రెండు వారాల కిందట నూనె గింజలు, ఉల్లిపాయలు, బాస్మతి బియ్యానికి సంబంధించిన వాణిజ్య విధానాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు చేసింది. దీనివల్ల అక్టోబర్ మాసంలో మొదలయ్యే ఖరీఫ్ పంట కాలంలో గ్రామీణ రైతాంగ ఆదాయాలు పెరుగుతాయనేది అంచనా. బాస్మతి బియ్యం తాలూకు కనీస ఎగుమతి ధర టన్నుకు 950 డాలర్లకు పైబడే ఉండాలన్న గతంలోని నిబంధనను తొలగించడం ఈ విధాన మార్పుల్లో ఒకటి. అలాగే, ఉల్లిపాయల ఎగుమతి తాలూకు కనీస ధర టన్నుకు 550 డాలర్లుగా ఉండాలన్న నిబంధనను తొలగిస్తూ, దాంతో పాటు ఉల్లి ఎగుమతులపై సుంకాన్ని 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గించింది. మరో పక్కన ముడి వంటనూనెలు, శుద్ధి చేసిన వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 36 శాతానికి పెంచింది.
అంతిమంగా రైతు అనుకూల విధాన నిర్ణయాల పేరిట ఎన్నికల తంతు పూర్తయ్యే వరకు రైతాంగానికి అరచేతిలో వైకుంఠం చూపించి.. ఆ తర్వాత తిరిగి కచ్చితంగా చుక్కలు చూపిస్తారు! అదీ విషయం.
NDA Govt | రైతాంగానికి లాభం చేకూర్చడానికే వాణి జ్య విధానాల్లో మార్పులు చేసినట్టు కేం ద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఉదాహరణకు బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరను రద్దు చేయడంతో ఆ బియ్యం ఉత్పత్తిదారులు అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ ధరను ఆఫర్ చేయడం ద్వారా పోటీని తట్టుకోగల అవకాశాన్ని కల్పించారు. అలాగే, ఉల్లిపాయల ఎగుమతి విషయం లో కూడా. ఇక ముడి, శుద్ధి చేసిన వంటనూనెల దిగుమతులపై సుంకాన్ని పెంచడం ద్వారా, దేశీ య నూనె గింజల ఎగుమతిదారులకు, తక్కువ ధరలకు దిగుమతయ్యే విదేశీ వంటనూనెల పోటీ నుంచి రక్షణ కల్పించారు. ఈ నిర్ణయాల న్నీ కచ్చితంగా ఆయా పంటలు పండించే రైతాంగానికి అనుకూలమైనవే. కాగా, ఇంతకాలం మూడు వ్యవసాయ చట్టాల వంటి రైతాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ రైతుకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేసేందుకు వెనుకాడిన కేంద్ర ప్రభుత్వం, నేడు ఈ రైతాంగ అనుకూల విధాన మార్పులను ఎందుకు చేసినట్టు?
