దేశ రాజకీయాల్లో, పాలనలో గుణాత్మక మార్పు కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మొట్ట మొదటి బహిరంగ సభ మరో చరిత్రను సృష్టించింది. దేశం నలుమూలల నుంచి ముఖ్య అతిథులుగా హాజరైనజాతీయ అతిరథ మహారథులతో, లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలతో ఖమ్మం సభ భవిష్యత్తు మార్పుకు సంకేతంగా నిలిచింది.
ఖమ్మం సభతో బీఆర్ఎస్ పార్టీ తన జాతీయ రాజకీయ ఎజెండాను మాత్రమే కాదు ప్రగతి ఎజెండాను ఎగరవేసింది. వాస్తవానికి ఈ సభను కేవలం రాజకీయ పార్టీ సభగా మాత్రమే చూడొద్దు. ఇది పార్టీ, ప్రభుత్వాల సభగా చూడాలె. ఖమ్మం వేదికకు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చింది రాజకీయ పార్టీల అధ్యక్షులు మాత్రమే కాదు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులుగా, ముఖ్యమంత్రులుగా కూడా వారు వచ్చిండ్రు. ఇందులో భారతదేశ రాజధానినే స్వయంగా ఏలుతున్న సీఎం ఒకరు, కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం సీఎం ఒకరు, దేశానికి అన్నం పెడుతున్న రాష్ర్టాల్లో ముఖ్యమైన ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రి ఒకరు. ఉత్తరాదికే పెద్దన్నగా నిలిచిన రాష్ర్టానికి చెందిన మాజీ సీఎం మరొకరు.
‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చే స్తున్న పథకాలు, తద్వారా వెల్లువెత్తుతున్న ప్ర గతి దేశానికి ఆదర్శ నమూనా కావాలి. మీరు పె ద్దన్నలా మాతో కలిసి ముందుకు సాగాలి’ అని సహచర ముఖ్యమంత్రుల ఆహ్వానాన్ని సీఎం కే సీఆర్‌కు అందించిన సభగా ఖమ్మం చరిత్రకెక్కింది. ఎనిమిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేసి, మన దేశానికి ‘తెలంగాణ మాడల్’ను ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ వంటి నాయకుడు దేశానికి సా రథ్యం వహిస్తే ఈ దేశ ప్రజలకు ఇంకెంతగా మే లు జరుగుతుందో ఎరుకపరుస్తూ ఈ సభ స్పష్టమైన సంకేతాన్నిచ్చింది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో రైతు రాజ్యం తేవాలనే సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా, దేశవ్యాప్త ఆమోదాన్ని అందించిదీ సభ.
సహజ వనరులు, మానవ వనరులు పుష్కలంగా ఉన్న భారతదేశం కేసీఆర్ నాయకత్వంలో ప్రపంచంలోనే సుసంపన్న దేశంగా మారుతుందనే భరోసాను ఖమ్మం సభ నింపింది. దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఉన్మాద పోకడలతో పరిపాలన సాగిస్తున్న కేంద్ర పాలనకు ప్రజలు చరమగీతం పాడాల్సిన అవసరాన్ని మరోసారి బలంగా గుర్తు చేసిందీ సభ. తెలంగాణ రాష్ర్టాన్ని చక్కదిద్దుకుంటూ దేశ అభ్యున్నతే ధ్యేయంగా అడుగులు వేస్తున్న బీఆర్ఎస్ వంటి పార్టీలను ఆదరించడం ద్వారా మాత్రమే దేశ పరిపాలనలో ప్రజా సంక్షేమానికి పట్టం కట్టడం సాధ్యమౌతుందని ఖమ్మం సభ స్పష్టం చేసింది. ఇంతకాలం ఈ దేశంలో ఉన్న వ్యవసాయ యోగ్యమైన పంట భూముల గురించి కానీ, దేశంలో ఎన్ని టీఎంసీల నదీ జలాలు లభ్యమైతాయని గానీ, ఎంత కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చనిగానీ, ఏయే పంటలు ఎట్లెట్ల పండించుకోవచ్చని గానీ, పండించిన పంటలను ఆహార ఉత్పత్తులుగా మార్చి దేశాన్ని ప్రపంచానికే అన్నపూర్ణగా మార్చడం గురించిగానీ, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఏ పాలకుడన్నా మాట్లాడిండా? లేదు.
అట్లా మాట్లాడాలంటే, ప్రజలంటే ప్రేమ ఉండాలె, బాగు చేయాలనే సోయుండాలె. ఇంతకాలంగా ఈ దేశాన్నేలిన పాలకులు దేశ ప్రజలను ఓట్లుగాసే చెట్లుగానే చూస్తున్నరు. దేశ ప్రజలను ఉత్పత్తి వనరులుగా, ఉత్పత్తి శక్తులుగా గుర్తించిన మొదటి జాతీయ నేత కేసీఆర్. ఈ విధానం ఈ దేశ రాజకీయ పండితులను, మేధావి వర్గాన్ని పునరాలోచింపజేస్తున్నది. మేధావులుగా తాము ఇన్నాళ్లూ ప్రజల కోసం రాసిన రాస్తున్న రాతలను, పాటలను నేడు కేసీఆర్ దృక్పథంతో సరిచేసుకుంటున్నరు. ఇంతకాలం తాము ప్రశ్నలు వేసామే తప్ప, వాటి పరిష్కారాలు చూపలేకపోయామే అని అనుకుంటున్నరు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నట్టు… మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణానికి సాగుతున్న సూర్యుని ప్రయాణం ఎంత శుభసూచకమో.. అదే సందర్భంలో.. భారత దేశ ఆత్మగౌరవ నినాద పతాకాన్ని చేబూని దక్షిణాది నుంచి ప్రారంభమౌతున్న చంద్రశేఖరుని జాతీయ రాజకీయ పాలన ప్రస్థానం ఈ దేశానికి అంతే శుభసూచకం. ఖమ్మంలో లక్షలాదిమంది ప్రజల సమక్షంలో, పలు జాతీయ పార్టీలు, నేతలు, సీఎంల సమక్షంలో జరిగిన బీఆర్ఎస్ సభ భారత రాజకీయ పాలన ‘పారడైమ్ షిప్ట్’ కు (మౌలిక నమూనా మార్పు)కు నాంది పలికింది.
-రమేశ్ హజారి