ద్రౌపదికి ఒక్కసారి ఒక్క వస్త్రం ఇచ్చి కాపాడిన శ్రీకృష్ణుడిని మనం దేవుడని కొలుస్తుంటే… మరి, ఈ ప్రపంచ మానవజాతికి జీవితాంతం కావాల్సిన వస్ర్తాలు నేసి ఇచ్చే పద్మశాలీలను మనం ఎంతగా గౌరవించాలి? ఇవీ ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి నేతన్నల గురించి చెప్పిన మాటలు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పద్మశాలీలను సమున్నతంగా గౌరవించి, చేనేత రంగానికి ఎన్నోరకాలుగా చేయూతనందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేసి, నేతన్నల బతుకులను ఛిద్రం చేస్తున్నది. తాజాగా రూ.200 కోట్ల విలువైన వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్‌ను టెస్కోకు ఇవ్వకుండా.. ఈ-టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసి, చేనేతల ఉపాధికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నది. నేతన్నల మగ్గానికి మరణ శాసనం లిఖిస్తున్నది.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో సరైన ప్రోత్సాహం లేక, ముడిసరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో నేతన్నల బతుకులు చితికిపోయాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయి, వేలాది మంది కార్మికుల ఆత్మహత్యలతో సిరిసిల్ల వంటి ప్రాంతాలు ఉరిసిల్లగా మారాయి. ఆనాడు నేతన్నలు ఆకలితో అలమటిస్తుంటే అప్పటి పాలకులు కనీసం పలుకరించిన పాపాన పోలేదు. ఆ చీకటి రోజుల్లో చేనేత కార్మికుడు పడిన శ్రమకు విలువే లేని దుస్థితి తెలంగాణ గుండెల్లో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తలెత్తడానికి గల కారణాల్లో చేనేత కార్మికుల ఆత్మహత్యలు కూడా ఉన్నాయి.
ఉద్యమ నేతగా చేనేత కార్మికుల దుస్థితిని కండ్ల్లారా చూసిన కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరగానే నేతన్నల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అనేక ప్రోత్సాహక పథకాలను అమలు చేశారు. చేనేత కార్మికుడు మరణిస్తే, ఆ కుటుంబానికి రూ.5 లక్షలు అందించే నేతన్న బీమా పథకం అమలు చేశారు. చేనేత కార్మికులు తమ వేతనంలో 8 శాతం పొదుపు చేస్తే, ప్రభుత్వం దానికి రెట్టింపు అంటే 16% నిధులను జమ చేసి నేతన్నకు చేయూత పథకంతో ఆదుకున్నారు. మగ్గంపై పని చేసే ప్రతి కార్మికునికి నెలకు రూ.3,000 నేరుగా వారి ఖాతాల్లో జమ చేసే చేనేత మిత్ర పథకం, నేతన్నలకు పావలా వడ్డీకి రు ణాలందించే పథకం వీటిలో ప్రధానమైనవి. వీటి లో నేతన్నకు చేయూత పథకం కింద ప్రభుత్వం కరోనా సమయంలో కార్మికులకు ముందుగానే నిధులు అందజేసి అండగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులకు పూర్వవైభవం తీసుకురావాలన్న కేసీఆర్ సంకల్పంతో చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపించారు. ‘సిరిసిల్ల ఉరిశాల’ అన్న అపవాదును చెరిపివేశారు. చేనేత కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు ’నేతన్నకు చేయూత పథకం రక్షణగా నిలిచారు. వారి ఆర్థిక పునాదిని బలోపేతం చేశారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో, లాక్డౌన్ సమయంలో నిబంధనలను సడలించి, కార్మికులకు ముందుగానే నిధులు అందించి బీఆర్ఎస్ ప్రభుత్వం మానవత్వాన్ని చాటుకున్నది. ముడి సరుకులు, రసాయనాలపై సబ్సిడీలు అందించడం, పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేయడం వంటి నిర్ణయాలు నేతన్నల ఆత్మగౌరవాన్ని పెంచాయి. నేతన్నల ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు, బతుకమ్మ చీరల ఆర్డర్లతో మగ్గాలకు ఏడాది పొడవునా పని కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. కేసీఆర్ దార్శనికతతో అమలు చేసిన ఈ పథకాలు తెలంగాణ చేనేత రంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టాయి. అన్ని రాష్ర్టాలు తెలంగాణ చేనేత రంగ అభివృద్ధిని అధ్యయనం చేసేలా మారాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రంగానికి చేయూతను అందించకపోగా కోలుకోలేని దెబ్బ తీసింది. బడ్జెట్లో చేనేత కార్మికుల పథకాలకు రూ. 110 కోట్లు కోత విధించింది. నేతన్నల పట్ల తన వైఖరిని మరోసారి నిరూపించుకున్నది. చేనేత కార్మికుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి బడ్జెట్ కేటాయింపుల్లోనే తేటతెల్లమైంది. 2025-26 బడ్జెట్లో చేనేత రంగానికి రూ.368 కోట్లు కేటాయించగా, ప్రస్తుత 2026-27 బడ్జెట్లో ఆ మొత్తాన్ని రూ. 258 కోట్లకు కుదించింది. పెరిగిన నిత్యావసరాల ధరల దృష్ట్యా నిధులు పెంచాల్సింది పోయి, ఉన్న నిధుల్లోనే కోత విధించడం నేతన్నలను వంచించడమే అవుతుంది.
