చదువరులందరికీ శుభాకాంక్షలు. మన తెలంగాణ బాగున్నది. మనందరి కోరికలు నేరవేరుతున్నయి. అందరి కోరికలు అంటే అందరివీ! కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం, లింగ భేదాలు మాత్రమే కాకుండా… పార్టీ విభేదాలు కూడా లేకుండా ప్రజలను పచ్చగా ఉంచుతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏ పార్టీ ఎమ్మెల్యే అనే తేడా లేదు. సంక్షేమ ఫలాల అందజేతలో ఎలాంటి తేడాలు చూపడం లేదు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో సంపద పంపిణీ జరుపుతున్నది కేసీఆర్ పాలన!
వికారాబాద్ జిల్లా తాండూరు రూరల్ మండలం ఎల్మకన్నె గ్రామ ప్రచారంలో ఈ వ్యాస రచయితకు ఎదురైన అనుభవం ఇది… కాంగ్రెస్ కండువా వేసుకుని వచ్చిన యువకుడు నినాదాలు, అరుపులతో అల్లరి చేస్తూండగా.. గత పదేండ్ల పాలనలో ఇంటింటికీ అందిన ప్రయోజనాలు లెక్కలతో సహా ఏకరువు పెడుతూ ఉంటే, మీ ఇంటికి ఏమన్నా ఒచ్చినయా అమ్మనడుగు అని చెప్తూ ఉంటే అప్రతిభుడైండు ఆ యువకుడు. మీ ఊరికీ, మీ ఇంటికీ ఏ ఒక్క పని, ఏ ఒక్క బుడ్డ పైసా రానట్టయితే నీ ఇష్టం ఉన్నవారికి ఓటు వేసుకో అంటుంటే అతనే కాదు, అక్కడ గుమిగూడిన వారంతా పిన్‌డ్రాప్ సైలెన్స్. మరొక ఉదాహరణ బషీరాబాద్ మండలం కంసాన్పల్లి తండాను ఆనుకుని ఉన్నది కర్ణాటకలోని ‘ఆడికి’ తండా. ఒరానికి (గట్టు) ఇవతల తెలంగాణ భూమి, అవతల కర్ణాటక భూమి. మేము ప్రజలతో మాట్లాడుతూ ఉంటే, పక్క పొలంలోకి కర్ణాటక రైతులు వచ్చి విన్నరు. రైతుబంధు, 24 గంటల కరెంటు, రైతుబీమా గురించి చెప్తుంటే.. మా ఊరు తెలంగాణలో కలిపేయమని మీ కేసీఆర్ సారుకు చెప్పండి అంటూ వారి మొర!
ఫ్రెండ్స్.. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్రం నలుమూలలా ఎన్నో, ఎన్నెన్నో. సరిహద్దుల అవతల నుంచి కూడా మనను ప్రేమిస్తున్నరు. ఎంత గర్వకారణం మనందరికీ. పదేండ్లలోనే ఇన్ని అద్భుతాలు సాధించుకున్నం మనం, కేసీఆర్ నేతృత్వంలో. ఇపుడవన్నీ తిరుగుమార్గం పట్టించాలని కంకణం కట్టుకుని ఉన్నవారు ‘ప్రతిపక్షాల’ రూపంలో మీ ముందుకువస్తున్నరు.
కులమూ, మతమూ పిచ్చి మెండుగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆయనను ఆడించే చంద్రబాబు సహా తెలంగాణ మేలు కోరేవారి ముసుగులో ఉన్న వారందరూ కలిసి మిడుతల దండు వలె మీద పడుతున్నరు. తెలంగాణ వస్తే కరెంటు కష్టాలు తప్పవని వెక్కిరించినవారు.. ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో ఆ వెక్కిరింతలను, అక్కసును నెరవేర్చే కుతంత్రంలో ఉన్నరు. తెలంగాణపై పగ తీర్చుకోవాలని తహతహలాడుతున్నరు. కాబట్టే, వికారాబాద్ జిల్లా పరిగిలో కర్ణాటక కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించిండు- మా దగ్గర 5 గంటలు ఇస్తున్నం, ఇక్కడ కూడా అంతే అని. ప్రజాద్రోహంలో నాలుగాకులు ఎక్కువే చదివిన టీపీసీసీ అధ్యక్షుడు 5 కాదు, 3 గంటలే కరెంట్ ఇస్తం, తెలంగాణను చీకట్లలో ముంచుతం, చంద్రబాబు శిబిరంలో వెలుగులు నింపుతమంటూ యమ ఆరాటపడుతున్నడు. బంగాళాఖాతంలో ధరణిని కలిపి వెనకటి పెత్తందారీ పాలనకు తలుపులు బార్లా తీయాలని చూస్తున్నడు.
