‘కరువు వస్తే కొందరికి పండగే..’ ఓ ప్రముఖ జర్నలిస్టు, రచయిత రాసిన పుస్తకంలోని వ్యాఖ్య ఇది. నాడు ఉమ్మడి ఏపీలో టీడీపీ, కాంగ్రెస్‌ల పాలనలో నెలకొన్న పరిస్థితులను చూసి ఆయన ఈ మాట చెప్పారు. రెండు దశాబ్దాల కిందట ఆయన చెప్పిన మాట తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది.
కరువు నిధుల కోసమే హస్తం పాలకులు కరువును అరువు తెచ్చా రు. రాష్ట్రంలో జలాశయాలు నిండుకున్నాయని, భూగర్భ జలా లు అడుగంటిపోయాయని, నీళ్లుంటేనే సాగు చేయాలని స్వయంగా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చెప్పడమే అందుకు నిదర్శనం. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తనతో పాటు కరువును కూడా వెంట తీసుకొచ్చింది. కాంగ్రెస్ హస్తవాసిలో తెలంగాణ పూర్తిగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ అధికారంలోకి రానున్నదని తెలంగాణ ప్రజల కంటే ముందే ప్రకృతి పసిగట్టినట్టుంది. అందుకే ఆ పార్టీ వచ్చి రాగానే 2023 వానకాలంలో చివరి దశలో సాగుచేసిన పంటలు ఎండిపోయాయి. ఆ తర్వాత 2024 యాసంగిలో అసలు సాగే ముందుకు సాగలేదు. పదేండ్ల పాటు పాడి పంటలతో కళకళలాడిన తెలంగాణ ఒక్క ఏడాదిలోనే కరువు ముంగిట నిలిచింది.
ఈ సారి వానకాలంలో గతానికి భిన్నంగా భారీ వర్షాలు కురిశాయి. వరదలు పోటెత్తాయి. రాష్ట్రంలోని చిన్నాచితక ప్రాజెక్టులు మొదలుకొని నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల వంటి జలాశయాలన్నీ నిండాయి. కుంటలు అలుగు పోశాయి. చెరువులు మత్తడి దుంకాయి. రాష్ట్రంలోని కృష్ణా నదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడంతో గేట్లను ఎత్తి సుమారు నెల రోజులపాటు నీళ్లను కిందికి వదిలారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా లక్షల కొద్దీ క్యూసెక్కుల గోదావరి జలాలు సముద్రం పాలయ్యాయి. కానీ, కేసీఆర్‌పై ఉన్న అక్కసుతో బుర్ర లేని కాంగ్రెస్ సర్కార్ పర్రెలను సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి చెరువులను ఎండబెట్టింది. ఫలితంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా కరువు చాయలు అలుముకున్నాయి.
వాస్తవానికి కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు. మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్‌లు, 19 సబ్స్టేషన్లు, 200 కిలోమీటర్ల టన్నెళ్లు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 140 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, ఏటా 240 టీఎంసీల నీటిని ఎత్తిపోసే వ్యవస్థ కాళేశ్వరం. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకసాగర్ కూడా అందులో భాగమే. కుంగిన పిల్లర్లతో సంబంధం లేకుండా నీళ్లను లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు, చెరువులు, కుంటలను నింపి పొలాలకు నీళ్లు పారించవచ్చు. కానీ, రేవంత్‌రెడ్డి సర్కార్ ఆ పని చేయలేదు. అలా చేస్తే తాము గతంలో కాళేశ్వరంపై చేసిన ఆరోపణలు అసత్య ప్రచారమని ప్రజలకు తెలిసిపోతుందని వారు భావించారు. అందుకే, నీళ్లను లిఫ్ట్ చేయలేదు. రేవంత్‌రెడ్డి సర్కార్ చేసిన నిర్వాకం వల్ల ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండుకున్నాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. వాగులు, వంకల్లో రాళ్లు తేలుతున్నాయి. బావులు, బోర్లు నీళ్లు పోయక పంటలు ఎండిపోతున్నాయి. పదేండ్ల కిందట సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి, చివ్వెంల తదితర ప్రాంతాల్లో నీళ్లు లేక కంది, వేరుశనగ పండించేవారు. ఎక్కడో 250 కిలోమీటర్ల దూరంలోని కాళేశ్వరం జలాలు లింగమంతుల స్వామి పాదాలను తడపడంతో గత పదేండ్లపాటు ఆ ప్రాంతాల్లో ఎక్కడచూసినా ధాన్యం రాశులు దర్శనమిచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో నీళ్లు లేక ఆ ప్రాంతాలు మళ్లీ బీడు వారుతున్నాయి.
కృష్ణా నది పరీవాహక ప్రాంతాల పరిస్థితి మరోలా ఉన్నది. ప్రాజెక్టులోని నీళ్లను ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా రేవంత్ రెడ్డి అప్పనంగా అప్పగించడంతో ఇప్పుడు తెలంగాణ రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. నీళ్లుండి కూడా సరిగ్గా వాడుకోలేని అసమర్థ పాలకు ల పుణ్యమాని అన్నదాతలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరి పం టకు ఇంకా కనీసం రెండు నెలల పాటు నీళ్లు అవసరం. ఇప్పటికే రాష్ట్రం లో లక్ష ఎకరాల పంట ఎండిపోయింది. కండ్ల ముందే తమ కష్టం వృథా అవుతుండటంతో రైతులు చెమట చిందించి పొలం పారిస్తున్నా రు. బోర్లు అంతంత మాత్రమే పోస్తున్న తరుణంలో కోతల కరెంటు కర్షకులకు శాపంగా మారింది. ఈ నేపథ్యంలో కనీసం తిండి గింజల పంట చేతికందుతుందో లేదా అస్తవ్యస్తం అవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సంపద సృష్టి గురించి ఏ మాత్రం అవగాహన లేని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాష్ట్రంలో నిధులకు కట కట ఏర్పడింది. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ సమావేశంలో అధికార పార్టీ నేతలే స్వయంగా ఈ విషయం చెప్పారు. సంక్షేమ పథకాలకు నిధుల్లేవు, అభివృద్ధి పనులు జరగడం లేదు, ఏ మొహం పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలు తమ బాధను వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో కావాలనే కరువును తీసుకొచ్చి, పంటలతోపాటు రైతుల డొక్క లు ఎండబెట్టి, కరువు నిధులను మెక్కాలని కాంగ్రెస్ పాలకులు కుయుక్తులు పన్నుతున్నారు.
– (వ్యాసకర్త: రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్)
రాజా వరప్రసాద్ వనారస