‘కేసీఆర్‌ను మించిన నాయకుడున్నడా…’ రాజకీయ శత్రువులు సైతం అంతర్గత సంభాషణల్లో మాట్లాడుకునే మాట ఇది. హృదయంతో ఆలోచించేవాడు, భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకునేవాడు కచ్చితంగా మానవతావాది అయ్యుంటాడు. అందుకే ఆయన నిర్ణయాలెప్పుడూ ప్రజాహితమైనవే అయి ఉంటాయి. సాంకేతికపరమైన లోపాలుండవచ్చునేమో కానీ, నిర్ణయం ఎప్పుడూ తప్పు కాలేదు. తొందరపాటు కాలేదు.
వచ్చిన ఆలోచనను ఒక నిర్ణయంగా మలచుకునే ముందు సంబంధిత అధికారులతో, నాయకుల తో, మేధావులతో చర్చించడం, వాళ్లు ఇచ్చిన సలహాలతో నోట్స్ రాసుకోవడం ఆయన అలవాటు. ఆ క్రమంలో మేధోమథనంలో, మానవీయ కోణంలో నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ. ఆయనొక నిరంతర విద్యార్థి.
మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తనను గెలిపించిన ప్రజలకేదో చేయాలన్న తపన తప్ప ఎలా చేయాలో, ఏం చేయాలో తెలియని స్థితి. మూడు నెలల పాటు అన్ని డిపార్టుమెంట్లు తిరిగి ఆఫీసర్లను తన దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడి, చర్చించి విషయాలను అవగాహన చేసుకొని కార్యాచరణకు పూనుకున్నానని ఒక సంభాషణలో కేసీఆర్ చెప్పారు. ఆ అంకితభావమే ఆయనను ఓటమి ఎరుగని నాయకుడిగా నిలబెట్టింది. ఆ స్వభావమే ఆయనకు రాష్ట్ర నాయకత్వంలోనూ అగ్రనాయకుడిగా నిలిపింది. ప్రజలను ప్రేమించే గుణమే స్వభావమైన నాయకుడు, వాళ్ల కోసం అంకితభావంతో ఉన్న గొప్ప నాయకుడు దొరకడం తెలంగాణ ప్రజల అదృష్టం.
మానవత, మేధోసంపత్తి, సున్నితమైన హృదయం, లోతుగా అన్వేషించే విజ్ఞత, దూరదృష్టి.. రాష్ర్టానికి ఇంకేం కావాలని నిత్య ఆలోచన, స్పష్టత, ప్రజలను గౌరవించే సంస్కారం ఇవన్నీ కలిగిన అరుదైన నాయకుడు చంద్రశేఖర్‌రావు. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న అఖండుడు. ఈ గుణాల్లో ఒక్కటంటే ఒక్కటైనా ఏ ప్రతిపక్ష నాయకుడికైనా ఉన్నాయా? అబద్ధాలు, ఆచరణ లేని అసత్య హామీలు తప్ప, అసలు వాళ్లేం మాట్లాడుతున్నారో వాళ్లకైనా అర్థం అవుతోందా? నాయకుడి లక్షణం కూడా తెలియని మరుగుజ్జు స్వభావాలు. ఏండ్ల తరబడి నడిపిన ప్రజా ఉద్యమమైనా ఒక్క చుక్క నెత్తురు నేల రాలిందా.. రక్తపాతం లేకుండా అంతంత ఉద్రేకాలను నిలువరించగలగడం ఎక్కడైనా దేశంలో జరిగిందా? అహింసతో పోరాడి రాష్ట్రం సాధించిన మన గాంధీ మన కేసీఆర్.
కుర్చీ కోసం నిత్య హింసకు ప్రోత్సహించిన కాంగ్రెస్ నాయకులతో, వాళ్ల చరిత్ర, స్వభావాలతో మన నాయకుడిని పోల్చుకోగలమా? ఒక తండ్రిలా మన హితం కోరిన మన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావును కాపాడుకుంటాం. ప్రజలు అందుకు సిద్ధంగానే ఉన్నారు. కేసీఆర్ సభల్లో కనిపిస్తున్న ప్రజల హావభావాలు, ఉత్సాహ తరంగాలే అందుకు నిదర్శనం. ఈ ఉత్సాహం కాంగ్రెస్ సభల్లో మచ్చుకైనా లేదు. చప్పట్లు, కేకలు అడుక్కోవాల్సి వస్తున్నది. అందుకే నేనంటాను. ప్రజలు విజ్ఞులు. ఎవరినెక్కడ ఉంచాలో వారికి బాగా తెలుసు.
