పదేండ్ల కిందటి ముచ్చట. ‘గుజరాత్ మాడల్’ మేడిపండు చందం అని తెలియని రోజులవి. సందర్భం దొరికిందే తడవుగా మోదీ తన ఆలోచనా ధోరణిని ప్రజలపైకి విస్తృతంగా విసురుతున్న సమయమది. అలాంటి సన్నివేశమే ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్‌లో తటస్థించింది. గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వచ్చిన మోదీ తన చతురతను అత్యద్భుతంగా పండించిన సన్నివేశం ఇంకా యూట్యూబ్‌లో పచ్చిగానే ఉంది. ప్రసంగవశాత్ మధ్యలో ఓ సగం నీళ్లతో ఉన్న గ్లాసు చేతిలోకి అందుకున్న మోదీ తన పాటవాన్ని ఇదిగో ఇలా ప్రదర్శించారు..
దిష్టి కోణం: దశాబ్దాల పోరాటం తర్వాత నెరవేరిన తెలంగాణ ప్రజల ఆకాంక్షను మోదీ అర్థం చేసుకున్న తీరు ఆయన ఆలోచనాసరళికి అద్దం పడుతుంది. ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అని పసిగుడ్డు తెలంగాణకు దిష్టిపెట్టడం ఆయనకే చెల్లింది. మొన్నటికి మొన్న అరవై ఏండ్ల ఆకాంక్ష తీరి పదేండ్లు గడిచిన సందర్భంగా ఊరూవాడా ఘనంగా జరుపుకొన్న దశాబ్ది ఉత్సవాలు ప్రధానికి పట్టవు. అందుకే, తెలంగాణ ఏర్పాటును తేలిగ్గా తీసేస్తూ ‘ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఎవరూ సంబురాలు జరుపుకోలేద’ని తీస్రీ సోచ్ను వెళ్లగక్కారు.
‘ఏక్ చీజ్ కో దేఖ్నేఖా అలగ్ అలగ్ నజరియా హోతాహై! జో ఆశావాది హోంగీ.. జో కహేంగే.. ఆదా గ్లాస్ బరా హువా హై! జో నిరాశావాదీ హై.. వో కహేంగే ఆదా గ్లాస్ ఖాళీ హై! మిత్రో మై దో రాస్తోఁసే ఏక్ అలగ్ రాస్తాకా ఇన్సాన్ హూ! మేరీ తీస్రీ సోచ్ హై.. ఏ గ్లాస్ బరా హువాహై ఆదా పానీసే, ఆదా హవాసే!’ అని ‘ఒక వస్తువును చూడటానికి వేర్వేరు దృష్టి కోణాలుంటాయి. ఆశావహులు గ్లాస్లో సగం నీళ్లున్నాయంటారు. నిరాశావాదులు సగం ఖాళీగా ఉన్నదని చెప్తారు. నేను వేరేరకం మనిషిని. నాది మూడోరకం ఆలోచన. ‘గ్లాస్లో సగం నీళ్లున్నాయి, సగం గాలి ఉందంటాను’ అని మోదీ చెప్పగానే అంతా వహ్వా అన్నారు. హాంఫట్ అని గాల్లోంచి ఏదో తీసిస్తారని అనుకున్నారంతా. అవి గాలిమాటలని తర్వాత తేలింది.
హస్తం పార్టీ దశాబ్దికాల విఫలం.. కమల వికాసానికి ఊపిరిపోసింది. కానీ, మోదీ తీస్రీ సోచ్.. భారత్‌ను మహోన్నతంగా తీర్చిదిద్దుతుందన్న భావన అనతికాలంలోనే ఆవిరైంది. ఆయన విపరీత ఆలోచనలు ఎలాంటి విపరిణామాలకు దారితీస్తాయో ఉదాహరణలు కోకొల్లలు. ‘టు బ్రేక్ ద కరెప్షన్ అండ్ బ్లాక్ మనీ.. వి హావ్ డిసైడెడ్ లెట్ ద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ థౌజెండ్ రూపీస్ కరెన్సీ నోట్స్.. ప్రజెంట్లీ యూజ్డ్ విల్ నో లాంగర్ బి లీగల్ టెండర్ ఫ్రమ్ మిడ్నైట్ టునైట్’- అనగా ‘అవినీతికి, నల్లధనానికి కళ్లెం వేయడానికి.. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఐదు వందలు, వెయ్యి నోట్లు ఈ రోజు అర్ధరాత్రి నుంచి రద్దు చేయాలని నిర్ణయించాం’ ఫుల్స్టాప్ లేకుండా నొక్కివక్కాణించి యావత్ భారతాన్నీ రోడ్డెక్కించిన మాటలివి. ఆర్థిక మేధావులు మినహా మోదీ తీస్రీ సోచ్ను నాడు ఎవరూ తప్పుబట్టలేదు. నల్లధనం బయటపడుతుంది.. జన్‌ధన్ ఖాతాలో ఆయనగారు సెలవిచ్చినట్టు ధనాధన్ రూ.15 లక్షలు వచ్చిపడతాయ ని మురిసిపోయారు.
