దురాశాపరుల సుదీర్ఘ కాలపు ముట్టడికి విలవిలలాడిన తెలంగాణ, గడిచిన పదేండ్లలో గడియారం ముల్లులా అభివృద్ధి చుట్టూ తిరిగింది. పడిపోతే చూడాలని, మేము ముందే చెప్పామని వాగాలని ఎదురుచూసిన కబోదులందరి దిమ్మతిరిగే ప్రగతి రాష్ట్రం అనుభవంలోకి వచ్చింది. కవలలైన శాంతి, సుస్థిరాభివృద్ధిలను కడుపులో పెట్టుకొని, వొరగకుండా నిటారుగా నడుస్తూ వచ్చింది తెలంగాణ. అందుకే నిష్ఠూరమాడిన ఇరుగు పొరుగు కూడా, మాకూ కేసీఆర్ లాంటి నాయకుడుంటే బాగుండేదనుకుంటున్నారు. ఎన్నికలు, గెలుపోటములను దాటి ప్రజల బతుకులే కొలమానంగా ప్రణాళికలు రూపొందించుకునే నాయకత్వం ఏడున్నర దశాబ్దాల భారతదేశ రాజకీయవ్యవస్థలో అరుదుగా మారిపోయింది.
దేశ రాజకీయాల్లో నెహ్రూ లాంటివారు తొలినాళ్లలో అన్ని రంగాలను సవ్యమార్గంలో నడిపించేందుకు కొంత దృష్టిసారించినా, తర్వాతి నాయకత్వం తత్తరపాటుకు లోనై, తలోవైపు జాతి దిశను లాగి తికమకలోకి నెట్టినవారే. కానీ, కేసీఆర్ మాత్రం తెలంగాణ వర్తమాన సమస్యలు, భవిష్యత్తు సవాళ్లను కూడా స్వీకరించి, పరిష్కారం అందించారు. అందువల్లనే తలసరి ఆదాయంలో ఏ రాష్ట్రం కూడా తమ దరిదాపులకు వచ్చే పరిస్థితి లేని ఉన్నత స్థాయికి తెలంగాణ ప్రజలు చేరుకున్నారు. ఈ ప్రాంత భౌగోళిక స్థితిగతులు, రాజకీయ పరిస్థితులు, నేల స్వభా వం, జనం ప్రభావంపై పూర్తి అవగాహన కలిగిన సీఎం కేసీఆర్, దశాబ్దకాలాన్ని పైవాటితో శాస్త్రీయంగా జతకూర్చి జుగల్బందీలా కొనసాగించ డం వల్లనే, అల్లాడిన ఈ నేల, తెల్ల పావురంలా ఎగురగలుగుతున్నది.
తెలంగాణలో భూ సంపదను సృష్టిస్తున్నది, కంప్యూటర్లు కాసులు పండిస్తున్నాయి. నదులు, చెరువులూ నోట్ల వర్షం కురిపిస్తున్నాయి. కేసీఆర్ లాగా సాగు నుంచి ఐటీ దాకా సకల రంగాలను ఉత్పత్తికారక కేంద్రాలుగా మలిచిన ముఖ్యమంత్రులు లేనేలేరు. ఉద్యమ సమయంలోనైనా, తెలంగాణకు దారిచూపుతున్న వర్తమానంలోనై నా, కేసీఆర్ ఎత్తుకున్నాడంటే కొస ఎల్లేదాకా వదలడనే సత్యం ప్రజలందరికీ తెలిసిందే. అందుకే కేసీఆర్ ప్రెస్‌మీట్‌ను కూడా పండుగ నాడు మధ్యాహ్న భోజనానికి కుటుంబం అంతా కలిసి కూర్చున్నట్టుగా, టీవీల ముందు వాలి జనమం తా వింటారు.