మిత్రులారా! మీరు ఒక్కపారి సోషల్ మీడియాను పరికిస్తే తెలుస్తది- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎందరో టీడీపీ కార్యకర్తలు తెలంగాణలో రేవంత్‌రెడ్డి గెలవాలని కోరుకుంటున్నరు. చిత్రమేమంటే… రాష్ట్రం విడగొట్టిందనే భావనలో కాంగ్రెస్ పార్టీని తమ రాష్ట్రంలో బొందపెట్టించి, 2019లో గెలిచిన టీడీపీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలనుకుంటున్నది. అగ్రరాజ్యం అమెరికా లాటిన్ అమెరికన్ దేశాల్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాలను నెలకొల్పి సహజ వాయువును కొల్లగొట్టినట్టు, చంద్రబాబు తెలంగాణలో తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నెలకొల్పాలనుకుంటున్నరు. పాత పగతో మరింత దోపిడీకీ తెరతీయబోతున్నరు. రాజకీయ పరిణతి, తెలంగాణ ఆత్మ లేని కాంగ్రెస్ రాష్ట్ర, దేశ నాయకులు చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న రేవంత్‌రెడ్డిని కట్టడి చేయలేకపోతున్నరు. ఆ పార్టీలో ఉన్న బడుగు, బలహీన వర్గాల నాయకులను హీనంగా చూసే రేవంత్‌రెడ్డి ఫ్యూడల్, కమ్యూనల్, చీప్, వల్గర్ ట్రిక్స్‌తో దిక్కుతోచని స్థితిలో పడిపోయినయి రాష్ట్రవ్యాప్త కాంగ్రెస్ శ్రేణులు.
పైన ఎల్మకన్నె గ్రామ ఉదాహరణలో చెప్పినట్టు పదేండ్ల కేసీఆర్ పాలన చవిచూసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సైతం బీఆర్ఎస్ను వ్యతిరేకించడానికి సరైన కారణాలు చెప్పలేకపోతున్నరు. తమ తమ గ్రామాల్లో న్యూట్రల్‌గా ఉన్న ప్రజలను కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ఒప్పించలేకపోతున్నరు. ‘24 గంటలు వద్దు-5 గంటలు ముద్దు’ అనగలరా, ‘3 వేలు వద్దు, 8 వందల పింఛన్ ముద్దు’ అనగలరా, ‘400 వద్దు 500 సిలిండర్ ముద్దు’ అనగలరా… ‘దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి తీసేస్తాం’ అని చెప్పగలరా, ఇంకా గొప్పగా చేస్తమని చెప్పగలరా.. అని సామాన్య జనం నిలదీస్తున్నరు కాంగ్రెస్ ప్రచారకులను. పదేండ్లు అధికారానికి దూరంగా ఉండి బకాసుర ఆకలితో తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గిస్తే ఆరంటే ఆరు నెలల్లోనే తెలంగాణను సాంతం నాకేస్తది!
కేసీఆర్ ‘ప్రజా ఆశీర్వాద సభలు’ 73 జరిగినయి సూర్యాపేటతో. తాండూరు సభ 74వది. ఆ సభల విజయాన్ని గమనించిన ఒక వెబ్‌పోర్టల్ ఇట్లా రాసింది.. ‘తెలంగాణ ఉద్యమం ఉర్రూతలూగుతున్న సమయంలో ఎలా అయితే.. ప్రతి పల్లె కదిలి వచ్చిందో.. అంతకుమించిన చైతన్యంతో సీఎం కేసీఆర్ ప్రసంగాలు వినడానికి ఊర్లకు ఊర్లే తరలివస్తున్నాయి. నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివస్తున్నారు. సీఎం కేసీఆర్ మాటతప్పడు, మడమతిప్పడు అనే అచంచల విశ్వాసమే ప్రజలు పెద్ద ఎత్తున సభలకు వచ్చేలా చేస్తుందని శ్రేణులు చెప్తున్నాయి. ఇచ్చిన మాట కోసం సీఎం కేసీఆర్ ప్రాణం పోయినా వెనుకాడరనే నమ్మకం ప్రజలకు ఉందని చెప్తున్నారు. ఈ నమ్మకం, విశ్వాసం ఒక్కరోజుతో కేసీఆర్ మీద ఏర్పడింది కాదని.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పిడికెడు మందితో తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచే తెలంగాణ జనం కేసీఆర్‌పై విశ్వాసంతో వెంట నడిచిందని, ఇప్పటి వరకు నడుస్తున్నదని చెప్తున్నారు.’
అదీ సంగతి మిత్రులారా. ఆ దార్శనిక మహా నాయకుడు కేసీఆర్ ఎక్కడ, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ! పూటకో కీచులాటతో పుణ్యకాలం గడిపేసే కాంగ్రెస్ అరాచక పాలన వస్తే… ఆడపిల్లల పెండ్లికి మొహం చాటేసే మేనమామ లెక్క కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సాయం అందనివ్వరు, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు ఉండవు, పుట్టిన బిడ్డకు కిట్ అందదు, బడికెళ్లే కాలంలో రుచికరమైన శ్రేష్ఠమైన అల్పాహారం అందదు. ఒక్క మాటలో చెప్పాలంటే 2014కు పూర్వపు పరిస్థితులు వస్తయి. తెలంగాణ ఉనికికి రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా కూడా ముప్పు తప్పదు. మనను బాధించే, అతలాకుతలం చేసే విషయాల గురించి తీవ్రంగా, స్పష్టంగా రాయాలని అంటరు ఎర్నెస్ట్ హెమింగ్వే. అందుకే ఇవన్నీ రాస్తున్న.