దీనికి కారణం సుస్పష్టం. త్వరలో జరగను న్న 4 రాష్ర్టాల ఎన్నికలే అందుకు కారణం. అం దులోనూ ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు కేంద్రంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వానికి అగ్నిపరీక్ష లాంటివి. ఆ రాష్ర్టాల్లో గెలవ డం బీజేపీకి అనివార్యం. గత పదేండ్ల పాలనలో తన రైతాంగ వ్యతిరేక విధానాల ద్వారా వారిని బీజేపీ దూరం చేసుకున్నది. దాని ఫలితంగానే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ 240 సీట్లకు పరిమితమైంది. ఒక పక్క నితీష్, మరోపక్క చంద్రబాబుల ఊతకర్ర మద్దతుతో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మనుగడ సాగిస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు బీజేపీకి గెలిచి తీరాల్సిన అగత్యాన్ని కల్పించాయి. హర్యానాలో బీజేపీకి పూర్తిగా వ్యతిరేక పవనాలు వీస్తున్నందున అక్కడి బాస్మతి బియ్యం ఉత్పత్తిదారుల (రైతులు)ను (దేశంలో అతిపెద్ద బాస్మతి ఉత్పత్తిదారు హర్యానా కావడం గమనార్హం) బుజ్జగించడమే ఈ నిర్ణయం వెనకున్న ఉద్దేశం. ప్రస్తుతం స్థానికంగా బాస్మతి బియ్యానికి అంతగా ధర పలకడం లేదు. అందువల్ల ఆ బియ్యాన్ని ‘కనీస ఎగుమతి ధర’ అనే ఆటంకం లేకుండా, విదేశాలకు ఎగుమతి చేసుకొనే అవకాశాన్ని రైతులకు కల్పించారు. అదీ విషయం. ఇక, ఉల్లిపాయల విషయంలో కూడా కనీస ఎగుమతి ధర తొలగింపు.. ఎగుమతి సుంకం తగ్గింపు అనేవి దేశంలోనే ఉల్లిపాయల ప్రధాన ఉత్పత్తిదారు అయిన మహారాష్ట్ర రైతులకు లాభం చేకూరుస్తుంది. అలాగే, వంటనూనెలపై దిగుమతి సుంకం పెంచడం వల్ల మహారాష్ట్రలో సోయాబీన్ పండించే రైతాంగానికి విదేశీ పోటీ నుంచి రక్షణ ఏర్పడుతుంది.
రైతాంగానికి అనుకూలమైన ఈ నిర్ణయాలన్నీ ‘మనసా వాచా కర్మణా’ రైతాంగం మేలు కోరి తీసుకున్నవా? లేదా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం తీసుకున్నవా? అనే ప్రశ్న ఇప్పుడు వ్యక్తమవుతున్నది. రైతాంగ అనుకూల విధానాలప్రకటన వాటివెనుకే వెలువడిన కొన్ని ప్రకటనలు.. ముక్తాయింపుల ను గమనిస్తే ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. నిజానికి ఈ నిర్ణయాలు మార్కెట్లో మాత్రం కొంతమేర ధరల పెరుగుదలకు కారణం కాగలవనేది ఒక అంచనా. బాస్మతి బియ్యం, ఉల్లిపాయల ఎగుమతులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో ఆ ఉత్పత్తుల లభ్యత తగ్గి, కొంతమేర ధరలు పెరగవచ్చు. అలాగే, వంటనూనెల దిగుమతులపై పెంచిన సుంకాలు కూడా దేశీయంగా వంటనూనెల సరఫరాను తగ్గించి, తద్వారా వాటి ధరల పెరుగుదలకు కారణం కాగలవు. మరి అటువంటప్పుడు, ఈ ధరల పెరుగుదల అంశం ఎన్నికలకు వెళ్లనున్న మహారాష్ట్ర, హర్యానాలలో ప్రజా వ్యతిరేకతకు కారణం కాగలదు కదా? కచ్చితంగా అవుతుంది. అందుకే ఒకపక్క రైతాంగానికి మంచి ధరలు వచ్చేలా నిర్ణయం తీసుకుంటూనే.. మరోపక్క వంటనూనెల ధరలను పెంచవద్దంటూ దేశీయ ఉత్పత్తిదారులకు, వ్యాపారులకు ప్రభుత్వ వర్గాలు విజ్ఞాపనలు చేస్తున్నట్టు సమాచారం.
దాంతోపాటు తక్కువ సుంకంతో ఇప్పటికే దిగుమతి అయిన వంటనూనెల నిల్వలు 3 మిలియన్ టన్నుల మేరకు ఉంటాయని, ఈ నిల్వలు కనీసం 45-50 రోజుల వరకు సరిపోతాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కాగా, దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలపై సుంకం పెంచడం, వాటి దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకేనని ప్రభుత్వ వర్గాల వాదన. మరి, అదే నిజమైతే.. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కనీసం కొన్ని సంవత్సరాల పాటు దిగుమతులపై ఈ అధిక సుంకాల రక్షణ కవచం దేశీయ రైతాంగానికి అవసరం. తద్వారా మాత్రమే నూనె గింజల ఉత్పత్తి తమకు నికరంగా లాభసాటి అవుతుందనే భరోసాను ప్రభుత్వం రైతుకు కల్పించగలదు. కాబట్టి, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం కచ్చితంగా కాదని అర్థమవుతున్నది.
