దేశంలో హిందుత్వ శక్తులు ఎక్కువకాలం అధికారంలో ఉంటే.. సమాజంలో ఇంతకాలం నెలకొన్న సామరస్య ధోరణుల్లో, మైనారిటీ ప్రజల జీవన స్థితిగతుల్లో సరిచేయలేని తేడాలు వస్తాయి.
– ప్రొఫెసర్ అశుతోష్ వార్షణే, బ్రౌన్ యూనివర్సిటీ
ఇది అక్షరాలా నిజం. మన దేశంలో కూడా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. దీంతో మన సర్వమత సమాదరణ సంస్కృతి ప్రమాదంలో పడింది. వాస్తవానికి భారతదేశం లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర దేశం. భారత రాజ్యాంగం కులం, మతం, లింగభేదాల ఆధారంగా ఎలాంటి వివక్ష ఉండదని హామీ ఇస్తున్నది. కానీ, దేశంలో నేడు దీనికి విరుద్ధంగా జరుగుతున్నది.
తొమ్మిదేండ్ల కిందట ప్రధానిగా నరేంద్ర మోదీ గద్దెనెక్కిన సందర్భంగా పార్లమెంటులో మాట్లాడుతూ.. ‘మన దేశ గత చరిత్ర అంతా బానిసత్వంలో మునిగిపోయిందని, వంద ల ఏండ్ల బానిస మనస్తత్వం మనలను ఇబ్బంది పెడుతున్నదని విమర్శించారు. కానీ ఇపుడు తమ అసలు సిసలు ఎజెండా ప్రకారమే వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనారిటీ వర్గాలపై వివక్ష పెరిగింది. దీంతో వారు అభద్రతను, ఇబ్బందికర పరిస్థితుల ను ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే, తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు భరోసానిస్తూ, భిన్న సంస్కృతులను, విభిన్న మత ఆచార సంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ గంగా జమున తహజీబ్‌ను కాపాడుతున్నది. కుల మతాలకతీతంగా పేదరికాన్ని పారదోలాలనే దార్శనికతతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. మొదటి నుంచి మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో ఇప్పటికే ఎన్నో పథకాలను అమలుచేస్తూ మైనారిటీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగిస్తున్నది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తున్నది. ఇటీవల జైనులకు మైనారిటీ కమిషన్‌లో చోటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తన చిత్తశుద్ధిని చాటుకున్నది.
మైనారిటీ వర్గాలను ఆదరిస్తూ పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్ మరో నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని బీసీ వర్గాలకు అందిస్తున్న విధంగానే ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన, పారసీ తదితర మైనారిటీ వర్గాల ప్రజలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిందని సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ల సంక్షేమానికి, అభివృద్ధికి చేపట్టిన కార్యాచరణ, అమలుచేస్తున్న పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో అమలుకావడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతర్వాత వారి విద్యా వికాసానికి, వారి సామాజిక, ఆర్థిక ప్రగతికి దోహదం చేసే అనేక పథకాలు, కార్యక్రమాలను తెచ్చి వారిని సంఘంలో ఆత్మగౌరవం, హోదా కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే కార్యాచరణను అమలుచేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం సర్వధర్మ సమ భావనను పాటిస్తూ, ఏ సామాజిక వర్గం పట్ల వివక్ష, విస్మరణ లేకుండా ప్రగతి ఫలాలను అందరికీ అందజేస్తున్నది.
తెలంగాణ ఏర్పడక ముందున్న నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి ఏడాదికి రూ. 300 కోట్లు కూడా ఖర్చుచేసేది కాదు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పదేండ్ల కాలంలో రూ. 8,581 కోట్లను మైనారిటీల సంక్షేమం కోసం ఖర్చుచేసింది. ఈ ఏడాది బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి రూ.2,200 కోట్ల నిధులతో ప్రాధాన్యం పెంచింది.
మైనారిటీల సంక్షేమానికి ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్.. కాంగ్రె స్ పార్టీ పదేండ్లలో కూడా పెట్టలేదంటే.. మైనారిటీ వర్గాల అభ్యున్న తి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తేటతెల్లమవుతున్నది.
వాస్తవంగా ఈ దేశంలో మైనారిటీ వర్గాల ప్రజలు ఇంకా పేదరికంలోనే మగ్గడానికి దశాబ్దాల తరబడి ఈ దేశాన్ని పాలించిన కాంగ్రె స్, బీజేపీలే కారణమని చెప్పకతప్పదు. కానీ, తెలంగాణ ప్రభు త్వం మాత్రం మైనారిటీల పేదరికాన్ని పారదోలేందుకు ఆర్థిక చేయూతనిచ్చే పథకాలు అమలు చేస్తూనే, వారి విద్యకూ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. ఇందులో భాగంగానే దేశంలోనే అత్యధికం గా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించిన ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉర్దూ మీడి యం కూడా అందుబాటులోకి తెచ్చింది. దీంతో మైనారిటీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదుగుతున్నారు. ఈ దేశంలో ఉర్దూ మీడియంలో కూడా నీట్ నిర్వహించాలని అడిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అంటే అతిశయోక్తి కాదు.
మైనారిటీ వర్గాల ప్రజలకు స్వయం ఉపాధి మార్గాలను పెంపొందించేందుకు మైనారిటీ బంధు పథకాన్ని ప్రారంభించి, బ్యాంకులతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రభుత్వమే ఈ ఆర్థికసాయం అందజేయడం గొప్ప విషయం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన క్రిస్టియన్లకు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, అర్హులైన ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన, పారసీ మతాల కు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ లక్ష రూపాయల ఉచిత సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. దేశంలో మైనారిటీల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ మాత్రమే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
(వ్యాసకర్త : బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు భరోసానిస్తూ, భిన్న సంస్కృతులను, విభిన్న మత ఆచార సాంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ గంగా జమున తహజీబ్‌ను కాపాడుతున్నది. కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారదోలాలనే దార్శనికతతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది.