‘బీఆర్ఎస్ను బొందపెడతాం’ సాక్షాత్తూ ఓ ముఖ్యమంత్రి అన్న మాట ఇది. ‘బీఆర్ఎస్ను ముక్కలు ముక్కలుగా చేస్తాం’ మరో మంత్రి అక్కసు వెళ్లగక్కిన తీరిది. ‘మనం తర్వాత పోటీ పడొచ్చు కానీ, ముందు బీఆర్ఎస్ను ఓడిద్దాం’ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెప్పిన మాట ఇది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన బీఆర్ఎస్పై అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ నేతలు చేస్తున్న అహంకారపూరిత వ్యాఖ్యలివి.
కాంగ్రెస్ గద్దెనెక్కి నెల రోజులు కూడా గడవకముందే ప్రజలు వాస్తవాన్ని గ్రహించారు. ఇంటి పార్టీని దూరం చేసుకున్నామనే నైరాశ్యంలో పడ్డారు. ఇంత త్వరగా ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల సానుకూలత వస్తుండడాన్ని రెండు జాతీయ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందుకే బీఆర్ఎస్ను బలహీనపరచాలనే కుట్రలు జరుగుతున్నాయి.
KCR | నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ పక్షాన నిలబడని వ్యక్తులు నేడు బీఆర్ఎస్ను లేకుండా చేస్తామని మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజల్లో ఆ పార్టీలపై, వారి నాయకత్వంపై విశ్వాసం ఉంటే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయరు. కానీ, కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణపై ప్రేమ కంటే.. అధికారం మీద వ్యామోహమే ఎక్కువ. అందుకే బీఆర్ఎస్ను చీల్చుతామంటూ మాట్లాడుతున్నారు. వారు అభద్రతా భావంతో ఉన్నారనేది దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. వారు నిజంగా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటే తెలంగాణ ఉనికిని మరోసారి లేకుండా చేయడానికి కూడా వెనుకాడరు. పదే పదే కేసీఆర్ మీద కోపంతో బీఆర్ఎస్ను లేకుండా చేస్తామని మాట్లాడుతున్న నాయకులు భవిష్యత్తులో తెలంగాణను రాష్ట్రంగా ఉండనిస్తారా? అనే అనుమానం కూడా వ్యక్తమవుతున్నది. వారి ఆవేశపూరిత అక్కసును చూస్తుంటే.. భవిష్యత్తులో తెలంగాణను ఆగమాగం చేయటం ఖాయమనిపిస్తున్నది. ఆ దిశగా రెండు జాతీయ పార్టీలు రాజకీయ ఉనికి కోసం తెలంగాణను బలిపీఠం మీదకు తీసుకుపోతాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తప్పులు ఎంచుతూ, లోపాలు చూపే ప్రయత్నం చేస్తూ కాలయాపన చేస్తున్నది. అందులో భాగంగానే బీఆర్ఎస్పై కాంగ్రెస్ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల మన్ననలు పొందాల్సిన అధికార పార్టీ అందుకు భిన్నంగా వ్యక్తిగత రాజకీయ కక్ష సాధింపులకు ఉసిగొలిపే మాటలకు తెరలేపడం సరికాదు. బీఆర్ఎస్ పార్టీ లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చి ఉండేది కాదు. ప్రజల తరఫున బీఆర్ఎస్ విసిరే సవాళ్లను ఎదుర్కొనే శక్తి లేకనే, జాతీయ పార్టీలు బీఆర్ఎస్పై విషం చిమ్ముతున్నాయి. దాన్ని మనం మరింత సూక్ష్మంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
