వెనకటికి ఓ ప్రబుద్ధుడు.. పంచ పాండవులు ఎందరంటే మంచం కోళ్ల వలె ముగ్గురు అని చెప్పి, రెండు వేళ్లు చూపించి, ఒకటి అంకె రాశాడట. ప్రస్తుత తెలంగాణ పాలకులు అదే చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పింది కొండంత. గెలిచి గద్దెనెక్కాక చేస్తున్నది గోరంత. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అడుగడుగునా ఎదురవుతున్నవి వంచనలు, వక్ర భాష్యాలే.
ఇచ్చిన హామీలకు వరుసగా ఎగనామాలు పెట్టుకుంటూ ఇదేమిటని అడిగితే దగాకోరు మాటలకు, దబాయింపులకు పాల్పడుతున్న పాలకులు ఇప్పుడు ఏకంగా ఉద్యోగులపై, పెన్షనర్లపై విరుచుకుపడుతున్నారు. వారంతా తెలంగాణ సాధనోద్యమంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని తెగించి పోరాడిన వీరసైనికులన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ప్రజలకు ఉద్యోగులకు మధ్య విభేదాలు సృష్టించే కపట నాటకానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ఓ సమావేశంలో ప్రసంగిస్తూ ఉద్యోగులకు, పెన్షనర్లకు న్యాయంగా చెల్లించాల్సిన భత్యాలు, బకాయిల విషయంలో చేతులెత్తేశారు. పైగా ‘రాష్ట్ర ఆదాయం ఇంత. అవుతున్న ఖర్చు ఇంత. నన్నేం చేయమంటారు, నన్ను కోసుకొని తింటరా?’ అని ప్రశ్నించారు. ఈ మెట్ట వేదాంతం వినడానికేనా ప్రజలు ఎన్నుకున్నది. గంగ దాటే దాకా ఓడ మల్లన్న గట్టు పైకెక్కాక బోడి మల్లన్న అన్నట్లు ఎన్నికలకు ముందు ఉద్యోగులను, పెన్షనర్లను కల్లబొల్లి వాగ్దానాలతో బులిపించిన నాటి పీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆ ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా కమిటీల మీద కమిటీలు వేస్తూ ఏమీ తేల్చకుండా కాలయాపన చేస్తున్నా సహనంతో తమ బాధ్యతలు నిర్వర్తిస్తూనే సామరస్య వాతావరణంలో తమకు న్యాయంగా రావాల్సిన వాటిని చెల్లించాలని అభ్యర్థించడమే ప్రభుత్వం దృష్టిలో మహాపరాధమా? అది ప్రజలపై యుద్ధమా? ఇదెక్కడి న్యాయం?
‘జీతాలు పెంచాలంటే, పెన్షన్లు బకాయిలు చెల్లించాలంటే.. ఉప్పు, పప్పు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్నా? లేక రైతుభరోసా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, సామాజిక పెన్షన్లు తగ్గించాల్నా?’ అంటూ ఉద్యోగులను సీఎం ప్రశ్నించారు. ఇవి అసమంజసమైన, అత్యంత ప్రమాదకరమైన ప్రశ్నలు. ఉద్యోగులు, పెన్షనర్లకు.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు, ప్రజలకు మధ్య అగాధం సృష్టించే ఎత్తుగడలు. ఎన్నికలకు ముందు ఇవే షరతులను ముందుంచి ఉద్యోగులను, పెన్షనర్లను ఓట్లు అడిగి ఉంటే ఇప్పుడు ప్రభుత్వానికి అలా ప్రశ్నించే నైతిక హక్కు ఉండేది.
ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమేనని.. ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదని ముఖ్యమంత్రి అన్నారు. నిజమే. ప్రభుత్వాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు ఒక మెట్టు దిగిన సందర్భాలు, కొంత అటూఇటూ అయినా సర్దుకుపోయిన సందర్భాలెన్నో. ప్రభుత్వం తమదేనని ఉద్యోగులు అనుకున్నారు కాబట్టే అది సాధ్యమైంది. అలాగని తమ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, హక్కులకు భంగం కలుగుతుంటే ఉద్యోగులు చేతులు ముడుచుకుని కూర్చోరని చరిత్ర చెప్తున్నది.
వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన పాలకులు బీద అరుపులతో బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. గత ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం ఇంకెంత కాలం? అందాలంటూ, విందులంటూ పనికిమాలిన కార్యక్రమాలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. ఉద్యోగులు, పెన్షనర్ల దగ్గరకు వచ్చేసరికి ఖాళీ జోలె చూపించడం నయవంచనే. సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు కూడా కరువు భత్యం ఎగ్గొట్టడానికి, ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొట్టడానికి విఫలయత్నం చేశారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఆయన ఆలోచనా విధానంతోనే కొనసాగుతున్నట్టు అనిపిస్తున్నది.
కేసీఆర్ హయాంలో పదేండ్ల పాటు వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలయ్యాయి. వాటిని బూచిగా చూపి నాటి ప్రభుత్వం జీతభత్యాలకు గండి కొట్టలేదు. పరిపాలించలేని చేతగానితనం, పలుచబడిపోతున్న పరపతి వల్ల పుట్టుకొస్తున్న ఉక్రోషాన్ని ఉద్యోగులపై, పెన్షనర్లపై వెళ్లగక్కడం ముమ్మాటికీ వైఫల్యమే.
ముందుచూపు, ప్రాధాన్యాల ఎంపిక, పాలనా నైపుణ్యం ఉంటే ఉద్యోగులు, పెన్షనర్లకు మొత్తంగా లేదా కనీసం వాయిదాల ప్రకారం చెల్లింపులు జరపడం కష్టమేమీ కాదు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 43 శాతం ఫిట్మెంట్, రిటైర్మెంట్ వయో పరిమితి పెంపు, ఇంక్రిమెంట్ ఇచ్చి ప్రభుత్వరంగ సంస్థలకు పరిపుష్టి కల్పించిన పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్.. రెండేండ్ల పాటు కరోనా సంక్షోభంలోనూ యథావిధిగా జీతభత్యాలు చెల్లించారు. కరోనా అనంతర కాలంలో వేతనాలు, పెన్షన్లు చెల్లించేందుకు వారం, పది రోజుల పాటు ఆలస్యమైతేనే గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా ఎగనామం పెట్టే పనిలో ఉన్నట్టు అనుమానం కలుగుతున్నది. అందుకు ధరల పెంపు, పథకాల కుదింపు బెదిరింపులను ముందుంచి వాటి వెనకనక్కి దాక్కోవాలని ప్రయత్నిస్తున్నది. రక్షించాల్సిన కంచే చేను మేయాలని చూస్తున్నది.