గంటమో చేతిలోది ముల్లుగఱ్ఱయొ?
నిల్కడ ఇంటిలోననో పంటపొలానో?
చేయునది పద్యమో సేద్యమో?
మంచమందు గూర్చుంటివో మంచయందో?
కవివో గడిదేరిన కర్షకుండవో?
రెంటికి చాలియుంటివి సరే కలమా హలమా ప్రియంబగున్!
ఓ వైపు సాధారణ రైతులా సేద్యం చేసుకుంటూనే.. మరోవైపు తెలుగు వరి మడిలో అక్షర సేద్యాన్ని చేసి విష్ణు కథలను పండించాడు బమ్మెర పోతన. ‘సత్కవుల్ హాలికులైననేమి?’ అని గర్వంగా చాటాడు. ఆయనను ఓ కవి అత్యంత ప్రేమాభిమానాలతో ‘అయ్యా పోతనా.. నువ్వు కవివా.. కర్షకుడివా? మీకు పద్యమిష్టమా లేక సేద్యమా? అని ఓ పద్యం ద్వారా పై విధంగా ప్రశ్నించాడు. ఈ పద్యం ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్కు సైతం సరిపోలుతుంది. స్వతహాగా కర్షకుడైన కేసీఆర్, రైతుల కష్టాలను కడతేర్చేందుకు ‘నాయకుడై’ బయలుదేరి నాలుగు కోట్ల ప్రజలు కలులుగన్న తెలంగాణను చావుకెదురేగి సాధించి తెచ్చారు.
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో సాకారమైన స్వరాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టి ఆ నినాదాన్ని సాకారం చేశారు సీఎం కేసీఆర్. దుక్కి దున్నింది మొద లు పంటను అమ్ముకునేదాకా ఓ రైతు పడే బాధలను కండ్లరా చూశారాయన. వాటిని పోగొట్టేందుకు పుష్కలంగా కరెంటు, సాగునీటి వసతిని అందుబాటులోకి తెచ్చి, పెట్టుబడి సాయం, పంట కొనుగోలుకు ఏర్పాట్లు చేశారు. ఎరువులు, పురుగుమందులకు గోస లేకుండా చేశారు. దేశానికే వెన్నెముకలా నిలిచే కర్షకుడు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు వెన్నుదన్నై నిలిచా రు. ఏకారణం చేతనైనా రైతు చనిపోతే అతడి కుటుం బానికి బీమాతో ధీమానిచ్చారు.
సామాజిక రుగ్మతలకు అక్షర రూపమిచ్చి చైతన్యం రగిలించేవాడే కవి. అలాంటి కవి హృదయం ఉన్నవాడు కేసీఆర్.. ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని.. వివక్షను వెలికితీసి.. ఉద్యమంలో ప్రజలను చైతన్యం చేసేందుకు స్వయం గా కేసీఆర్ పాటలు కూడా రాశారు. ‘ఎనకముందు చూసుడేంది రాజన్న ఓ రాజన్న’.. ‘గారడి చేస్తుండ్రు.. గడబిడ చేస్తుండ్రు’ పాటల ద్వారా ఉద్యమానికి ఊపిరులూదారు. సాహితీ పిపాస ఉన్న కేసీఆర్ ఉపన్యాసం కూడా ఎంతో ప్రాసతో కూడుకున్నదై వినసొంపైన అచ్చమైన తెలంగాణ పదాలతో ఉంటుంది.
క్షేత్రంలో దుక్కి దున్నింది మొదలు పంట చేతికొచ్చేదాకా అన్నదాత ఎంతో ప్రణాళికతో ‘కృషి’ చేస్తాడు. మొక్క మొలిచింది మొదలు మానై దిగుబడులను ఇచ్చే దాకా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఏ చిన్న పీడ వచ్చినా అల్లాడి పోయి.. దాన్ని వదిలించే దాకా విశ్రమించడు. స్వయంగా శాస్త్రవేత్త అయిన రైతు, తన పొలంలోనే ఎన్నో ప్రయోగాలు చేసి సత్ఫలితాలు పొందుతాడు. అచ్చం ఇలానే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అనే క్షేత్రంలో ఓ కర్షకుడిలా పాలనా సేద్యం చేస్తున్నారు. తీరొక్క పంటలైన అన్ని వర్గాల ప్రజల బాగుకోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పేదలు, అభాగ్యులను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు పింఛన్లు, బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, దళితబంధు, బీసీ బందులాంటి స్కీములు అందిస్తున్నారు. విద్యార్థుల అభ్యున్నతికి సర్కారు బడులను బాగు చేశారు. గురుకులాలతో చదువులకు భరోసానిచ్చారు. ఇటు ఇంజినీరింగ్, అటు మెడికల్ కాలేజీలు పెట్టి పేద పిల్లల ఉన్నత చదువులకు ఢోకా లేకుండా చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించి భావి భారత పౌరులకు బంగారు బాటలు వేశారు. అవును కేసీఆర్ స్వతహాగా కర్షకుడు, కవి, ఆయన చేసేది పాలనా సేద్యం.. ఆయనకు కలమూ ప్రియమే.. హలమూ ప్రియమే.. పాలనా దండ మూ అలంకార ప్రాయమే.. మరో పోతన మన కేసీఆర్ అంటే..!
-రమేశ్ కనపర్తి
99498 58108