తెలంగాణలో మూడోసారి అధికారం చేపట్టి విపక్షాల ఆశలపై నీళ్ళు చల్లేందుకు బీఆర్ఎస్ వ్యూహం రచిస్తున్నది. అందులో భాగంగానే అసెంబ్లీ నియోజకవర్గాల పనితీరుపై అధినాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగించి తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగేలా ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగా జాతీయ పార్టీలుగా చెప్పుకునే బీజేపీ, కాంగ్రెస్‌ల కంటే ముందుగానే 105 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరంలో దూసుకుపోతున్నది.
ఇప్పటివరకు నియోజకవర్గాలకు అన్నీ తామై ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ కార్యకర్తలను కంటికి రెప్పలా గా కాపాడుకుంటున్నారు. వారికి తోడు గా ఒక ప్రత్యేక పరిశీలకుడిని నాయకత్వం నియమించింది. వారి ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల పనితీరుతో పాటు అక్క డ జరిగే అభివృద్ధి పనులపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌కు అందించనున్నారు. దీనికి తోడు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను పరిపూర్ణంగా పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానంగా అర్హులైన ప్రజలకు ఇవ్వాల్సిన రేషన్ కార్డులు, పింఛన్లు, దళితబంధు పథకాలను వెంటనే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యతను ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త తీసుకునేలా కార్యాచరణను పార్టీ సిద్ధం చేస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ 63 స్థానాల్లో గెలుపొంది అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనతి కాలంలోనే రాష్ట్ర అభివృద్ధి నమూనా దేశ ప్రజలను ఆకర్షించింది. ప్రస్తుతం అనేక రాష్ర్టాలు తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పాలనను అనుసరిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రజలు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం గతం కంటే మరో 25 స్థానాల్లో ఆధిక్యతను ఇచ్చి మొత్తం 88 స్థానాల్లో గులాబీ జెండాకుజై కొట్టారు.
ప్రజలు ఇచ్చిన విజయాన్ని వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రధానంగా అణగారిన వర్గాల విద్యార్థుల విద్య అభివృద్ధికోసం సాంఘిక సంక్షేమ పాఠశాలలను రెట్టింపు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 14గా ఉన్న పాఠశాలలు నేడు 268 కి చేరుకున్నాయి. 188 గిరిజన సంక్షేమ పాఠశాలలు, 281 బీసీ సంక్షేమ పాఠశాలలు, 204 మైనారిటీ సంక్షేమ పాఠశాలలను ఏర్పాటు చేశారు. దేశంలో అత్యధిక గురుకులాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. మొత్తం 998 గురుకుల పాఠశాలల్లో 5,99,537 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారందరికీ నాణ్యమైన పౌష్టిక ఆహారం అందిస్తూ ఆంగ్ల విద్యను బోధిస్తున్నారు. ఈ విద్యా విధానం దేశంలో కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అమలుకు నోచుకోవడం గమనార్హం. అంటే అణగారిన వర్గాల పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. రైతు పెట్టుబడిసాయానికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తూ ఆర్థిక చేయూతనిస్తున్నది. ఫలితంగా రైతుబంధు పథకం ద్వారా 2023 ఆగస్టు నాటికి 11 విడతల్లో రూ. 72,910 కోట్లు పెట్టుబడి సాయంగా రైతులకు అందింది. గతంలో 25.85 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 2022-23 నాటికి అది 104.23 లక్షల ఎకరాలకు పెరిగింది. రైతులకు పెట్టుబడి సాయం అందించడమే కాకుండా సాగునీరు అందుబాటులోకి రావడం ద్వారా ఈనాడు రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధి గణనీయంగా పెరిగింది. అదేవిధంగా రైతులు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.5 లక్షల రైతుబీమాను అందిస్తున్నది.
ఆర్థిక అసమానతలతో అభివృద్ధికి దూరమైన దళితులను ఆదుకోవడానికి ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది నిరంతరంగా కొనసాగే పథకం. ప్రభుత్వ దవాఖానలను బాగుచేయడమే కాకుండా అక్కడ జన్మనిచ్చే తల్లులకు కేసీఆర్ కిట్టుతో పాటు రూ.13 వేలు అందచేస్తున్నది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా నిరుపేద గర్భిణులకు అందించిన సహాయం రూ.1800 కోట్లు. నిరుపేద వర్గాల వారికోసం రెండు పడకల ఇండ్లనిర్మాణం వేగవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటికే పూర్తయిన ఇండ్లను లబ్ధి దారులకు అందజేశారు. ఇక పలు రకాల ఆసరా పింఛన్ల కింద 45.34 లక్షలమంది లబ్ధిదారులు ప్రతి నెల ఆర్థిక సహా యం పొందుతూనే ఉ న్నారు. మరోవైపు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వా రా లక్షలాది మంది లబ్ధిపొందారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు బీఆర్ఎస్కు ఓటుబ్యాంకు. కాబట్టి రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రభుత్వ పథకాలపై జనాన్ని జాగృతం చేయాల్సిన అవస రం ప్రతి కార్యకర్త మీద ఉన్నది. అందుకు పార్టీ నాయకత్వంతోపాటు అనుబంధ సం ఘాల నాయకులు, ప్రతినిధులను, కార్యకర్తల సేవలను ఉపయోగించుకోవాలి. గ్రామాల్లోనే తిష్ట వేసి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి.
నియోజక వర్గాల్లో ప్రజలకు అవసరమయ్యే పనులను ప్రభుత్వ, అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన ఆ పనులు పూర్తి అయ్యే విధంగా చేయాలి. ప్రస్తుతం బీఆర్ఎస్కు 102 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రానున్న రోజుల్లో పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలంటే ప్రతిపక్షాల ఓటుబ్యాంకును సైతం బీఆర్ఎస్ వైపు మళ్లించాల్సిన అవసరం ఉన్నది . దీనికోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, కల్పించిన ఉద్యోగాలు తదితర అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అప్పుడే ప్రజలకు ప్రభుత్వం చేసిన పనులపై అవగాహన కలుగుతుంది.
బీఆర్ఎస్ ఇప్పుడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ర్టాల్లో విస్తరించి జాతీయ పార్టీగా మారాలనే కాంక్ష, అర్హతలు ఉన్న ఒక బలమైన పార్టీ. నేటి రాజకీయ పరిస్థితులు, ధోరణులను బట్టి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా మారే ఈ సందర్భంలో బీఆర్ఎస్ నేడు దేశంలో బలమైన జాతీయ పార్టీగా అవతరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణాది నుండి విస్తరిస్తున్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ఇది కూ డా బీఆర్ఎస్కు మూడోసారి అవకా శం రావడానికి ఉపయోగపడే ఒక సానుకూల అంశం.
జీ రాజేష్ నాయక్
96035 79115