ఇమాన్దార్ జనాలంతా వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు చేతబూని, చెల్లని చిత్తు కాగితాలను మరో చేతి లో ఉంచుకొని రోజుల తరబడి గంటలపాటు క్యూలో నిలబడ్డారు. కానీ, ఈ తీస్రీ సోచ్ భారతదేశ ఆర్థికరంగం కుదేలు కావడానికి హేతువైందని ఆ తర్వాత అందరికీ అర్థమైంది. దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోట్లలో దాదాపు 99.30 శాతం మళ్లీ బ్యాంకు లాకర్లకు చేరిందంటే.. అంటే మోదీ తీస్రీ సోచ్ దేశంలోని నల్లధనాన్నంతా తెల్లగా మార్చేసిందనుకోవాల్సిందేనా? తర్వాత బీజేపీ ప్రేరేపిత వాట్సాప్ యూనివర్సిటీలో మాత్రం నకిలీ నోట్లను అరికట్టడానికి మోదీ మహాశయుడు పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం చేసుకున్నారు. పైగా, తీవ్రవాదుల దగ్గర నకిలీ పెద్దనోట్లు కట్టలకు కట్టలు పోగయ్యాయన్న కారణంగానే రద్దు చేసినట్టు పలువురు మోదీ భక్తులు ప్రకటించడం గమనార్హం. అదే నిజమైతే పెద్దనోట్ల రద్దుకు ముందురోజు పొద్దు ఈ విషయం ఎందుకు తేటపరచలేదో ప్రధాని ఆలోచనకే వదిలేద్దాం!!
ప్రధాని ఆలోచనాసరళి ఎంత చిత్రంగా ఉంటుందంటే.. 2019 ఎన్నికల వేళ పాక్‌పై కయ్యానికి కాలు దువ్వినంత పనిచేసిన సంగతి తెలిసిందే! దేశ రక్షణ విషయంలో ఆయన చూపిన తెగువను ప్రశంసించాల్సిందే!! అయితే, 2015లో కాబూల్ నుంచి భారత్‌కు తిరిగి వస్తూ చడీచప్పుడు లేకుండా లాహోర్‌లో దిగి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలవడం ఎందుకో అర్థం కాదు! కశ్మీర్ వేర్పాటువాదులతో సమావేశమయ్యారన్న కారణంగా అధికారుల స్థాయిలోనే శాంతిచర్చలకు కామా పెట్టిన సంగతి తెలిసిందే! తీవ్రవాదాన్ని ప్రోత్సహించినంత కాలం పాక్‌తో చర్చల ప్రసక్తే లేదని అప్పటి విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ పలుమార్లు పేర్కొన్నారు కూడా! పాకిస్థాన్ కశ్మీర్ విషయంలో మనసు మార్చుకున్నామని ప్రకటించకముందే, ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు సిద్ధమని పేర్కొనకముందే మోదీ లాహోర్‌లో సడన్‌గా ల్యాండయ్యారు. నవాజ్ షరీఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఉభయ దేశాల మధ్య వాతావరణం ఏమైనా మారిందా అంటే.. పుల్వామా ఉదంతంలో సమాధానం దొరుకుతుంది!
ప్రజాప్రతినిధుల యోచనను అనుసరించే యోజనలుంటాయి. ఉపాధి కల్పన విషయంలో మన ప్రియతమ ప్రధాని ఆలోచన ఎంత ఉన్నతంగా ఉంటుందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. ‘అగర్ ఆప్కే స్టూడియోకే బాహర్ కోయి పకోడీ బేజ్తా హై. ఔర్ శ్యామ్ కో దోసౌ రూపయ్ కమాకే.. ఘర్ జాతా హై! ఉస్ వ్యక్తీ కో ఆప్ రోజ్‌గార్ మానోగీ కీ నహీ మానోగీ’- ‘మీ స్టూడియో బయట ఒక వ్యక్తి పకోడీ అమ్ముతున్నాడు! సాయంత్రానికి రెండువందల రూపాయలు సంపాందించి ఇంటికి తీసుకెళ్తున్నాడే అనుకుందాం! ఆ వ్యక్తిని మీరు ఉద్యోగిగా అంగీకరిస్తారా, లేదా..’ అని సగర్వంగా పేర్కొన్నారు ప్రధాని. స్వయం ప్రతిపత్తితో, చెమటోడ్చి రోజుకు రెండువందలు సంపాదించే వ్యక్తికి ప్రభుత్వం ఏ రూపంలో ఉపాధి కల్పించిందో ప్రధానే చెప్పాలి! తీస్రీ సోచ్ ఇలాగే ఉంటుంది మరి!!
ఒకటేమిటి.. రైతు చట్టాలు మోదీ సాబ్ తీస్రీ సోచ్ రూపాంతరం. రైతన్నకు గిట్టుబాటు ధర ప్రకటించే ధైర్యం లేని కేంద్రం.. ఎల్లలు దాటుకొని అమ్ముకోవాలంటూ రైతుల నోట మట్టికొట్టి, కార్పొరేట్లకు కొమ్ముకాసిన వైనం మోదీ యోచనే! దేశ రాజధాని శివారులో చలికి గజగజా వణికిపోతూ దీక్ష చేసిన రైతులను తీవ్రవాదులుగా తలచిన వైఖరి కూడా ఆయనకే సొంతం. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయానికి భారతీయులు బాటలు పరచాలని ప్రకటించడమూ తీస్రీ సోచ్ ఓన్లీ! తరచి చూస్తే.. ఆయనగారి తీస్రీ సోచ్లన్నిటినీ తూచ్ అనక తప్పదు!
కొసమెరుపు: కెమెరాకు ఫోజివ్వడంలో ఆయన ఆలోచన పక్కాగా ఉంటుంది. పరమేశ్వరుడికి హారతి ఇస్తూ కెమెరా వంక చూడగల సమర్థులు. విదేశీ పర్యటనలకు వెళ్తూ బండెడు దస్ర్తాలు మోసుకెళ్లడమూ తీస్రీ సోచ్‌లో భాగమే! ఆయన పనితీరుకు జోహార్లు చెప్పొచ్చు. కానీ, ఆ దృశ్యాన్ని చిత్తరువు తీసుకొని ట్విట్టర్లో పోస్టు చేయడమే విచిత్రం. అంతా తీస్రీ సోచ్!!
కణ్వస