భేషజాలు లేకుండా; మోహమూ, మొహమాటమూ లేకుండా నేనిప్పుడు కొన్ని విషయాలు స్పష్టం చేయాలనుకుంటున్న. రెండున్నర ఏండ్ల కిందట వరకూ తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీలో పనిచేసిన నేను. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యునిగా, ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల విభాగం చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన. 2018 ఎన్నికల సమయంలో మహాకూటమి విఫలమైన తర్వాత… అందులో చక్రం తిప్పిన చంద్రబాబు కారణంగా టీజేఎస్ భిక్షుక పాత్రకు పరిమితమైన తర్వాత… అప్పటికి ఐదేండ్ల కేసీఆర్ పాలనను 2014కు ముందున్న రోజులను బేరీజు వేసుకున్న తర్వాత… ప్రగతి ప్రస్థానంలో పాత్రను వెతుక్కుంటూ అప్పటి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో కలిసి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న.
నాడు టీఆర్ఎస్కు దూరమైన ఎందరో ఉద్యమకారులు అచ్చు నాలాంటి మథనంతోనే ఇపుడు బీఆర్ఎస్లో చేరిన్రు, ఇంకా చేరుతున్నరు. అదే చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుండటం, తెలంగాణ ప్రేమికులను అందరినీ పొమ్మనలేక పొగ పెట్టించడం వల్ల దాసోజు శ్రవణ్, చెరుకు సుధాకర్, దరువు ఎల్లన్న లాంటివాళ్లు తిరిగి ఉద్యమగూటికి చేరుకున్నరు. ఇతర పార్టీల నుంచి కూడా ఉద్యమ బిడ్డలు అమ్మ ఒడికి చేరుకున్నరు. బేషరతుగా, మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ విజయానికి కృషిచేస్తున్నరు. ఎందుకంటే పుట్టిన నాటినుంచి టీఆర్ఎస్ పార్టీ నడక తెలుసు గనుక; నాయకుడి కఠోర దీక్ష తెలుసు గనుక; దండలో దారంలా పార్టీని నడిపే ఫిలాసఫీ తెలుసు గనుక! ప్రగతి తీరాల సాగుతున్న తెలంగాణ నావను ముంచే శక్తులను ఎదిరించాలని నిర్ణయించుకున్నరు గనుక!
నా ఈ వ్యాసం బీఆరెసేతరులు కూడా చదువుతరని నాకు తెలుసు. కాబట్టే మనసు విప్పి పైమాటలు చెప్పిన. ఫిరాయింపులు వాటికవే తప్పేమీ కాదు. అయితే ఎందుకు ఫిరాయిస్తున్నం, ఫిరాయించి ఏమి సాధిస్తున్నం అనేది ముఖ్యం. వ్యక్తిగత ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలలో ఏది పైచేయిగా ఉన్నదనేది కీలకం. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు హక్కుగా అనుభవిస్తున్న బీఆరెసేతర ఓటర్లకు కూడా సవినయ విజ్ఞప్తి. నిర్మల హృదయంతో అద్దం ముందు నిలబడి మీ కండ్లలోకి సూటిగా చూస్తూ ఆలోచించండి. ఎవరి వల్ల ఈ రోజు మనం ఆనందంగా ఉన్నం; ఇంకా నెరవేరని ఆకాంక్షలను, ప్రయోజనాలను ఎవరు తీర్చగలరు; అలాంటి ట్రాక్ రికార్డ్ ఎవరికి ఉన్నది; ఎందుకు నాడు టీఆర్ఎస్ను వీడిన నికార్సయిన తెలంగాణ ఉద్యమ నాయకులు నేడు బీఆర్ఎస్కు తిరిగి ఒచ్చిన్రు; దాని వెనుకాల ఉన్న రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఏమిటి అనేది బేరీజు వేసుకోండి. ఇవి కేవలం నాయకులు గెలిచే ఎన్నికలు కాదు. ప్రజలు గెలిచే, తెలంగాణ నిలిచే ఎన్నికలు. ఊహ కథలు అల్లితే, వాస్తవం వాతలు పెడుతుందని సామెత. విజ్ఞులైన మీరందరూ తెలంగాణ ప్రగతి గణాంకాలను చూడండి. కాంగ్రెస్ చెప్తున్న మాయమాటలను గమనించండి.
మా తాండూరు భీమ్‌రెడ్డి చెప్పినట్టు..
‘హాత్ కో హాత్ దో, కార్ కో వోట్ దో’!
ఈ నెల 30న మనసులో ఏమీ పెట్టుకోకుండా మీ సామాజిక, రాష్ట్ర ప్రయోజనాలకు మీ ఓటు వేసుకోండి. మీ సకుటుంబ సపరివార బంధు మిత్రుల ఓట్లు కూడా వేయించండి. ఆ ప్రయోజనాల ప్రతినిధి పేరు ‘కారు గుర్తు’! మీకందరికీ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు..! జై తెలంగాణ!
శ్రీశైల్‌రెడ్డి పంజుగుల
90309 97371