భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావంతో కాం గ్రెస్, బీజేపీ తప్ప దేశానికి మరో దిక్కులేదనే అపోహ పటాపంచలు కాబోతున్నది. గతం, వర్తమానం, భవిష్యత్తుపై ఆలోచనలు చేసే బీఆర్ఎస్ భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలబడుతుందనడంలో సందేహం లేదు. అపర చాణక్యుడు, మాజీ ప్రధాని పాములపర్తి నరసింహారావు తర్వాత అంతటి రాజకీయ చాణక్యం కలిగిన నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
నీళ్లు, నిధులు, నియామకాలు కేవ లం ప్రత్యేక రాష్ట్రంతోనే సాధ్యమవుతుందంటూ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ను స్థాపించారు కేసీ ఆర్. ఉమ్మడి పాలనలో సరైన విద్య, ఉపాధి అవకాశాలకు నోచుకోని తెలంగాణ కోసం పట్టువదలని విక్రమార్కునిలా ఉద్యమించి అనుకున్నది సాధించారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత దేశానికే తలమానికంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయాన్ని పండుగచేసి రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఐటీ, విద్య, వైద్యం వంటి అనేక రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపారు. సంక్షేమ పథకాలతో దేశం దృష్టిని ఆకర్షించారు. ఎడారిగా ఉన్న తెలంగాణను కాళేశ్వరంతో సస్యశ్యామలం చేశారు. నిర్లక్ష్యం చేయబడిన చెరువులను కుంటలను మిషన్ కాకతీయ ద్వారా పునర్నిర్మాణం గావించారు. మిషన్ భగీరథతో ఇం టింటికి స్వచ్ఛమైన నీళ్లను అందిస్తున్న అపర భగీరథుడు కేసీఆర్. బీడు భూ ములు సైతం నేడు ఆకుపచ్చగా మారి సరికొత్త తెలంగాణను ఆవిష్కరిస్తున్నవి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్న ఇంకా అభివృద్ధి చెందిన దేశంగానే ఎందుకున్నదన్నది కేసీఆర్ ప్రశ్న. దీనికంతటికి కారణం దేశాన్ని ఇప్పటివరకు పాలించిన పాలకులే. దేశాభివృద్ధికి అవసరమైన సమగ్ర పథకాలు అమలు చేయకపోవడమే దీనికి కారణమన్నది నిజం. కాంగ్రెస్, బీజేపీలే దేశాన్ని ఎక్కువకాలం పాలించాయి. వాటికి ప్రత్యామ్నాయంగా పలు పార్టీలు ప్రయత్నించినప్పటికీ అనుకున్న ఫలితాలివ్వలేదు. ఎవరికి వారుగా ఉన్న మూడో ప్రత్యామ్నాయ నేతలను ఒక తాటిపైకి తీసుకురావడం కష్టమే అయినా అసాధ్యం కాదని కేసీఆర్ రంగంలోకి దిగారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలే దేశానికి మాడల్‌గా చూపుతూ సంకల్ప బలంతో కలసివచ్చే శక్తులతో కదన రంగాన అడుగు పెట్టారు.
నోట్ల రద్దు, పెచ్చరిల్లిన మతోన్మాదం, పేదరికం, నిరుద్యోగంతో దేశం సంక్షోభంలో చిక్కుకున్నది. విపక్ష కాంగ్రెస్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నది. ఈ స్థితిలో కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని దిగ్గజ జాతీయ పార్టీల సరసన నిలబెడుతున్నారు. ‘బీఆర్ఎస్ కూటమి’ అని ఇప్పటికప్పుడు చెప్పుకోవడం అతిశయోక్తిగా అనిపించినా రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. వచ్చే ఎన్నికల్లో ఈ కూటమికి వందసీట్లు దక్కినా ఢిల్లీ గద్దె ఎవరిదో నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించడం ఖాయం.
(వ్యాసకర్త : సింగరేణి రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్)
దండంరాజు
రాంచందర్ రావు
98495 92958