విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపార అవసరాల నిమిత్తం ఏపీకి చెందిన లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో అనేక దశాబ్దాల కిందట స్థిరపడ్డారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనే ఇరవై లక్షలకు పైగా జనాభా ఉన్నట్టు అనేక గణాంకాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా నిజామాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు ఇతర తెలంగాణ జిల్లాల్లో పది లక్షల వరకు ఆంధ్రులు స్థిరపడినట్టు అవే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన సమయంలో తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులంతా వారి స్వరాష్ర్టానికి వెళ్లిపోతారని అనేక వార్తలు షికారు చేశాయి. అందుకు భిన్నంగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఏపీకి వెళ్లారు. అదేవిధంగా కొద్దిమంది స్థిరాస్తి వ్యాపారులు, చిన్న, మధ్యతరహా వ్యాపారవేత్తలు మాత్రమే వెళ్లారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన వ్యాపారులు అక్కడ ఎక్కువకాలం మనుగడ సాగించలేక తిరిగి హైదరాబాద్‌కు రావడం గమనార్హం. ఈ పరిణామానికి ఏపీలో జరుగుతున్న ప్రభావవంతమైన రాజకీయ పరిణామాలే ప్రధాన కారణమని తెలుస్తున్నది.
తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులందరూ ఎటువంటి ఆటంకాల్లేకుండా సుహృద్భావ వాతావరణంలో తమ జీవనయానం కొనసాగిస్తున్నారు. ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్న తెలంగాణ ఆంధ్రులను రాజకీయాల్లోకి లాగి వారి ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా కేంద్ర హోమంత్రి అమిత్ షా ఇటీవల తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి ద్వారా నారా లోకేష్‌ను పిలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి వాకబు చేసినట్టు తెలుస్తున్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలంగాణలో స్థిరపడిన కొందరు ఏపీకి చెందిన కుల సంఘాల నాయకులతో ఇటీవల సమావేశమయ్యారు. ఏపీలో ఇటీవల జరిగిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు సందర్భంగా కొంతమంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో నిరసన వ్యక్తం చేశారు.
నిరసనలతో ఐటీ పరిశ్రమ అస్తిత్వానికి, ప్రశాంతతకు భంగం కలిగించవద్దని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖామాత్యులు కేటీఆర్ ఐటీ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు వక్ర భాష్యం చెప్తూ బీజేపీ, కాంగ్రెస్, కొంతమంది కుల సంఘ నాయకులు బీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నాలు చేయడం దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రాష్ట్రమంతా ఉద్యమాలు చేసినా హైటెక్ సిటీలో మాత్రం టీఆర్ఎస్ ఆందోళనలు చేయలేదు. చంద్రబాబు అరెస్టు విషయం ఏపీలోని రెండు రాజకీయ పార్టీలకు చెందిన అంశం కనుక హైటెక్ సిటీలో ఆందోళన చేయవద్దని కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన విషయం ఏముందో మేధావులకు సైతం అర్థం కావడం లేదు. ఒక్క తెలంగాణకే కాదు, ఏపీలోని ఐటీ ఉద్యోగ ఆశావహులకు కూడా హైదరాబాద్ ఐటీ పరిశ్రమే ఆశాకిరణం.కనుక ఐటీ పరిశ్రమ ఆవశ్యకత, ప్రాముఖ్యాన్ని గుర్తెరిగి మసలుకోవలసిన బాధ్యత ఐటీ ఉద్యోగులందరిపై ఉందనేది నిర్వివాదాంశం.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి కేటీఆర్ అమోఘమైన కృషే దానికి ప్రధాన కారణం. దేశంలోనే ప్రముఖ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఐటీ రంగం మనుగడ ఆందోళనల వల్ల దెబ్బతింటుందనే కేటీఆర్ ఆ విధంగా స్పందించినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. ఐటీ ఉద్యోగుల భవిష్యత్తు కోసమే స్పందించిన కేటీఆర్ వ్యాఖ్యలను రాజకీయాల కోసం వాడుకోవాలని చూడటం సమర్థ్ధనీయం కాదు.
ఉమ్మడి రాష్ట్ర విభజన హామీలు విస్మరించిన కాంగ్రెస్, బీజేపీ రెండు రాష్ర్టాల్లోనూ పూర్తిగా ప్రజల విశ్వాసం కోల్పోయాయి. కుల, మత, పార్టీలకతీతంగా తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులందరూ గంపగుత్తగా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఇక్కడ స్థిరపడిన ఆంధ్రులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి ప్రభుత్వపరంగా అవసరమైన పనులన్నీ చేసిపెడుతున్నారు. కేవలం కేటీఆర్ వ్యాఖ్యలను బూచిగా చూపి కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ఆంధ్రుల మద్దతు పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించవని గుర్తించాలి.
తెలంగాణ రాష్ట్రం లౌకికవాదానికి పెట్టింది పేరు. అన్ని కులాల, మతాల ప్రజలకు, అన్ని ప్రాంతాల ప్రజల జీవన మనుగడకు దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేని పటిఫ్ఠమైన రక్షణ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. దీన్ని పరిరక్షించవలసిన బాధ్యత రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు, అన్నివర్గాల ప్రజలపై ఉందనేది నిర్వివాదాంశం.
కైలసాని శివప్రసాద్
94402 03999