ఇది ఎన్నికల కాలం. బీఆర్ఎస్ తన రికార్డును తానే బద్దలు కొట్టింది. రాష్ట్రంలోని విపక్షాలను సునామీలోకి విసిరికొట్టింది. 2018లో ఆర్నెల్ల ముందు అభ్యర్థులను ప్రకటించి, ఈసారి ఆరున్నర నెలల ముందే అభ్యర్థులను ప్రకటించింది.
ఈసారి ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి తన విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసుకొని ప్రజల పట్ల తనకు ఉన్న నమ్మకాన్ని.. ఆ ప్రజలకూ తమపై ఉన్న అచంచల విశ్వాసాన్ని మరోసారి నిరూపించుకుంది బీఆర్ఎస్ పార్టీ. విచిత్రమైన విషయం ఏమంటే ఈసారి కూడా ముందస్తు వస్తదని కాంగ్రెస్ జోస్యం చెప్పింది. ఎన్నికలు ఎప్పుడైనా తాము సిద్ధమని బీజేపీ భారీ డైలాగులు పేల్చింది. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, ముందస్తు పోవాల్సిన అవసరం, అగత్యం తమకు లేదని అధికార బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో వెల్లడించింది. అంతేకాదు ఈసారి కూడా సిట్టింగ్‌లకే సీట్లు.. తప్పనిసరి పరిస్థితి ఉత్పన్నం అయితే కొన్ని మారవచ్చు అన్న స్పష్టమైన సంకేతాలను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలకు, పార్టీ శ్రేణులకు ఇచ్చారు. అందుకు అనుగుణమైన రీతిలోనే కసరత్తు పూర్తి అయి.. అభ్యర్థుల జాబితాను ఎన్నికలు జరిగే దాదాపు ఐదారునెలల ముందే వెల్లడించారు. కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు తమకే కావాలని, లేదా ఫలానా నాయకుడికే దక్కాలని అధికార పార్టీలో ఆసక్తికరమైన, ఆరోగ్యకరమైన రీతిలో పార్టీ శ్రేణులు తమతమ ఆలోచనలను అధినాయకత్వానికి చేరవేస్తున్నాయి. స్వరాష్ట్రం కోసం బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) పురుడుపోసుకున్న తొలినాళ్లలో ఈ పార్టీ నుంచి అసలెవరు పోటీచేస్తారు? పోటీచేస్తే కనీసం డిపాజిట్లయినా వస్తాయా? అన్న వాతావరణం నుంచి ఒక్కో నియోజకవర్గంలో నలుగురేసి.. కొన్ని చోట్ల ఐదుగురేసి నాయకులు తమకు టికెట్ కావాలని పోటీపడే పరిస్థితి దాకా బీఆర్ఎస్ ఎదగడం తెలంగాణ రాజకీయాలకు ఆరోగ్యకరమైన వాతావరణమే.
2001లో బీఆర్ఎస్ స్థాపించిన కేసీఆర్ అనేక మంది నాయకులను తయారు చేశారు. ప్రజాదరణ ఉన్న.. ప్రజల గుండెల్లో స్థిరమైన.. ప్రజలకు నమ్మికైన పార్టీగా బీఆర్ఎస్, నాయకుడిగా సీఎం కేసీఆర్ ఉండటం వల్లే ఇక్కడ పోటీ ఉన్నది. నియోజకవర్గాల్లో నాయకులు పేరుకే అభ్యర్థులు. కానీ, అసలు అభ్యర్థి కేసీఆరే. కేసీఆర్‌ను చూసి తమను ప్రజలు ఆదరిస్తారనే విశ్వాసం పోటీచేసే ప్రతీ ఒక్కరిలో ఉండటం వల్లే బీఆర్ఎస్కు అంత క్రేజ్. దట్ ఈజ్ కేసీఆర్. ఇక కేసీఆర్‌ను లేదా బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేది మేమంటే..మేమని సినిమాల్లో పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్ కన్నా అధికంగా గొంతులు పగిలేలా..నరాలు చిట్లేలా పేల్చిన డైలాగులు కొసాఖరికి దీపావళి టపాసుల్లా తుస్సుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఈ నెల 25 దరఖాస్తుల పరిశీలన..తుది జాబితా ఢిల్లీకి పంపటం, వార్‌రూం కమిటీ పరిశీలన ఇలా అనేకానేక కమిటీల కహానీ పూర్తయ్యేలోపు అనేకానేక శిబిరాలు ఢిల్లీ లాబీలు, బల ప్రదర్శనలు.. అగ్నిగుండాల్లో దూకడాలు వంటివన్నీ ఎప్పుడు పూర్తికావాలి? ఇదీ ఆ పార్టీలో నెలకొన్న ప్రతిష్ఠంభన.
ఇక దేశాన్ని ఏలే బీజేపీ రాష్ట్రంలో దయనీయ పరిస్థితిలోకి కి వెళ్లిపోయింది. గత ఎన్నికల్లో 105 సీట్లలో డిపాజిట్లు గల్లంతైనా ఈసారి అధికారం తమదేనని బీరాలు పలికింది. కానీ, ఆ పార్టీ ఎన్నికలకు ఏ మేరకు సమాయత్తమైంది? అంటే కనుచూపుమేరలో ఆ కార్యాచరణే కనిపించకుండాపోయింది. ‘రాష్ట్రంలో మా పార్టీ పరాన్నజీవిగా మారిపోయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో టిక్కెట్లు రానివాళ్ల కోసం గోతికాడి నక్కలాగా ఎదురుచూస్తుంది’ అని స్వయంగా బీజేపీలోని ఓ సీనియర్ నాయకుడు విశ్లేషించటం విశేషం. మొత్తంగా తెలంగాణలో మరోసారి విజయం తనదేనని, విజయబావుటా ఎగరేస్తానని బీఆర్ఎస్ తేటతెల్లం చేసింది.
(వ్యాసకర్త – సీనియర్ జర్నలిస్ట్, నమస్తే తెలంగాణ)
-నూర శ్రీనివాస్
91827 77011