దిన కర్షకుడతడు.
కుల వ్యవస్థతో కూడిన భరతావనికి అసలు సిసలు భారతీయతను అద్దిన ప్రయోగశీల నాయకుడు కేసీఆర్. మొరం నేలలపై చెరువులను పూయించి చెరువెనుక పొలాల వరివెనులకు స్వర్ణపు కాంతులద్ది తెలంగాణను భారతదేశపు ధాన్యాగారంగా మార్చిన నాయకుడు. చనిపోయిన అన్నదాత కుటుంబానికి బీమా ఇచ్చి ధీమానిచ్చిన ఉద్యమనాయకుడు. కులమతాలకు అతీతమైన సోదరభావాన్ని, సమానత్వ భావనను ఆచరణలోపెట్టి ప్రతి తెలంగాణ బిడ్డ సగర్వంగా ఎలుగెత్తి నినదించే మానసిక ధైర్యాన్నిచ్చాడు.
ఉద్యమాలు చేయడం.. భావాలను పరివ్యాప్తి చేయడం సోషల్ మీడియా యుగంలో సాధారణం. 1985లోనే సమాజంలో ఉన్న అట్టడుగు దీన జను ల అవస్తలను అర్థం చేసుకున్న ఆచరణాత్మక కార్యశీలి కేసీఆర్. అందులోభాగంగా నాడు ఉద్భవించిందే ‘దళిత జ్యోతి’ అనే కార్యక్రమం. తెలంగాణ స్వయం పాలన ప్రారంభమయ్యాక ఉద్భవించిన మరో మణిమకుటం ‘దళిత బంధు’. విభిన్న కులమతాల ఏకతారాగమై ఉద్భవించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహస్థాపన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజాస్వామ్యం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్లతో ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాను అందించిన జనరంజక పాలకుడు కేసీఆర్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత గాంధీ గ్రామస్వరాజ్య నినాదాన్ని ఆచరణలో పెట్టిన సిసలైన గాంధేయవాది కేసీఆర్.
ఇంతేనా పరిపాలన వికేంద్రీకరణ. ప్రభుత్వ ఫలాల పంపిణీ కోసం బడ్జెట్లో చేస్తున్న కేటాయింపులు, అవుతున్న ఖర్చు సంక్షేమ పాలనారీతులకు ప్రతీకలు. అమర్త్యసేన్ ప్రవచించిన ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచే శ్రేయోరాజ్య స్థాపనకు పునాదులు తెలంగాణలో పడుతున్నాయి. ఇదంతా ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రజల వాస్తవిక జీవన స్థితిగతులను అర్థం చేసుకునే గుణం ఉండటం వల్లనే వివిధ సామాజిక తరగతుల ప్రజలకు అభివృద్ధి ఫలాల పంపిణీ జరుగుతున్నది. ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. అందుకే వ్యక్తులుగా, వ్యవస్థలుగా ఎవరి ఆత్మగౌరవానికి భం గం వాటిల్లకుండా పాలన సాగుతున్నది. కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలన దీన్ని రుజువు చేస్తున్నది. ఆడబిడ్డల నుంచి పండు ముదుసలి వరకు అభివృద్ధి ఫలాలు తమ జీవన గమనానికి ఊతమిస్తాయని భావించేలా చేసిన భావిభారతాన్ని తెలంగాణలో ఆవిష్కరించిన పాలన ఇది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే న్యాయవాదుల సమస్యలు పరిష్కారం కాలేదు. హైకోర్టు నుంచి మున్సిఫ్ కోర్టుదాకా అమూలాగ్రం అర్థం చేసుకుని న్యాయం పక్షాన పోరాడే న్యాయవాదులకు న్యాయం చేయడంలో సఫలీకృతమైందీ ప్రభుత్వం. దీనివల్ల పెద్ద కోర్టుల నుంచి చిన్న కోర్టుల వరకు అధికార అనుభవాన్ని ఎరుగని అనేక సామాజికవర్గాలకు అనుభవంలోకి తెచ్చింది తొమ్మిదేండ్ల తెలంగాణ ప్రభుత్వం. గత పాలనలో విస్మరణకు గురైన ఈ వర్గాలకు వంద కోట్లిచ్చి అండగా ఉన్న పెద్దన్న సీఎం కేసీఆర్. స్వర్గీయ జస్టిస్ కొండా మాధవరెడ్డి ఆశయాలను ఆచరణ ద్వారా తెలంగాణ న్యాయవాదులకు అనుభవంలోకి తెచ్చారు కేసీఆర్. నాడు ముల్కీలను ముంచే ప్రయత్నం చేస్తే బలంగా నిలబడ్డ వ్యక్తి జస్టిస్ కొండా మాధవరెడ్డి అయితే దాన్ని మించి విస్మరణకు గురైన ముల్కీల (స్థానికులు)ను న్యాయరంగంతో పాటు అనేక రంగాలలో అందలమెక్కించిన నాయకుడు కేసీఆర్.
నోర్లు తెరిచిన బీళ్లు, కాలిన మోటర్లు.. ఎరువుల కోసం కిలోమీటర్ల క్యూలు.. లాఠీచార్జీలు, కుప్పలుగా పడ్డ చెప్పులు 2014కు ముందు ఇదీ తెలంగాణ దృశ్యం. అంతలోనే ఎంతమార్పు. ఎరువులకు క్యూలు లేవు, ప్రైవేటు వ్యాపారుల వేధింపులు లేవు. పంటకు కాలం కనికరిస్తుందో లేదోనన్న భయం లేదు. నట్టనడెండ కాలంలోనూ నీటితో నిండిన మానవ నిర్మిత రిజర్వాయర్లు తెలంగాణలో. ఒక పంటకే దిక్కులేని దశ నుంచి తమ ధాన్యాన్ని కొ నండని రైతులు రోడ్డెక్కే పరిస్థితిని తెచ్చింది నాయకత్వం. దక్షిణ భారతావనికి ధాన్యాగారమని పేరొందిన జిల్లాలు వెలవెలబోతుంటే కరువుజిల్లా పాలమూరు రెండు పంటలకు మించి పచ్చగా కళకళలాడుతూ ఉన్నది. ఇది పాలనా సామర్థ్యానికి ప్రతీక.
ఒకప్పుడు తెలంగాణ పలురకాల ఉద్యమాలకు వేదిక. నేడు అభివృద్ధి పథాన నడిచే తీరుకు పతాక. ఈ ప్రాంతం నుంచి ఉద్భవించి యావత్ భారతావనికి తన ప్రయోగాత్మక అభివృద్ధిని ప్రవచించబోతున్నది బీఆర్ఎస్. సంక ల్పం, పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసే తెలంగాణ ఒక ప్ర యోగశాల. ఇది కేసీఆర్ భారతదేశ చరిత్రకు అద్దుతున్న అమృతపు గడియల అడుగులు. భారతమాత ము ద్దుబిడ్డ కేసీఆర్ను అశేష భారతావని ఆశీర్వదించి ఆహ్వానిస్తున్నది.
(వ్యాసకర్త: న్యాయవాది,బీఆర్ఎస్ లీగల్ సెల్)
-రవికుమార్ వొద్యారపు