ఎన్నికల ముందు ఆకాశమే హద్దుగా హామీలిచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు బడ్జెట్లో ఆ పథకాల పేర్లే ఎత్తలేదు. నెలకు రూ.3,000 చొప్పున నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామన్న చేనేత మిత్ర ఊసే లేదు. నేతన్నకు చేయూత వంటి త్రిఫ్ట్ పథకాలకు నిధులు కేటాయించకపోవడంతో కార్మికుల పొదుపు మొత్తం గాలిలో దీపంలా మారింది. రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పెద్దలు, ఆచరణలో మాత్రం చేతులెత్తేసింది. నిబంధనల పేరుతో వెరిఫికేషన్ ప్రక్రియను జాప్యం చేస్తూ నేతన్నలను గోస పెడుతున్నది.
కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత నేతన్నల పరిస్థితి నానాటికీ అగమ్యగోచరమవుతున్నది. నేతన్నల ఉపాధికి తీవ్ర విఘాతం కలుగుతున్నది. చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని గొప్పలు చెప్తూ రెండేండ్ల క్రితం జీవో-1 విడుదల చేసిన ప్రభుత్వమే ఇప్పుడు ఆ ఉత్తర్వులకు తూట్లు పొడుస్తున్నది. టెస్కోకు ఇచ్చిన రూ.105 కోట్ల విలువైన యూనిఫామ్ ఆర్డర్‌ను రద్దు చేయడంతో చాలా సాంచాలు నిలిచిపోయాయి. కార్మికులకు ఉపాధిలేకుండా పోయింది. ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తే వస్త్ర ఉత్పత్తి పరిశ్రమ కుదేలై కార్మికలో కం ఆకలికేకల పాలయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. కాంగ్రెస్ ఆర్భాటంగా ప్రచారం చేసిన చేనేత అభయహస్తం పథకం రెండున్నరేండ్లయినా కనీసం ప్రారంభానికే నోచుకోలేదు. నేతన్నల రాజధానిగా పేరొందిన సిరిసిల్లపై ఈ ప్రభుత్వం కక్షగట్టినట్టుగా కనిపిస్తున్నది. రెండేండ్లుగా ఎదురుచూస్తున్న వర్కర్ టు ఓనర్ పథకాన్ని బడ్జెట్లో విస్మరించడం దారుణం. కోటి మంది మహిళలకు కోటి చీరలు ఇస్తామని గొప్పలు చెప్పిన సర్కార్, ఇప్పటి వరకు ఎన్ని పంపిణీ చేసిందో శ్వేతపత్రం విడుదల చేయలేని స్థితిలో ఉన్నది. నేతన్నల ఆత్మహత్యలను నివారించి, వారు గౌరవప్రదంగా బతికేలా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పథకాలను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, వారిని మళ్లీ సంక్షోభంలోకి నెడుతున్నది.
నిధుల లేమి సాకుతో పథకాలను అటకెక్కించడం చేనేత రంగానికి కాంగ్రెస్ చేస్తున్న ద్రోహం కాక మరేమిటి? ఈ బడ్జెట్లో జరిగిన అన్యాయం పట్ల నేత కార్మికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. గతం లో కేసీఆర్ చేనేత రంగాన్ని కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తే, రేవంత్ సర్కార్ కోతలు విధిస్తూ నేతన్నల ఉసురు పోసుకుంటున్నది. ఈ పరిస్థితులను ఇలాగే కొనసాగిస్తూ, చేనేతకు చేయూత అందించకపోతే… సమైక్య రాష్ట్రంలోని సంక్షోభ పరిస్థితులు మళ్లీ తలెత్తే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది.
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యుడు)
-ఎల్.రమణ