Startup | ‘ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని’ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘంటాపథంగా చెప్పినమాట అక్షరాల నిజం. ఆ దిశగానే అంకుర సంస్థలకు అనుకూల వాతావరణం నెలకొల్పడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి.
అంకురసంస్థలు స్థాపించడానికి బలమైన లక్ష్యం, కోరిక, సాధించాలనే పట్టుదలతో ముందుకువస్తున్న యువతకు ‘టీ-హబ్’ తోడునీడగా నిలుస్తున్నది. అందుకే ఇప్పటివరకు రాష్ట్రంలో 6,660 అంకురసంస్థల నమోదు విజయవంతమైంది. హైదరాబాద్ నగ రం ఇప్పుడు స్టార్టప్ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రక్రియతో ఆలస్యానికి, అలసత్వానికి తావులేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాన నిర్ణయాలు తీసుకుంటూ, నిబంధనలను సులభతరం చేస్తూ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నది.
అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి ఇందుకు భిన్నంగా ఉన్నది. గత మూడు నెలలు గా కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) అంకురసంస్థలు స్థాపించాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు చుక్కలు చూపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ వైఖరి వినూత్న ఆలోచనలతో, ఆవిష్కారాలతో ముందుకువస్తు న్న యువతకు ఆదిలోనే హంసపాదులా తయారైంది. కంపెనీ, పరిమిత బాధ్యత భాగస్వామ్య సంస్థల (ఎల్ఎల్పీ) నమోదు ప్రక్రియ గత మూడు నెలలుగా నత్తనడకన సాగుతూ ఆలస్యానికి దారితీస్తున్నది.
కంపెనీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఎంసీఏ 21 పోర్టల్ ద్వారా నూతనంగా ప్రారంభించబోయే సంస్థల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. నూతనంగా ప్రారంభించిన 3 పోర్టల్స్‌లో సవరించిన దరఖాస్తులను పొందుపరిచారు. డేటా విశ్లేషణకు, మెరుగైన సేవలందించడానికి ఉద్దేశించిన మార్పులు జరిగినప్పటి నుంచి వేల సంఖ్యలో స్టార్టప్‌ల నమోదు ప్రక్రి య నిలిచిపోయింది. పూర్తిచేసిన దరఖాస్తులు అప్లోడ్ చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, పారిశ్రామికవేత్తలు అనేక సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ప్రారంభ దశలో తలెత్తిన ఈ సాంకేతిక సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని అధికారులు చెప్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నది. చివరికి ఈ విషయా న్ని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర మంత్రిత్వశాఖ దృష్టికి అభ్యర్థులు ఈ మెయిల్స్ రూపంలో అనేక పర్యాయాలు తీసుకెళ్లారు. అయినా నేటికీ తగిన చర్యలు తీసుకోలేదు. మరోవైపు స్టార్టప్-20 ఇండియా సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంకుర సంస్థ ల కోసం కేంద్రం ఎన్నో విధానపరమైన నిర్ణయా లు తీసుకుంటున్నదని సభాముఖంగా వెల్లడించారు. తొలుత వాటిని ప్రారంభించే ప్రక్రియ వేగవంతం చేయాలనే విషయాన్ని మంత్రి మరిచిపోవడం విడ్డూరం.
పారిశ్రామికవేత్తలను అన్నివిధాలా ప్రోత్సహిస్తూ చేయూతనందించడంలో తెలంగాణ ప్రభుత్వం అధికారులను పరుగులెత్తిస్తుంటే, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతున్నది. ఈ విషయంలో దేశవ్యాప్తంగా లాయర్లు, కంపెనీ సెక్రటరీలు, చార్టెడ్ అకౌంటెంట్లు, చివరికి ఎంపీలు కూడా కంపెనీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు అనేక విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం శూన్యం.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పం దించాలి. స్పెషల్ టీం సభ్యులను ఏర్పాటుచేసి, త్వరితగతిన రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి. యువ వ్యా పారవేత్తలకు, పారిశ్రామికులకు విశ్వాసం కలిగిస్తేనే ‘మేక్ ఇన్ ఇండియా’ ఆశయం నెరవేరుతుందనే విషయాన్ని కేంద్రం గుర్తించాలి.
-ఆర్ సీ కుమార్
(పూర్వ అధికారి, రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థ)