తాను గెలవడమే ప్రతి రాజకీయ నాయకుని లక్ష్యం. అధికారంలో ఉండి, పదవులు అనుభవిస్తూ, పెత్తనం చెలాయించాలని ఆరాటపడుతుంటారు చాలామంది. అటువంటి వారే రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎన్నికల్లో గెలవడం, పదవులు అనుభవించడం సర్వసాధారణం. కానీ, తన గెలుపును ప్రజల కోసం ఎలా ఉపయోగించాలి? అనే విషయాన్ని కొద్ది మంది మాత్రమే ఆలోచిస్తారు. అటువంటివారు తన గెలుపుతో ప్రజల బతుకుల్లో ఎలా వెలుగులు తీసుకురావాలి? అని ఆలోచిస్తుంటారు. తన గెలుపులో ప్రజల గెలుపును చూసుకుంటుంటారు. అటువంటి అరుదైన నాయకుల్లో కేసీఆర్ ఒకరు. తన గెలుపు ప్రజల జీవితాల మార్పునకు ఏవిధంగా ఉపయోగపడుతుందని ఆలోచించి, ఆచరించే నాయకుడు కేసీఆర్. అడుగడుగునా ఆగమైన తెలంగాణను గెలిపించడానికి కేసీఆర్ చేసిన త్యాగం అంతాఇంతా కాదు. ఈ పదేండ్లను పరిశీలిస్తున్న మనం, ఆరున్నర దశాబ్దాల అణగారిన మన ప్రాంతాన్ని ఒక్కసారి తలుచుకుంటే ‘తెలంగాణకు కేసీఆర్ విజయ తిలకమే’ అని అర్థం కాకుండా ఉండదు.
జయశంకర్ సార్ లాంటి సిద్ధాంతకర్త కూడా ‘కేసీఆరే తెలంగాణను సాధించగలడు. మరెవరూ సాధించలేరు’ అని అన్నారంటేనే కేసీఆర్ నాయకత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణను సాధించాలన్న కృషి, పట్టుదల, తెగింపు కేసీఆర్‌లో ఏ స్థాయిలో ఉంటే.. జయశంకర్ సార్ ఆ మాట అనగలరు అనేది మనం గుర్తెరగాలి. ఆనాటి నుంచే కేసీఆర్ తెలంగాణకు విజయ తిలకం అయ్యారు. స్వచ్ఛమైన తెలంగాణ యాస, భాషలో, మహాత్మాగాంధీ పంథాలో, అంబేద్కర్ విధానాలతో ఆయన నడిచిన ఉద్యమ తోవ చరిత్రలో ఎప్పటికీ చెరపలేనిది. ఆదిలాబాద్ నుంచి మొదలుకొంటే ఖమ్మం వరకు ప్రతీ అంగుళం అవపోసనపట్టి, చీకట్లో మగ్గుతున్న తెలంగాణకు ఆయన వెలుగయ్యారు. బలిపీఠం మీద బలవుతున్న తెలంగాణ సమాజానికి ఆయన కొండంత భరోసా అయ్యారు. ఇదంతా ఆయన పదవులను ఆశించో, హోదాను ఆశించో చేసింది కాదు.
కేసీఆర్ భయపడే వ్యక్తో, అధికారం అంటే ఆశ ఉన్న వ్యక్తో కాదు. కేసీఆర్‌కు పదవులపై వ్యామోహమే ఉంటే.. 14 ఏండ్ల ఉద్యమ సమయంలో తీవ్రమైన మానసిక సంఘర్షణలు, బెదిరింపులను తట్టుకోలేక పక్కకు తప్పుకొనేవారు. కేసీఆర్‌కు ఓటములు కొత్త కాదు, ఆయన అధికారం కోసం ఆరాటపడే వ్యక్తి కాదు. ప్రజల ఆకాంక్షల కోసం అవతరించిన పార్టీ బీఆర్ఎస్. నేటి ఓటమిని సమీక్షించుకొని భవిష్యత్తులో మరో గొప్ప విజయానికి నాందిగా రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లో ఉండాలి. ప్రజల గొంతుకగా మారాలి. దేశ రాజకీయాలపై కేసీఆర్ అనే మూడు అక్షరాల చరిత్ర ఆవిష్కృతం అయ్యేలా మరింత దీక్షతో ముందుకు సాగాలి.
-సంపత్ గడ్డం
78933 03516