ఆమరణ నిరాహార దీక్షతో చావు అంచుల దాకా వెళ్లి, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన్రు కేసీఆర్. అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు రెండు పర్యాయాలు అధికారం ఇచ్చారు. ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలకనుగుణంగా ఈ తొమ్మిదిన్నరేండ్లలో రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శవంతంగా నిలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధ్ది సమపాళ్లలో ఒకే పర్యాయం జరుగుతుండటం గమనార్హం.
2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1 లక్షా 14 వేలు ఉంటే ప్రస్తుతం రూ.3 లక్షల 17 వేలకు పురోగతి సాధించింది. అంటే ఈ తొమ్మిదిన్నరేండ్లలో మూడు రెట్లు పెరిగింది. ఇది దేశంలోనే అగ్రస్థాయి అభివృద్ధి అని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా వృద్ధిరేటులో కూడా దేశంలో అగ్రభాగాన ఉన్న మొదటి ఐదు రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటిగా ఉన్నది. వ్యాపార, పారిశ్రామిక రంగానికి చెందిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం దేశంలో రెండవ స్థానంలో ఉన్నది. ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం 400 శాతం అభివృద్ధి చెందడం విశేషం.
రాష్ట్ర సాధన సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే విద్యుత్తు, నీటి కొరతలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతారని ఎగతాళి చేశారు. 2014లో తెలంగాణలో విద్యుత్తు ఉత్పత్తి 7 వేల మెగావాట్లు ఉంటే ప్రస్తుతం 23 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్నది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి, గృహావసరాలకు 24 గంటలు విద్యుత్తు సరఫరా అవుతున్నది. ఇది నిజంగా గొప్ప పరిణామం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో క్రాప్ హాలీడేలు లేవు. అదేవిధంగా పారిశ్రామిక రంగానికి, గృహావసరాలకు ఎక్కడా విద్యుత్తు కోతలు లేవు. 2014లో వరి 68 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగేది. ప్రస్తుతం 3 లక్షల 50 వేల టన్నుల ఉత్పత్తి జరుగుతున్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలో వేలాది చెరువులకు పూడికలు తీసి జలకళ సృష్టించింది. రాష్ట్రమంతా కొత్తగా వేలాది వాటర్‌ట్యాంకులు నిర్మించింది. మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ ప్రభుత్వం ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటి వసతి కల్పించింది. భూ సమస్యల పరిష్కారానికి ధరణిని తీసుకొచ్చింది. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో కలిపి 24 లక్షల ఉద్యోగ నియామకాలు జరిగాయి. గతంలో ఉన్న ఐదు మెడికల్ కాలేజీలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇరువై ఒకటి మెడికల్ కాలేజీలను కొత్తగా ఏర్పాటు చేసింది. బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ వందలాది గురుకుల పాఠశాలలు నిర్మించింది. ప్రతి జిల్లా కేంద్రంలో నూతన పాలన భవనాలను నిర్మించింది. యాదాద్రి నిర్మాణం, అంబేద్కర్ సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్తూపం వంటి నిర్మాణాలు రాష్ర్టానికి తలమానికంగా నిలుస్తున్నాయి.
రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, బీసీబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, కంటివెలుగు, కేసీఆర్ కిట్టు, ఆరోగ్యలక్ష్మి లాంటి అనేక సంచలనాత్మక సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శవంతంగా నిలుస్తున్నాయి. ఇక రానున్న కాలంలో రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాల్లో మనిషి ఎలా మరణించినా ఆ వ్యక్తి కుటుంబానికి తక్షణమే రూ. 5 లక్షల కేసీఆర్ బీమా భరోసా, తెల్లరేషన్ కార్డుదారులకు, జర్నలిస్టులకు రూ.400లకే గ్యాస్ సిలిండర్, అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం ఇవ్వడం, ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.15 లక్షలకు పెంచడం, ఆసరా పింఛన్ల పెంపుదల, మహిళలకు సౌభాగ్యలక్ష్మి వంటివి అమలు జరిగితే కేసీఆర్ కీర్తి ప్రతిష్టలు అంబరాన్నంటుతాయనడంలో అతిశయోక్తిలేదు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
కైలసాని శివప్రసాద్
94402 03999