ఉమ్మడి ఏపీలో అన్నదాతలు అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. నీళ్లు లేక, కరెంటు రాక, ప్రకృతి సహకరించక రైతులు పిట్టల్లా రాలిపోయారు. అప్పటి ప్రభుత్వాలు, పార్టీలు మొసలికన్నీరు కారుస్తూ ఊకదంపుడు మాటలతో రైతులను మోసగించాయి.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పాలన కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమానికి చేపట్టిన పథకాలు విశిష్టమైనవనీ చెప్పాలి. రైతు లేనిదే రాజ్యం లేదని గట్టిగా నమ్మే సీఎం కాబట్టి కేసీఆర్ రైతులను కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులను నింపి నీటినిల్వకు వీలు కల్పించారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో నలుమూలలకు నీటిని పారించారు. 24 గంటల ఉచిత కరెంటుతో బాయిలకాడి కష్టాలకు ముగింపు పలికారు. రైతుబంధుతో సాగు పెట్టుబడి సమకూర్చారు. విత్తనాలు, ఎరువులు సకాలంలో దండిగా సరఫరా అయ్యేలా ఏర్పాట్లుచేశారు. అంతటితో ఆగకుండా ఆరుగాలం కష్టపడి తన కుటుంబానికి కడుపునిండా అన్నం పెట్టే రైతు ఆకస్మికంగా తనువు చాలిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతు బీమా పథకాన్ని రూపొందించారు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి బతుకుదెరువు ఎలా? ఆర్థికసమస్యల నుంచి వారిని గట్టెక్కించేదెవరు? ఈ ప్రశ్నల నుంచి పుట్టిందే రైతు బీమా పథకం.
అన్నదాత కుటుంబానికి రైతుబీమా పథకం అండగా నిలుస్తుంది. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటుంది. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయనివిధంగా రైతులందరికీ ఐదు లక్షల జీవిత బీమా సౌకర్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. రైతులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా ఎంత వ్యయమైనా సరే ప్రభుత్వమే భరిస్తుంది. రైతు ఏ కారణంతో చనిపోయినా తాను ప్రతిపాదించిన నామినీకి పదిరోజుల్లోగా ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఎలాంటి పైరవీ లేకుండా బ్యాంకు ఖాతాలో పైసలు జమవుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు ఎంతో కొంత పరిహారం అందించేవారు. నెలలకొద్దీ ఆఫీసుల చుట్టూ తిరిగితే తప్ప ఆ కొంత పరిహారం కూడా అందేది కాదు. దేశంలోని మిగిలిన రాష్ర్టాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. రైతులకు కేవలం ప్రమాద బీమాను మాత్రమే అమలుచేస్తున్నారు. అంటే రైతు ఏదైనా రోడ్డు యాక్సిడెంట్ లేదా ఇతర ప్రమాదంలో చనిపోతే మాత్రమే తన కుటుంబానికి బీమా వర్తిస్తుంది. లేకుంటే చిల్లిగవ్వ కూడా రాదు. కానీ, తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బీమా పథకం పూర్తిగా భిన్నమైంది. రైతు ఏ కారణంతో మరణించినా తన కుటుంబానికి పరిహారం అందిస్తుంది. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని చెప్పడానికి ఇదే నిదర్శనం. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులు 93 శాతం ఉన్నారు. వీరికి ఈ పథకం ఎంతో భరోసానిస్తుంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన వారికి ఇబ్బందులు లేకుండా చేస్తుంది. ఎదిగిన ఆడపిల్లల పెండ్లిళ్లకు, పిల్లల చదువులకు, ఏదైనా ఉపాధి కోసం డబ్బులు ఉపయోగపడుతున్నాయి.
భూమిని నమ్ముకొని బతికే అన్నదాత కుటుంబాలు రైతు బీమాతో ధీమాగాబతుకుతున్నాయి. ఈ పథకాన్ని అమలుచేసే తీరును చూసి ప్రపంచదేశాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. వివిధ దేశాల్లో రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసిన 20 పథకాల్లో రైతుబీమా పథకం ఉండటం హర్షణీయం.
రైతుల కోసం అమలుచేస్తున్న ఇంత గొప్ప పథకం రైతు కుటుంబాలకు వరం లాంటిదని ఐక్యరాజ్యసమితి ప్రశంసించడం తెలంగాణ ప్రభుత్వం పనితనానికి నిదర్శనం. రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేపడుతుంటే విపక్షాలు పసలేని విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతుల కోసం ఏం చేస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరెన్ని అడ్డంకులు, సవాళ్లు సృష్టించినా అన్నదాతల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధిని విస్మరించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ పదేపదే స్పష్టం చేయడం ప్రశంసనీయం.
(వ్యాసకర్త: సామాజిక విశ్లేషకులు)
డాక్టర్ బొల్లికొండ వీరేందర్
98665 35807