అదే ధోరణిలోనే ఆదివారం నాడు కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రెస్‌మీట్‌ను కూడా వేలాది సెల్ఫోన్ల ద్వారా, టీవీల్లో లక్షల మంది ప్రజలు ఆసక్తిగా విన్నారు. వాస్తవానికి పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోలపై ప్రజలకు ఆసక్తి కరువై చాలా కాలమే అయింది. కానీ, పదేండ్ల స్వయం పాలనలో పంచుకున్న ఫలాలు, గులాబీ పార్టీ భరోసాలపై జనానికి విశ్వాసాన్ని కల్పించాయి. అడగనిది, అడిగింది, చెప్పనిదీ, చెప్పిందే కాదు ఏ పాలకుడూ ఊహించజాలని పథకాలను అమలుచేసి చూపింది కేసీఆర్ సర్కార్. ఆ దార్శనికత వల్లే రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మీ, దళితబంధు, బీసీ బంధు, కంటివెలుగు లాంటి 450కి పైగా మానవీయ సర్కార్ స్కీమ్‌లు అమలయ్యాయి. అందుకే కేసీఆర్ నోటెంట మాట వింటేనే ప్రజలకు పట్టలేని పరవశం. నిన్నటి మ్యానిఫెస్టో మళ్లీ అదే అంతులేని ఆనందాన్ని సామాన్య ప్రజలందరికీ కలిగించింది. బుద్ధి జీవులందరి సంఘీభావాన్నీ పొందింది.
పదేండ్లలోపే చీకట్లను దాటి తెలంగాణ మిరుమిట్లను గెలుచుకున్నది. అదే వేగంతో వెన్నెల్లాంటి జీవితాలను సుస్థిరపరిచే లక్ష్యంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2023 ఎన్నికల ప్రణాళికలను రూపొందించారు. సంపద సృష్టి, సంక్షేమ పథకాలను మానవ వికాసంలో మరో చరిత్ర నిర్మాణానికి జోడెడ్లుగా మలిచే కార్యాచరణ ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతూనే ఉన్నది. ఆ ప్రగతిరథాన్ని ముందుకే నడిపించేందుకు జన మ్యానిఫెస్టోను తెలంగాణ సమాజం ముందుపెట్టారు కేసీఆర్. రూపమే కాదు సారమూ కనపడని సర్కార్లు ఏలుతున్న దేశంలో, తెలంగాణది మాత్రం ప్రాణమున్న ప్రభుత్వం. వాటి విలువనెరిగిన సుగుణమున్న పాలకుడిగా ప్రతి ఇంటికీ ధీమానిచ్చే కేసీఆర్ బీమా పథకాన్ని రాష్ట్రంలోని దాదాపు 93 లక్షల కుటుంబాలకు హామీ ఇచ్చా రు.
అలాగే ఇప్పటికే తెలంగాణలో మానవీయ పథకంగా మన్ననలు పొంది, 36 లక్షలకు పైగా లబ్ధి దారులకు ప్రతి నెలా రూ.2,016లు అందిస్తున్న ఆసరా పింఛన్ల మొత్తాన్ని దశలవారీగా రూ.5,016కు పెంచుతామని కేసీఆర్ ఇచ్చిన హామీ అందరిలో పండుగ సంతోషాన్ని కల్పించింది. అలాగే తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాలన్నింటికీ సన్నబియ్యం అందించే తెలంగాణ అన్నపూర్ణ స్కీం హామీ కూడా సంక్షేమరంగంలో దేశానికి దారిచూపే చర్యగా నిలుస్తుంది. అలాగే సౌభాగ్యలక్ష్మీ పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు ప్రతి నెలా 3 వేల గౌరవ భృతి, కేసీఆర్ ఆరోగ్య రక్ష ద్వారా ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని 15 లక్షలకు పెంచడం, అర్హులైన కుటుంబాలకు, జర్నలిస్ట్‌లకు రూ.400 కే గ్యాస్ సిలిండర్ ఇలా అనేక మనసు గల్ల మహా ప్రణాళికను కేసీఆర్ ప్రజారాశుల చేతుల్లో పెట్టారు.
