ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చాలామంది పేద విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీంతో వారు వయసుకు తగ్గ బరువు, ఎత్తు పెరగటం లేదు. వారిలో చాలామంది ఉదయం పూట ఇంట్లో తినడానికి ఏం లేక ఖాళీ కడుపుతో స్కూలుకు వస్తారు. వారు ఉదయం ప్రార్థన సమయంలో కండ్లు తిరిగి పడిపోతుంటారు.
ఆకలితో వచ్చే పిల్లలు పాఠాలు చెప్తున్నపుడు చదువుమీద సరైన శ్రద్ధపెట్టలేకపోతున్నారు. ఆకలితో మధ్యాహ్నం భోజనం ఎప్పుడు పెడుతారా అని ఎదురు చూస్తుంటారు. ఇవన్నీ ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు విద్యార్థులను అడిగినప్పుడు వెల్లడైన అంశాలు. ఈ సమస్యలన్నింటికి గుడ్‌బై చెప్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకోసం ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ కార్యక్రమాన్ని తీసుకు వచ్చింది.
ఆకలనేది చాలా వ్యక్తిగత విషయం. స్వయంగా భరించడమే తప్ప బహిరంగంగా ఎవరికీ చెప్పుకునే సమస్య కాదు. అందుకే ఎవరు ఆకలితో ఉన్నారు ఎవరికి ఆకలి లేదు అని పిల్లల హాజరు తీసుకునేటప్పుడు కానీ ప్రార్థన సమయంలో కానీ బయటపడే అవకాశం లేదు. యూనిఫాం వేసుకు రాని వాళ్లను గుర్తించవచ్చు. హోమ్‌వర్క్ చేయని వారిని గుర్తించవచ్చు కానీ ఆకలితో ఉన్న పిల్లలను గుర్తించే పద్ధతి ఏ బడిలోనూ లేదు. నగరంలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం క్యాంటీన్ల నుంచి స్కూలుకు ఉదయమే సరఫరా చేస్తారు.
దీంతో ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ తన పిల్లలు కొందరు ఉదయం ఏం తినకుండా వస్తున్నారని గమనించి బ్యాచ్‌ల వారిగా భోజనం ఉన్న గదిలోకి పిల్లల్ని పంపి వారి ఆకలి తీరుస్తున్నాడు. పిల్లల ఆకలి తీర్చేందుకు మరోమార్గం లేక ఆయన చేసే పనిని ఎవరూ తప్పుపట్టలేరు. అయితే సీఎం అల్పాహర పథకం ప్రకటించగానే చాలా సంతోషించిన వారిలో ఆ ఉపాధ్యాయుడు ఒకరు. ప్రకటన వెలుపడగానే వాట్సప్‌లో ‘హమ్మయ్య ఇన్ని రోజులు నా పిల్లలు ఎదో తప్పు చేస్తున్న వారిలా దాక్కొని తినేవాళ్ళు. ఇప్పుడు ఈ పథకంతో దర్జాగా తిని గౌరవంగా తరగతి గదిలో కూర్చుంటారని’ ఆనందం వ్యక్తం చేశాడు.
ఇలా ఎంతోమంది ఉపాధ్యాయులు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు. ‘రెక్కల కష్టం నమ్ముకుని పొద్దున్నే పనికి పోయే శ్రమ జీవుల పిల్లలకు బడుల్లో ప్రభుత్వమే అల్పాహారం అందించటాన్ని వారు అభినందిస్తున్నారు.
రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో జీవించే హక్కు, గౌరవప్రదమైన జీవనం కొనసాగించటం, పౌరులందరూ సమానత్వంతో ఉండడానికి పౌష్టికాహారం అందించడం ప్రభుత్వాల బాధ్యతగా మన రాజ్యాంగం నిర్దేశించింది. అంతే కాకుండా ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కులు, బాలల హక్కుల ఒడంబడికలకు భారతదేశం ఆమోదం తెలిపి, ఆకలిని దూరం చేస్తామని హామీనిచ్చింది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం పౌరుల, పిల్లల ఆకలిని రూపుమాపే బాధ్యత ప్రభుత్వాలదేనని మధ్యంతర ఉత్తర్వులను ఇస్తూ ప్రభుత్వాలకు నిర్దేశాలిచ్చింది. అందులో ముఖ్యమైన కేసు పీయుసీఎల్ వేసిన ప్రజా ప్రయోజన వాంగ్మూలంపై ఇచ్చిన తీర్పు . ఆ తీర్పు పర్యవసానమే 2013లో వచ్చిన ‘ఆహార భద్రత చట్టం’ ఈ చట్టం వచ్చి పదేండ్లు గడిచినా ఒకట్రెండు రాష్ర్టాలు మినహాయిస్తే ఏ ఒక్క రాష్ర్టానికి బడుల్లో అల్పాహారం పెట్టాలనే ఆలోచన రాకపోవడం విచారకరం.
పట్టణ ప్రాంతాల్లో బస్తీల నుంచి వచ్చే పిల్లల తల్లిదండ్రులు చాలామంది జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తుంటారు. వారు తెల్లవారక ముందే రోడ్లు ఊడవటానికి వెళ్లి పని నుంచి పదకొండు, పన్నెండు గంటలకు ఇంటికి వచ్చి అప్పుడు పొయ్యి రాజేస్తారు. దీంతో ఆ కుటుంబాల్లో పిల్లలు ఏం తినకుండానే బడులకు వస్తుంటారు. అందువల్ల వారు చదువు మీద పెద్దగా శ్రద్ధ పెట్టటం లేదని తేలింది. మరికొన్ని ఇండ్లలో ఇంటి పనులన్నీ పెద్ద పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల మీద పడి వారు బడికి రెగ్యులర్‌గా రాలేకపోవడమో, లేదంటే బడి మానివేయటమో జరుగుతున్నది. తిని వచ్చే పిల్లల్లో కూడా వారు తీసుకుంటున్న ఆహారంలో పౌష్టిక ఆహారం చాలా తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ఆహార హక్కును అల్పాహార రూపంలో విద్యార్థులకు అందించడం చాలా గర్వించదగ్గ విషయం. ఈ పథకాన్ని ఇంటర్ వరకు పొడిగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇంటర్ విద్యార్థుల్లో చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి పొద్దున్నే ఏం తినకుండా కాలేజీలకు వస్తుంటారు. అందుకే కనీసం ప్రభుత్వం కాలేజీలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకైనా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తల్లిదండ్రులు కోరుతున్నారు.
దేశంలోనే అత్యధిక గురుకుల పాఠశాలలు ఉన్నా రాష్ట్రంలో అల్పాహారం మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా పెడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం దేశమంతా కేవలం 8వ తరగతి వరకు మాత్రమే మధ్యాహ్న భోజనం అందిస్తుండగా, మన రాష్ట్రంలో సొంత నిధులతో పదవతరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నది. దీన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా పొడిగించాలి. ఈ వయసు పిల్లలకు పౌష్టికాహారం చాలా అవసరం. విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు స్కూల్లో మౌలిక వసతులు కల్పించడం విద్యా వ్యవస్థ పటిష్టతకు చాలా ముఖ్యం. అదే సమయంలో ఈ పనుల పర్యవేక్షణ వల్ల తరగతులు బోధించే సమయం తగ్గుతుందన్న భావన చాలామందిలో ఉంది. కనుక తమిళనాడులో మాదిరిగా మధ్యాహ్న భోజనం అందించే ప్రక్రియకు ప్రత్యేక డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేయాలి.
రాజకీయ లబ్ధికోసమే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇలాంటి పథకాన్ని తెచ్చిందని కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మంచి నిర్ణయాల వల్ల లక్షలాది మందికి పౌష్టికాహారం అందుతున్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే కానీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
(వ్యాసకర్త : ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్)
ఆర్ వెంకట్ రెడ్డి
99498 65516