బాల సాహిత్యం ఎప్పుడు వచ్చిందని పరిశీలిస్తే కాలాన్ని ఇదమిత్థంగా లెక్కించడం కష్టమే. రామాయణ, మహాభారత కాలంలోనూ బాలసాహిత్య ప్రక్రియలు ఉన్నట్టు చరిత్ర తెలుపుతున్నది. పంచతంత్రంలోని మొదటి కథలో ఒక గురువు దక్షిణ భారతదేశంలోని గోదావరి తీరాన శిష్యులకు బోధించాడని ఉన్నది. ఆ గోదావరి తీరం మన దగ్గరే ఉన్నది కాబట్టి బాల సాహిత్యం తెలంగాణలోనే మొదటగా పుట్టిందని చెప్పవచ్చు. రుద్రమదేవి తన మనుమడైన ప్రతాప రుద్రునికి బాల సాహిత్యం నేర్పించినందువల్లనే గొప్ప రాజు అయ్యాడని ఆధారాలు తెలుపుతున్నాయి.
బాల సాహిత్యరంగంలో రోజురోజుకు పరిస్థితులు మారుతున్నాయి. మూస పద్ధతిలో రాజులు, దెయ్యాలు, జంతువుల కథలను చెప్తే వినే పరిస్థితుల్లో పిల్లలు లేరు. కంప్యూటర్, సెల్ఫోన్ తదితర సాంకేతిక పరికరాలు పిల్లల ఆలోచనా విధానాన్ని శరవేగంగా మారుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాలల సాహిత్యం కూడా మారాలి. పిల్లల కోసం పెద్దలు రాసే ఆలోచనా సరళి కూడా మార్చుకోవాలి. బాల బాలికల్లో మానసిక పరిణతిని పెంపొందించే స్థాయిలో నేటి తరానికి తగ్గట్టుగా బాల సాహిత్యం రావాలి. పిల్లల హృదయాలను తాకే సాహిత్యాన్ని అందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. గతంలో కంటే ఇప్పుడు విస్తృత స్థాయిలో బాల సాహిత్యం బయటకు వస్తున్న మాట వాస్తవమే. కానీ, పిల్లల ప్రపంచం చాలా పెద్దది. పిల్లల కోసం బాల సాహిత్యం ఎలా ఉండాలి? అనే ఆలోచనా ధోరణి విస్తృతం కావాలి. పిల్లల తరగతి, వారి మానసిక, శారీరక పరిస్థితులు, అవగాహన స్థాయులను పరిగణలోకి తీసుకొని వారిలో జ్ఞానాన్ని పెంచేవిధంగా రచనలు సాగాలి. పిల్లలు పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాల సాహిత్యంలో పలు ప్రక్రియలకు బొమ్మలు కూడా ఉండాలి. కథలు తక్కువ నిడివి కలిగి ఉండాలి.
సమాజంలో నేడు బాల సాహిత్య విలువలు లేకపోవడం వల్లే పిల్లలు సంకుచిత భావాలకు లోనై సమస్యలుగా మారుతున్నారు. కుటుంబ అనుబంధాలు, మనుషుల మధ్య సంబంధాలు అడుగంటిపోతున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా దేశంలోని స్కూళ్లలో పిల్లలు కథల పుస్తకాలు చదవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ, మన దేశంలోని పాఠశాలల్లో పిల్లలు కథల పుస్తకాలను చింపేస్తున్నారని వారికి పుస్తకాలు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు. దయ, కరుణ, ప్రేమ, స్నేహం, కలివిడి స్వభావం, సమానత్వ భావన, ధైర్యం, నిజాయితీ లాంటి మౌలిక భావనలు కథల ద్వారా తెలుస్తాయి. చెడు ఓడిపోతుందని, ధర్మమే గెలుస్తుందనే విషయం పిల్లలకు బోధపడుతుంది. బాల సాహిత్యం వల్ల పిల్లలలో విలువలే కాకుండా, తార్కికశక్తి, ఊహాజనిత శక్తి, శ్రవణ శక్తి, పఠన నైపుణ్యం కలుగుతాయి. నేటితరం పిల్లల్లో ఉన్న అనేక మానసిక రుగ్మతలకు బాల సాహిత్యం సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. ఇదంతా మాతృభాష ద్వారానే సాధ్యమవుతుందని ప్రముఖ భాషావేత్త నోమ్ చోమ్ స్కీ చెప్పిన విషయం గుర్తుకుతెచ్చుకోవాలి.
బాల సాహిత్యం విషయానికి వస్తే.. దీన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదట మౌఖిక/లిఖిత విభజన ఉన్నప్పటికీ , సాధారణంగా పిల్లల కోసం పెద్దలు రాసేది ఒకటైతే, రెండోది పిల్లలే తమ కోసం తాము రాసుకునేది. విద్య అనేది ఒక జ్ఞాన స్రవంతి. విద్య ద్వారానే విజ్ఞానం సాధ్యమవుతుంది. అందుకే ప్రతీ ప్రక్రియకు, ప్రతీ సందర్భానికి, ప్రతీ పరిణామానికి గురుశిష్యులే మూలస్తంభాలు. ఈ దిశగా మనం ఆలోచించినప్పుడు అసలు బాలలంటే ఎవరు? పాఠశాలలు బాల సాహిత్యానికి ఏ విధంగా వేదికలుగా దోహద పడుతున్నాయి? అందులో ఉపాధ్యాయుల పాత్ర ఏ విధంగా ఉంటుందన్న విషయం పరిశీలించినట్లయితే ధారణ శక్తి, గ్రహణ శక్తి ఉన్న 18 ఏండ్ల లోపు పిల్లలందరినీ బాలలుగా పరిగణించవచ్చు. అలాంటి బాలలు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో, సాన్నిత్యంలో అధ్యయనం చేస్తారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను ఉపాధ్యాయులు వెలికి తీసేవారు. ప్రతి విద్యార్థిలో ప్రతిభా వ్యుత్పత్తులు దాగి ఉంటాయి. వాళ్లలో దాగి ఉన్న అంతర్గత శక్తులను ఉపాధ్యాయులు వెలికి తీయగలగాలి. తగిన అవకాశం కల్పించి విద్యార్థుల్లో ఉండే సృజన నైపుణ్యాన్ని తట్టిలేపాలి.
తరగతి గదిలో ఉన్న విద్యార్థులందరూ బాలసాహిత్యం రాస్తారని కాదు, వారికి నచ్చిన ప్రక్రియలో రాణించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలి. అందరూ రాస్తారనేది దురాశ. ఎవరూ రాయరనేది నిరాశే. కాబట్టి పిల్లల అభిరుచిని బట్టి ఉపాధ్యాయులు మార్గదర్శనం చేస్తూ ఉండాలె. బాల సాహిత్య వికాసానికి పాఠశాలలే ముఖ్యమైన కేంద్రాలుగా మారాలి. అప్పుడే బాల సాహిత్యం పట్ల బాలలకు అభిరుచి కలుగుతుంది. తద్వారా మంచి విలువలతో కూడిన సమాజం భవిష్యత్తులో ఆవిష్కృతమవుతుంది. ఆ దిశగా అడుగులు పడాలని ఆశిద్దాం.
– (వ్యాసకర్త: బాలల కథా రచయిత) కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి 9441561655