అంతరాల్లేని, ఏ చింతలూ చుట్టుముట్టని సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెయ్యికి పైగా గురుకులాలను, ఒక్కో విద్యార్థిపై ఏటా 1 లక్షా 20 వేలకు పైగా ఖర్చుపెడుతూ నిర్వహిస్తున్నది. వాటిలో చదువుతున్న 5 లక్షల కుటుంబాలకు చెందిన బిడ్డలు అద్వితీయమైన ఫలితాలు చూపుతున్నారు. అగ్రవర్ణ పేదల కోసమూ నియోజకవర్గానికి ఒకటి చొప్పున, 119 గురుకులాలను ఏర్పాటుచేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ కూడా అందరి ప్రభుత్వ విధానంగా చరిత్రలో నిలుస్తుంది. పేదరికం, అవకాశాల అందుబాటులో వ్యత్యాసమే సమాజంలో అంతరాలకు, నిరాశకు ప్రధాన కారణాలు. అవి మనందరి మెడకూ బాధాకరమైన భౌతిక పరిస్థితులై వేలాడుతూనే ఉంటాయి. అవకాశాలను అందరికీ చేరువలోకి తేగలిగితే, వ్యత్యాసాలు వేగంగా మాయమౌతాయి. ఈ ఉన్నత ఆశయంతోనే కేసీఆర్ సంక్షేమ పథకాలను విప్లవాత్మక దృక్పథంతో అమలుచేశారు, మరో దశకు వాటిని వాగ్దానం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 11 వేల కోట్లతో గొర్రెల యూనిట్ల పంపిణీ, వందలాది కోట్లతో 25 వేల కోట్ల మత్స్య సంపదను బీసీ కులాల ఆస్తిగా అందించింది గులాబీ ప్రభుత్వం. దళితబంధు, బీసీబంధు పథకాలతో దివ్యమైన దారినీ పరిచింది. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, 350 బస్తీ దవాఖానలు, కంటివెలుగు లాంటి ఎన్నో వైద్యసేవలు పేద వర్గాలకే వరంలా ఉపయోగపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పదేండ్లుగా ప్రతి పథకం ప్రజలందరి సౌభాగ్యం కోసమే అమలుపరుచబడింది. కరెంటు, సాగు నీరు, పరిశ్రమలు, ఉద్యోగాలు, రైతు సంక్షేమ పథకాలు, ఐటీ ఇలా అన్నింటా అద్భుతమైన ఫలితాలను తెలంగాణ సాధించింది. ఆర్థిక క్రమశిక్షణలోనూ రిజర్వ్ బ్యాంక్ ప్రశంసలు పొందింది మన రాష్ట్రం.
ఎగుమతుల రాష్ట్రంగా, పంటల దిగుబడిలో నెంబర్ వన్ ర్యాంకర్‌గా తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి తలుచుకుంటేనే గుండె గర్వంతో ఉప్పొంగుతుం ది. ఎన్నో ఆశయాలను సాకారం చేసిన సీఎం కేసీఆర్, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే రాజ్యాం గ భావనలను కొనసాగించేందుకే మ్యానిఫెస్టోలో స్పష్టమైన హామీలిచ్చారు.
ప్రస్తుతం సామాజిక న్యాయం అనే నినాదం సంతలో సరుకుగా మార్చబడింది. నిజానికి దాని కి అంతరార్థం సమాజంలోని వస్తు సేవలు, ప్ర యోజనాలు, ప్రభుత్వ విధానాలు ప్రజలందరి జీవితాల్లో ఒకే విధంగా అందుబాటులో ఉంచడ మే. అదే ఉన్నతమైన దృష్టికోణంతో కేసీఆర్ పాల న నడిచింది. ఇప్పుడు బీఆర్ఎస్ 2023 ఎన్నికల ప్రణాళిక కూడా అదే బాటలో ప్రజలముందు ఉంచబడింది. ఇది కేసీఆర్ రాసిన భవిష్యత్తు, వర్తమానం వెలుగులో అందరం కలిసి నడుద్దాం. ‘మళ్లీ మళ్లీ రావాలి మనసుగల్ల సర్కార్’ అని మనమందరం మనసారా ప్రార్థిద్దాం.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్)
డాక్టర్ ఆంజనేయ గౌడ్ 98853 52242