కృతజ్ఞతతో కూడిన ఆనందం అది. తమ బాగోగులు చూసే ఇంటి పెద్ద లాంటి అందరి ‘బాపు’ పట్ల గౌరవం, అభిమానం, ప్రేమ అలా కాకుండా ఇంకెలా వెల్లడించుకోవాలో తెలీని పల్లెల భాష అది. ఇంట ఒక ఆడబిడ్డ పుడితే పుట్టిన నాటినుంచే దిగులు పడే సమాజం మనది. ఆర్థికంగా భారం అని, ఎదుగుతా ఉంటే తల్లిదండ్రులకు తానొక బరువు అవుతాననే దిగులు ఆడబిడ్డకు. రెండువైపులా ఆ బాధను తీర్చిన పెద్ద బాపు కేసీఆర్. పెండ్లికి సాయం, కాన్పుకు సాయం వరకే కాదు, గర్భంలో ఉన్నప్పటి నుంచీ లోపలి బిడ్డకీ, తల్లికీ అవసరమైన పోషకాలందించడం, మందులు అందించడం అంటే రాబోయే తరం ఆరోగ్యంగా ఉండటానికి కూడా శ్రద్ధ తీసుకునే పెద్ద తండ్రి ఆయన. ఈ ఆలోచన ఇదివరలో పాలించిన ఎందరికి వచ్చింది? ఆడబిడ్డ గర్భం దాల్చిన దగ్గరి నుంచి ఆ ప్రైవేటు హాస్పిటళ్లలో జరిగే అనవసర ఆపరేషన్లను తప్పించి, గవర్నమెంటు దవాఖాన్లలో సుఖ ప్రసవం చేయించి రూ.12-13 వేలు మంచి ఆహారం కోసం ఇచ్చి.. బిడ్డకు కిట్ అందించి, సారె బెట్టి ఇంటికి పంపిన తండ్రి లాంటి నాయకుడిని చూశామా? ఎంతసేపూ తమ గురించే ఆలోచన.. ఎలా అధికారంలోకి రావాలి.. ఎలా దాన్ని నిలబెట్టుకోవాలి. ఢిల్లీ పెద్దలకు ఎంత పంచాలి.. ఇదేగా వాళ్ల ఆలోచన.
పింఛనంటే భిక్షం కాదు. పెద్దల ఆత్మగౌరవం. క్రమంగా దాన్ని పెంచి ఎవరి మీదా ఆధారపడే అవసరం లేని ఆత్మవిశ్వాసాన్ని అందించడం, ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెం చడం. ఏ తాత, ఏ అవ్వ మరిచిపోతారు? కొడుకులా భుజం తట్టి ఆసరా అయిన దేవుడిచ్చిన ‘కొడుకు’ని. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అన్నీ రాయాలంటే పేజీలు చాలవు. ఇప్పుడు అధికారంలోకి రావాలనుకున్నవాళ్లు మన మనసున్న మా రాజుకు సమానం కాగలరా? అంతటి ఆలోచన చేయగలరా ఈ మరుగుజ్జు మెదడు గాళ్లు? తెలంగాణలో ఏ మూల ఏ సమస్యలున్నాయో ఆయనకు తెలుసు. వాటినెలా పరిష్కరించాలో ఆ మెదడు మథిస్తూనే ఉంటుంది. ఒక్కొక్కటీ పరిష్కారం చేయడానికి కసరత్తు జరుగుతూనే ఉంటుంది. ఆ కసరత్తు ఫలితమే దేశంలో ఎక్కడా ఎవరూ చేయలేని విద్యుదుత్పత్తి. ఆ ఉత్పత్తి చేసిన విద్యుత్తును నిరంతరాయంగా రైతులకు, పరిశ్రమలకూ, ప్రజా అవసరాలకు పంపిణీ చేయడం. విద్యుత్తు సరఫరా వల్ల రాష్ట్ర సంపద పెంచడం.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఎందుకు చేయలేకపోయారు. ప్రజల పట్ల ప్రేమ, అంకితభావం లేకనే. వాళ్లలో వాళ్లు కొట్టుకుచావడమే మనం చూశాం ఇప్పటివరకూ.. అధికారం ఇస్తే రోజూ కుమ్ములాటలు తప్ప మనల్ని పట్టించుకునే నాథుడు ఉండడు.
మనకున్న పరిపక్వత కలిగిన నాయకత్వాన్ని మనం కాపాడుకుందాం! సొంత ప్రయోజనాలు తప్ప ప్రజలను ప్రేమించే నాయకత్వం వాళ్లకు లేనందుకు ఎన్నో రాష్ర్టాల ప్రజలు మనలను చూసి అసూయపడటం నాకు తెలుసు. సాహిత్యాన్ని ఔపోసన పట్టిన పండితుడు, కవిత్వం రాయగలిగిన సున్నిత మనస్కుడు. దేనినైనా అంతుచూడగల లోతైన ఆలోచన కలిగిన అపర చాణక్యుడు. ఉక్కు గుండె గల సాహసికుడు. గంగమ్మ తల్లిని చేయి పట్టుకుని మన చేలల్ల పారించిన అపర భగీరథుడు. అన్నీ ఆయనే. ఇన్ని గుణాలు ఇముడ్చుకున్న నాయకుడు మరొకడుండడు. అతడు కేసీఆర్ ఒక్కడే! ఆ ఒక్కడూ నాయకుడవడం మన అదృష్టం. నిలబెట్టుకుందాం! గెలిపించుకుందాం!! కేసీఆర్ సార్ మీకు అండగా మేమున్నాం…
సునీత రావులపల్లి
99857 99966