ఎందుకంటే, ముందుగానే చెప్పుకున్నట్టుగా ప్రస్తుతం దేశంలో ఉన్న వంటనూనెల నిల్వలు 45-50 రోజుల పాటు సరిపోతాయి గనుక, ఆ ధరలను ప్రస్తుతానికి పెంచనవసరం లేదని వ్యాపారులకు, ఉత్పత్తిదారులకు విజ్ఞప్తులు చేయడం వెనుక అసలు మతలబు ఏమిటి? సూక్ష్మంగా గమనిస్తే.. దీని వెనకున్న మతలబు ఒకటే. అదేమిటంటే.. రానున్న 45-50 రోజులలోగా హర్యానా, మహారాష్ట్రలలో ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుంది. కాబట్టి, ఈలోగా అటు రైతులకు మంచి ధర ఆశ చూపి వారి ఓట్లను కొల్లగొట్టడం, మరోపక్క ఉత్పత్తిదారులు, వ్యాపారులను బతిమిలాడో, బెదిరించో ధర పెరగకుండా నిలువరించి వినియోగదారులు ఆగ్రహానికి గురికాకుండా చూసుకొని మొత్తానికి ఈ ఎన్నికల్లో గట్టెక్కడం బీజేపీ అసలు వ్యూహం.
ఈ కారణం వల్లే ఒక వాణిజ్య పత్రిక కూడా తన కథనంలో బహుశా ఈ విధానాలు తాత్కాలికమే కావచ్చనే ముక్తాయింపును ఇచ్చింది. అదీ విషయం! అలాగే దిగుమతి సుంకాలు తగ్గే వరకు వంట నూనెల ధరలు పెంచొద్దని తయారీ కంపెనీలను ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని మరో వాణిజ్య పత్రిక సెలవిచ్చింది. దీని సారాంశం ఒకటే..! వంటనూనెల దిగుమతులపై సుంకాన్ని పెంచి దేశీయ ఉత్పత్తిదారులకు లబ్ధిని చేకూర్చే ఈ నిర్ణయం కేవలం మూన్నాళ్ల ముచ్చటే! అదీ కథ.
అలాగే, ఉల్లిపాయల ఎగుమతులకు మెరుగైన అవకాశాన్ని కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం కూడా అటువంటిదే. అయితే ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే ఉల్లి ధర భారీగా పెరగడం మొదలైంది. కాకపోతే, ప్రభుత్వం వద్ద ఉల్లి నిల్వలు సరిపడా ఉన్నాయి. గనుక వాటిని మార్కెట్లోకివిడుదల చేసి ధరల పెరుగుదలను నియంత్రించే అవకాశం ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఎన్నికల అనంతరం ఈ విషయంలో కూడా విధాన నిర్ణయం తిరగదోడే అవకాశమే అధికం.
అంతిమంగా రైతు అనుకూల విధాన నిర్ణయాల పేరిట ఎన్నికల తంతు పూర్తయ్యేవరకు రైతాంగానికి అరచేతిలో వైకుంఠం చూపించి.. ఆ తర్వాత తిరిగి కచ్చితంగా చుక్కలు చూపిస్తారు! అదీ విషయం. ‘ఏక్ దిన్ కా సుల్తాన్’గా ప్రస్తుతం రైతాంగానికి పెద్దపీట వేసి పట్టాభిషేకం చేస్తున్నారు. తర్వాతి కథ మామూలే. ‘ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక…’ ఇక చెప్పనవసరం లేదనుకుంట. పార్లమెంట్ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నాక రైతాంగాన్ని విస్మరించి, అధికారాన్ని కాపాడుకోలేమని బీజేపీ గ్రహించింది. అందుకే, నేడు భోళాశంకరుడైన రైతుకు, రైతాంగ సమస్యలకు శాశ్వత పరిష్కారమైన కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించే బదులుగా మభ్యపెట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నది.
(వ్యాసకర్త: ఆర్థికరంగ నిపుణులు)
డి.పాపారావు
98661 79615